సాక్షి, ముంబై: సూపర్ మార్కెట్లలో, కిరాణ షాపుల్లోనూ వైన్ విక్రయించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు పోరాటాలకు సిద్ధమవుతుండగా, ప్రముఖ సమాజ సేవకుడు అన్నా హజారే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో స్పష్టం చేయాలని సోమవారం అన్నాహజారే బహిరంగంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఈ నిర్ణయం రైతుల హితవు కోసం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. మరోపక్క వైన్ అంటే మద్యం కాదని కూడా అంటోంది. కానీ ఈ నిర్ణయం భవిష్యత్తులో ఎటు దారి తీస్తుందో’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వైన్ విక్రయం ఎవరికి మేలు చేస్తుందో, ఎవరికి కీడు చేస్తుందో త్వరలో బయటపడు తుందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మన రాజ్యాం గం ప్రకారం ప్రజలను వ్యసనాల నుంచి, మాదక ద్రవ్యాలనుంచి విముక్తి చేయడం, మద్యపానానికి దూరంగా ఉంచడం ప్రభుత్వాల విధి. మద్యానికి వ్యతిరేకంగా ప్రచారాల ద్వారా, జనజాగృతి కార్యక్రమాల ద్వారా ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వమే అదనపు ఆదాయం కోసం వ్యసనాలకు బాట వేసే నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయం తనను కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయం రైతుల హితవు కోసమైతే పేదలు, సాధారణ రైతులు పండించిన పంటలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. కానీ రైతులకు మేలు చేసే అలాంటి చర్యలను విస్మరిస్తూ, యువత భవిష్యత్తును అంధకారంగా మార్చే ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరానికి వెయ్యి కోట్ల లీటర్ల వైన్‌ను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు.
మంత్రులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు
2021 నవంబర్ 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసుకున్న స్కాచ్ విస్కీపై విక్రయ పన్ను 300 శాతం నుంచి 150 శాతానికి కుదించింది. మద్యం ధరలు తగ్గడంతో విక్రయాలు జోరందుకున్నాయి. ఫలితంగా 2.5 లక్షల బాటిళ్ల విక్రయం పెరిగిపోయింది. ప్రభుత్వానికి లభించే రూ.100 కోట్ల ఆదాయం ఏకంగా రూ.250 కోట్లకు చేరుకుంది. ప్రజలు మద్యానికి బానిసలై సర్వం కోల్పోయినా పర్వాలేదు, ఆదాయం పెరిగితే చాలని ప్రభుత్వం అనుకుంటోందా అని హజారే ప్రశ్నించారు. ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, కొందరు మంత్రులు ఈ నిర్ణయాన్ని సమరి్ధస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అదనపు ఆదాయం కోసం మద్యం విక్రయానికి మార్గం సుగమం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడమంటే రాష్ట్ర ప్రజలకు ఇంతకంటే దురదృష్టకరమైన విషయం ఇంకేముంటుందని నిలదీశారు.
ఔరంగాబాద్‌లో విక్రయించండి చూద్దాం: ఇమ్తియాజ్ జలీల్
కిరాణ షాపుల్లోనూ వైన్ విక్రయించేందుకు అనుమతివ్వాలని ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఔరంగాబాద్ ఎంపీ ఇమ్తియాజ్ జలీల్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ లాంటి మహాయోధుడు ఏలిన రాష్ట్రం ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన ఇలాంటి పుణ్యభూమిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదు, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఇంకా ఎవరైనా సరే ఔరంగాబాద్‌కు వచ్చి కిరాణ షాపుల్లో వైన్ విక్రయాన్ని ప్రారంభించి చూపాలని సవాలు విసిరారు.
ఆ తరువాత షాపులను ధ్వంసం చేసే బాధ్యత తమదని స్పష్టం చేశారు. ఇది కేవలం హెచ్చరిక కాదని, ప్రభుత్వానికి బహిరంగంగా సవాలు విసురుతున్నామని ఇమ్తియాజ్ అన్నారు. వైన్ విక్రయాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర సంస్కృతిని చెడగొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. వైన్ విక్రయాలతో రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తే చరస్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల పంటలను కూడా పండించేందుకు అనుమతివ్వాలని ఇమ్తియాజ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
బీజేపీది ద్వంద్వ వైఖరి: భుజ్‌బల్
సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మకాలను అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీని రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ తీవ్రంగా విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లలో పెద్ద మొత్తంలో మద్యం నిల్వ చేసుకోవడానికి అనుమతించిందని, అక్కడ తప్పు కానిది, మహారాష్ట్రలోనే తప్పు అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష బీజేపీది ద్వంద్వ వైఖరి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మకాలను అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్య కచ్చితంగా రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అవుతుందని పేర్కొన్నారు. రైతులకు అదనపు ఆదాయాన్ని అందించే పండ్ల ఆధారిత వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రి నవాబ్ మాలిక్ కూడా వ్యాఖ్యానించారు.
బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో, ప్రభుత్వం పెద్దమొత్తంలో మద్యం విక్రయాలకు, బార్లను సైతం తెరవడానికి అనుమతి ఇచ్చారు. మహారాష్ట్రలోనే బీజేపీకి ఇది తప్పుడు నిర్ణయంగా కనిపిస్తోందా అని మాలిక్ ప్రశ్నించారు. ‘వైన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య పానీయంగా పరిగణిస్తారు. ప్రభుత్వ నిర్ణయం రైతులకు కచ్చితంగా ఆర్థికంగా సహాయపడుతుంది. కొనుగోలు చేయాలనుకునే వారు ఎక్కడి నుంచైనా కొనుగోలు చేస్తారు. మా ప్రభుత్వ నిర్ణయ మాత్రం రైతులకు మేలు చేసేందుకే’ అని ఆయన సమర్థించుకున్నారు.
అయితే ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న సూపర్ మార్కెట్లు వైన్‌ను విక్రయించకూడదని, నిషేధం అమలులో ఉన్న జిల్లాల్లోనూ వైన్ అమ్మకాలను అనుమతించబోమని భుజ్‌బల్ స్పష్టం చేశారు. కాగా, బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించారు. ప్రభుత్వం మద్య నిషేధాన్ని ఉపసంహరించుకుందని, మహారాష్ట్రను ‘మద్య’రాష్ట్ర చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment