
నేటి నుంచి విజయమ్మ జన పథం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ‘జన పథం’ పేరుతో ఆదివారం కదిరిలో మున్సిపల్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. సహకార, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వరుస విజయాలతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు ప్రారంభించనుండటం వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని నింపుతోంది. వివరాల్లోకి వెళితే.. సార్వత్రిక ఎన్నికలకు క్వార్టర్ ఫైనల్స్‌గా భావిస్తోన్న మున్సిపల్ ఎన్నికలను వైఎస్సార్‌సీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై అధికార దుర్వినియోగానికి పాల్పడినా సహకార, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల విజయాన్ని అడ్డుకోలేకపోయాయి.
మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులపై నిర్వహిస్తోండటం వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చే అంశం. ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడం ద్వారా సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్న ప్రాదేశిక ఎన్నికల్లో.. ఫైనల్స్‌గా భావిస్తోన్న సార్వత్రిక ఎన్నికల్లో విజయభేరి మోగించాలని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని రగల్చి.. పార్టీ విధానాలను ప్రజలకు వివరించడానికి ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు వైఎస్ విజయమ్మ జిల్లాలో పర్యటించనున్నారు.
శనివారం రాత్రి పులివెందులకు చేరుకున్న విజయమ్మ.. ఆదివారం ఉదయం ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధిని సందర్శించి, నివాళులు అర్పిస్తారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కదిరికి చేరుకుని రోడ్డు షో నిర్వహించి.. మధ్యాహ్నానికి పుట్టపర్తికి చేరుకుంటారు. అక్కడ రోడ్డు షో నిర్వహించి.. సాయంత్రం ఐదు గంటలకు హిందూపురం చేరుకుని రోడ్డు షో నిర్వహిస్తారు.
హిందూపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి.. రాత్రి అక్కడే బస చేస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన తీరును ప్రజలకు వివరించనున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తారు. ఐదు రోజుల వైఎస్ విజయమ్మ పర్యటనను విజయవంతం చేయడానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేశాయి.
టీడీపీ, కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతే..
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరగా మారింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కుమ్మక్కై తెలుగుజాతిని రెండు ముక్కలు చేశాయి. నాలుగున్నరేళ్లుగా ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపాయి.
పజాకంటక విధానాలు అవలంబించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మున్సిపల్, జెడ్పీ, సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కనివ్వకుండా చేసి.. గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను తిరుగులేని మెజార్టీతో గెలిపించడం ద్వారా రాజన్న రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనకు బ్రహ్మరథం పట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారు.
- ఎం.శంకరనారాయణ, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ