రాయచోటి న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ రాయచోటి పట్టణంలో బుధవారం నిర్వహించిన రోడ్ షోకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. మధ్యాహ్నం మూడు గంటలకే రోడ్ షో ప్రారంభం కావాల్సి ఉండగా 4:30 గంటలకు ఆలస్యంగా ప్రారంభమైంది. అయినప్పటికీ విజయమ్మ రాకకోసం వేలాది మంది జనం రోడ్లపై వేచి చూశారు.
మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. ముఖ్యంగా ముస్లీం మైనార్టీకి చెందిన మహిళలు మిద్దెలపై వరుస కట్టారు. ఎమెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి మిధున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మోహన్ రెడ్డి, ద్వారకానాధ రెడ్డిలతో కలిసి ప్రారంభమైన రోడ్‌షోకు మాసాపేటలో ఘన స్వాగతం లభించింది.
అనంతరం బండ్లపెంట దర్గా మీదుగా గాంధీ బజార్ నుంచి నవరంగ్ పాదరక్షల దుకాణం సర్కిల్ మీదుగా ఠాణాకు చేరుకుంది. గాంధీ బజార్‌లో వ్యాపారులు పెద్ద ఎత్తున వీధులలోకి వచ్చి మద్దతు తెలిపారు. కొత్తపల్లి ప్రధాన మార్గంలో ముస్లీం మహిళలు మిద్దెల పై నుంచి పూల వర్షం కురిపించారు. అనంతరం సాహిత్యా థియేటర్ మీదుగా రవిహాల్, ఠాణా మీదుగా నేతాజి సర్కిల్‌కు రోడ్‌షో చేరుకుంది.
అప్పటికే అక్కడకు చేరుకున్న వేలాది మంది ప్రజలను ఉద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. ఆమె ప్రతి మాటకు జనం చప్పట్లతో హోరెత్తించారు. చంద్రబాబు చెప్పిన మాటలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని అలాంటి వ్యక్తి మాటలను నమ్మగలరా అన్నందుకు నమ్మలేమంటూ పెద్ద ఎత్తున సమాధానం లభించింది. అనంతరం రోడ్ షో బస్టాండు రోడ్ మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న వైఎస్‌ఆర్ సర్కిల్‌కి చేరుకుంది.
తిరిగి కొత్తపేట జగదాంబసెంటర్ మీదుగా వీఆర్ స్కూల్, అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ మీదుగా చిత్తూరు మార్గంలోకి చేరుకుంది. రోడ్ షో 7 గంటలకు ముగించాల్సి ఉన్నా జనం పోటెత్తడంతో 8:30 గంటలకు పూర్తి చేశారు. రోడ్ షోలో వైఎస్‌ఆర్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని భర్త సలావుద్దీన్, గఫార్ సాహేబ్, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్ రెడ్డి, మాజీ ఎంపీపీలు పోలు సుబ్బారెడ్డి, నరసారెడ్డి, జీఎండీ రఫీ, బషీర్ ఖాన్, దశరధరామిరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, మహమ్మద్, కొలిమి హరూన్ బాషా, జాఫర్ అలీఖాన్, చెన్నూరు అన్వర్ బాషా, అప్జల్ అలీఖాన్, పలువురు నాయకులు పాల్గొన్నారు.