నాగలక్ష్మి: సార్ మాది మూడిళ్లపల్లె గ్రామం. మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో నేను బిజినెస్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నా. నా భర్తకు 27 ఏళ్లు సార్... ఈ వయస్సుకే 24 గంటలూ తాగి మత్తుగా పడి ఉంటాడు. నాకు జీతంగా వచ్చే రూ.ఆరు వేలు అతని తాగుడుకే సరిపోకపోవడంతో రోజూ ఇంట్లో గొడవలే. ఉన్న నాలుగు ఎకరాల పొలంలో రెండు ఎకరాలను అమ్మేందుకు ప్రయత్నిస్తే ఎదురుతిరిగా. పొలాన్ని ఎలాగయినా అమ్మాల్సిందేనని అతను, వద్దని నేను. మా ఊళ్లో బెల్ట్‌షాపు లేకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు సార్. మీ కాళ్లకు దండం పెడతా, బెల్ట్ షాపులు మూయించి పుణ్యం కట్టుకోండి సార్..
జగన్: నిజమే తల్లీ.. తాగుడుతో మనుషుల మధ్య, కుటుంబాలలో ఆత్మీయతలు, అప్యాయతలు తరిగిపోతున్నాయి. అందుకే మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేయాలనుకుంటున్నాం. పిల్లలెంతమంది? ఏం చదువుతున్నారు?
నాగలక్ష్మి: ఇద్దరు పిల్లలు సార్. దగ్గర్లో ఉన్న జ్ఞానజ్యోతి స్కూల్లో చదివించుకుంటున్నా. బెల్ట్‌షాప్‌లు తీసేయించాలని చాలామంది నాయకులను అడిగా. ఎవ్వరూ ఏమీ చేయలేదు. మీ పాదయాత్ర మా ఊరిమీదుగా పోతున్నదని తెలిసి నా ఇద్దరు పిల్లలను తీసుకుని వచ్చా. బెల్ట్‌షాపులు మూయిస్తే నీకు మేం ఆజన్మాంతం రుణపడి ఉంటా.
జగన్: తప్పనిసరిగా తల్లీ. కాస్తంత ఒపిక పట్టండి. మన ప్రభుత్వం రాగానే మీ ఊళ్లో బెల్ట్ షాపు లేకుండా చేస్తా. దశల వారీగా మద్య నిషేధాన్ని తీసుకువస్తాం.
పార్వతమ్మ (పెద్ద జొన్నవరం): అయ్యా, మందుతో ఊళ్లకు ఊళ్లు తాగుబోతులవుతున్నారయ్యా, అప్పులు చేసి పొలం అమ్ముతానంటున్నారయ్యా..
జగన్: అవునమ్మా, తప్పని సరిగా చేద్దాం, మద్య నిషేధాన్ని అమలు చేద్దాం.
– ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment