రాంగ్ రూట్ | wrong route | Sakshi
Sakshi News home page

రాంగ్ రూట్

Published Mon, Dec 2 2013 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM

wrong route

కడప అర్బన్, న్యూస్‌లైన్ : సమాజాభివృద్ధిలో యువతకు ఎంతో ప్రాధాన్యత ఉంది.  విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాల్సి ఉంది. ప్రస్తుతం యువత దారితప్పుతోంది. దురలవాట్లకు బానిసలై తల్లిదండ్రులకు బాధను మిగిల్చడంతో పాటు సమాజానికి గొడ్డలిపెట్టులా తయారవుతున్నారు. దొంగతనాలు, దొపిడీలు, కిడ్నాప్‌లకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు.  ఉన్నత చదువులు అభ్యసించే వారు కూడా ర్యాగింగ్ పేరుతో వికృత క్రీడకు పాల్పడుతున్నారు.
 
  ఖాజీపేటకు చెందిన రామిరెడ్డి, ఓబుల్‌రెడ్డి అనే వారు  లావ ణ్య అనే మహిళతో  కలిసి గత నెల 4వ తేదీన కడపకు చెందిన శ్రీనివాసులును సెల్ ఫోన్ ద్వారా ముగ్గులోకి దించి తమ వద్దకు రప్పించుకుని కిడ్నాప్ చేశారు. రూ. 35 లక్షలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.  సెల్ ఫోన్ సంభాషణను ఆసరాగా తీసుకుని  బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతుండేవారు.  శ్రీనివాసులు దగ్గర నుంచి  రెండు విడతలుగా రూ. 14.50 లక్షలను వసూలు చేశారు.  మరింత డబ్బును డిమాండ్ చేసే  ప్రయత్నంలో ముఠా మొత్తం పోలీసులకు చిక్కింది.
 
 ముఠాలోని రామిరెడ్డి ఖాజీపేటలో ఓ విద్యాసంస్థను నడుపుతున్నారు.
  సునీల్ గ్యాంగ్ పేరు చెబుతూ ధనుంజయ, రామకృష్ణ, వీరేందర్, వెంకటేష్ అనే వారు  బెదిరింపులు చేసేవారు. ప్రొద్దుటూరుకు చెందిన  ప్రముఖ వైద్య దంపతులు సత్య ప్రసాద్, సంధ్యలకు బెదిరింపు ఫోన్లు చేసి రూ. 30 లక్షలు ఇవ్వాలని  డిమాండ్ చేశారు.   చాకచక్యంగా వలపన్నడంతో ముఠా పోలీసుల చేతికి చిక్కింది. ముఠాలోని వీరేందర్, వెంకటేష్ విద్యార్థులు కావడం గమనార్హం.
 
  వైద్య విద్యను అభ్యసించి సమాజంలో ఉత్తమ వైద్యులుగా తయారు కావాల్సిన కొందరు రిమ్స్ విద్యార్థులు  ర్యాగింగ్ పేరుతో  వికృత చేష్టలకు పాల్పడిన సంఘటన గత నెల 24న వెలుగులోకి వచ్చింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక జూనియర్ విద్యార్థులు  హాస్టల్‌ను విడిచివెళుతున్నారు.
 
  పోలీసుల కళ్లుగప్పి తోట వెంకటరమణ అనే యువకుడు  వరస హత్యలను చేసుకుంటూ పోతున్నాడు. బంధువులనే లక్ష్యంగా చేసుకుని హత్యలను చేస్తుండటం పోలీసులకు  సవాల్‌గా మారింది. ఓబుళాపురం మండలం జీవీపురంలో పోలీస్‌పికెట్ ఉండగానే గత నెల 24వ తేదీన సుబ్రమణ్యం అనే వ్యక్తిని కాల్చి చంపాడు.
 
  కడప చిన్నచౌకు పరిధిలో రమణయ్య, జగదీశ్‌కుమార్‌రెడ్డి అనే యువకులు మహిళలు ఒంటిరిగా కనిపిస్తే చాలు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారు. వీరి దగ్గరి నుంచి గత నెల 28వ తేదీన చిన్నచౌకు పోలీసులు 106 గ్రాముల బరువు ఉన్న  ఆరు బంగారు గొలుసులను, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.  అలాగే గత  నవంబరు నెల 29వ తేదీన ముగ్గురు యువకులు నబీకోట శివాలయం సమీపంలో వరలక్ష్మీ అనే మహిళ మెడలో నుంచి బంగారు ఆభరణాన్ని లాక్కెళ్లే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ ప్రయత్నంలో మహిళతో పాటు యువకులు కూడా గాయపడ్డారు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement