
ప్రభంజనం
భానుడి ప్రతాపాన్ని జనం ఏమాత్రం లెక్క చేయలేదు.. ఇళ్లలో ఉన్న జనం రోడ్లపైకి త రలివచ్చారు.. మహానేత వైఎస్ సతీమణి వచ్చిందంటూ మహిళలు, వృద్ధులు ఇళ్లపెకైక్కి ఆమె ప్రసంగాన్ని విన్నారు.. మహానేత వల్ల లబ్ధి పొందిన వారు రాకపోయినా.. ఇంత మంది గుండెల్లో మేముండటం చూస్తుంటే సంతోషం కలుగుతుందని విజయమ్మ అన్నప్పుడు జై జగన్ అంటూ జనం నినదించారు.
సాక్షి, అనంతపురం : కళ్యాణదుర్గం, రాయదుర్గం పట్టణాల్లో వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రోడ్ షో, సభలకు జనం బ్రహ్మరథం పట్టారు. ప్రధాన రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె జిల్లాలో మూడు రోజులుగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. కళ్యాణదుర్గం, రాయదుర్గంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న విజయమ్మకు మంగళవారం అనంతపురం నుంచి రాయదుర్గం వరకు రోడ్డు వెంబడి ప్రజలు గంటల తరబడి వేచి చూస్తూ ఆప్యాయతతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి వల్ల ఎంతో మంది పదవులు, మరికొందరు ఎన్నో రకాలుగా లబ్ధి పొంది.. తమపై అభిమానం చూపకపోయినా మీరు తమ వెంట ఉంటూ అభిమానం చాటడం తమ కుటుంబం ఎప్పటికీ మరచిపోలేదని చెప్పినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున హర్ష ధ్వానాలతో స్పందించారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రస్తుతం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పేరు ఉచ్చరించడానికే ఇష్టపడటం లేదన్నారు. మేలు చేసిన వారిని మరచిపోయే వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.
‘జగన్‌ను మీ అన్నగా, కొడుకుగా నాలుగున్నరేళ్ల పాటు కాపాడుకున్నారు. ఎన్నికల్లో జగన్‌ను ఆశీర్వదించండి. ప్రస్తుతం ఆగిపోయిన సంక్షేమ పథకాలు తిరిగి మీ చెంతకు చేరుతాయి’ అని ఆమె అన్నప్పుడు మేం గెలిపించుకుంటామంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాయదుర్గం పట్టణానికి విజయమ్మ వస్తున్నారని తెలిసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎదురు చూసి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి, ఆయన కుమారుడు అజయ్ కుమార్‌రెడ్డి, రాయదుర్గం మున్సిపల్ మాజీ చైర్మన్ ఉపేంద్రరెడ్డి, రాయదుర్గం, గుమ్మఘట్ట మాజీ మండలాధ్యక్షులు నాగరాజురెడ్డి, రాఘవరెడ్డితో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, వారి అనుచరవర్గం కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దీంతో నియోజకవర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడు కూడా మిగలకుండా పోయినట్లైంది. విజయమ్మ వెంట అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, సీఈసీ సభ్యుడు ఎల్.ఎం.మోహన్‌రెడ్డి, సమన్వయకర్త తిప్పేస్వామి, నాయకురాలు కాపు భారతి తదితరులు ఉన్నారు.