జగన్ విడుదలతో వెల్లువెత్తిన జనోత్సాహం
Published Wed, Sep 25 2013 5:38 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
ఇంతకాలం గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానం కట్టలు తెంచుకుంది. ఉత్సాహంతో ఉప్పొంగింది. ఆనందంతో గంతులేసింది. సంతోషాన్ని ఆపుకోలేక సంబరాలు చేసుకుంది. అక్రమ నిర్బంధాలు నేతలను జనం నుంచి దూరం చేయలేవని.. మరింత చేరువ చేస్తాయని జగన్ విడుదల సందర్భంగా వెల్లువెత్తిన ఆనందోత్సాహాలు స్పష్టం చేశాయి. టీవీలకు అతుక్కుపోయి జననేత స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగిడిన దృశ్యాలను వీక్షించిన ప్రజల మొహాలు చిచ్చుబుడ్లలా ఆనందంతో వెలిగిపోయాయి. జగన్నినాదాలు టపాసుల్లా పేలాయి. యువతలో ఉరకలెత్తిన ఉత్సాహం బైకులెక్కి షికార్లు చేసింది. ఈ శుభ సందర్భాన్ని ఎవరికివారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. ప్రధానంగా మూడు రకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అవేమిటంటే..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సామాన్యులు.. సమైక్యవాదులు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు.. అందరిలోనూ ఆనందం వెల్లివిరుస్తోంది. ఉత్సాహం ఉరకలేస్తోంది. కొత్త ధీమా కనిపిస్తోంది. భరోసా వ్యక్తమవుతోంది. అక్రమ నిర్బంధానికి గురైన జన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి కుట్రల సంకెళ్లు తెంచుకొని బయటకు రావడమే దీనికి కారణమని ఆయా వర్గాల మాటలు స్పష్టం చేస్తున్నాయి. చుక్కాని లేని నావలా తయారైన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినట్లేనని సామాన్యులు సంబరపడుతుంటే.. పార్టీకి ఇక ఎదురుండదని.. ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతామని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నాయి.
మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమానికి సై అన్న ఒకే ఒక్క పార్టీ వైఎస్‌ఆర్‌సీపీయేనన్న భావన బలంగా ఉన్న నేపథ్యంలో పార్టీ అధినేత బయటకు రావడంతో ఉద్యమానికి కొత్త ఊపు వస్తుం దని సమైక్యవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్ని వర్గాల్లో నూతనోత్సాహం నింపిన జగన్ విడుదల సందర్భాన్ని వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఒక సంబరంలా సెలబ్రేట్ చేసుకున్నారు. ర్యాలీలు నిర్వహించారు. బాణసంచా పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. కుట్రలు, కుతంత్రాలతో జగన్‌మోహన్‌రెడ్డి బయటకు రాకుండా కేంద్రం, టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ధర్మానికి ఎప్పుడూ ఓటమి ఉండదని రుజువైందని పలువురు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ హనుమంతు కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం యువకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. విజయగణపతి ఆలయంలో పూజలు చేశారు. పార్టీ సమన్వయకర్త వరుదు కల్యాణి, ఇతర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బగ్గు లక్ష్మణరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అందవరపు సూరిబాబు తదితరులు బాణసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్‌ఆర్ అభిమానులు, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. జగన్ నినాదాలతో ఊరూవాడా హోరెత్తించారు. పలు చోట్ల వైఎస్‌ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ అధినేత లేకపోయినా జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీకి ఆదరణ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఏ కార్యక్రమం చేపట్టినా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఇప్పుడు అధినేత బయటకు వచ్చారు. కార్యక్రమాలు ఊపందుకుంటాయి. ఆదరణ రెట్టింపవుతుందన్న ఆనందం పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.
పస్తుతం జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ఆయన ఉత్ప్రేరకమవుతారని భావిస్తున్నారు. జగన్‌ను కలుసుకునేందుకు పలువురు సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులు మంగళవారం రాత్రే బయలుదేరి హైదరాబాద్‌కు వెళ్లారు. బుధవారం లోటస్‌పాండ్ నివాసంలో వారు జగన్‌ను కలువనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతోపాటు ప్రజల్లోకి వెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల విషయంలో ఆయన కీలకమైన సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయని, పనిచేసే వారికే ఆయన గుర్తింపు ఇస్తారు కనుక ఇక నుంచి పార్టీ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయక తప్పదని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా జగన్ విడుదలైన సందర్భంగా అంబరాన్ని తాకిని ప్రజాభిమానం కాంగ్రెస్, టీడీపీలను కంగు తినిపించింది.
Advertisement
Advertisement