వైఎస్‌కు విజయమ్మ నివాళి
వేంపల్లె, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ తన భర్త, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం అనంతపురం జిల్లా కదిరికి వెళ్లారు. అంతకుమునుపు ఆమె బెంగళూరు నుంచి నేరుగా ఇడుపులపాయ ఎస్టేట్‌కు ఉదయం 8గంటలకు చేరుకున్నారు. వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకుని దివంగత నేత వైఎస్‌ఆర్ సమాధి వద్ద పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాస్టర్ నరేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలలో వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. దివంగత నేత ఆశీస్సుల కోసమే విజయమ్మ వచ్చినట్లు వైఎస్‌ఆర్ సీపీ నాయకులు తెలిపారు.
నివాళులర్పించిన వారిలో చక్రాయపేట వైఎస్‌ఆర్ సీపీ ఇన్‌ఛార్జి వైఎస్ కొండారెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, నాయకులు జనార్థన్‌రెడ్డి, కన్వీనర్లు బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, మాజీ ఎంపీటీసీ రవికుమార్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మునిరెడ్డి, యూత్ కన్వీనర్ వెంకటసుబ్బయ్య, హార్టికల్చర్ మాజీ డెరైక్టర్ నాగభూషణరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి వ్యక్తిగత కార్యదర్శులు రామాంజనేయరెడ్డి, ఓబుళరెడ్డి, సర్పంచ్‌లు ఆర్‌ఎల్‌వీ ప్రసాద్‌రెడ్డి, సంజీవరెడ్డి, గఫూర్, పార్థసారథిరెడ్డి, పెద్ద రామయ్య, రఘురామిరెడ్డి, రామగంగిరెడ్డి, శేషు, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, మాలమహానాడు అధ్యక్షుడు కమతం రాజా తదితరులు ఉన్నారు.
కంటతడిపెట్టిన విజయమ్మ :
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద వైఎస్ విజయమ్మ కంటతడిపెట్టారు. కదిరి, పుట్టపర్తి, హిందూపురం తదితర మున్సిపల్ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం కోసం వెళుతూ మహానేత వైఎస్‌ఆర్ ఆశీర్వాదం కోసం ఆమె ఇడుపులపాయకు చేరుకున్నారు. ప్రార్థనలు నిర్వహించే సమయంలో గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకింత ఉద్వేగానికి గురయ్యారు.