
నేడు వైఎస్ విజయమ్మ రాక
సాక్షి, కడప : వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 3.00 గంటలకు రాయచోటి మున్సిపాలిటీలో ప్రచారంలో పాల్గొననున్నారు. జిల్లాలో నాలుగు రోజులపాటు తొమ్మిది నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు.
కడప కార్పొరేషన్‌తోపాటు రాయచోటి, మైదుకూరు, బద్వేలు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కడప కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలిటీల్లో విజయమ్మ యాత్ర నిర్వహించనున్నారు. 29వ తేదీ కమలాపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొననున్నారు. ఈనెల 28వ తేదీతో మున్సిపోల్స్ ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో మున్సిపాలిటీల్లో ప్రచారం ఇప్పటికే పతాక స్థాయికి చేరింది.
ఇప్పటికే జిల్లాలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు అన్ని విధాల ముందంజలో పయనిస్తున్నారు. ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఈ క్రమంలో వైఎస్ విజయమ్మ యాత్ర పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని నేతలు ధీమాగా ఉన్నారు. వైఎస్ విజయమ్మకు ఘన స్వాగతం పలికేందుకు, సభల నిర్వహణకు సమన్వయకర్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా స్థానిక ఎన్నికల పరిశీలకులు వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితోపాటు జిల్లాలోని ముఖ్య నేతలు విజయమ్మ యాత్రను సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.
బుధవారం ఉదయం విజయమ్మ పులివెందులకు చేరుకుంటారు. అక్కడి నుంచి 3 గంటలకు రాయచోటికి చేరుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
27వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మైదుకూరు, సాయంత్రం 6 గంటలకు బద్వేలులో రోడ్‌షోలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు సిద్దవటంలో రోడ్‌షో నిర్వహిస్తారు.
28వ తేదీ ఉదయం 9 గంటలకు ఎర్రగుంట్లలో, 10.30 గంటలకు ప్రొద్దుటూరులో, మధ్యాహ్నం 3 గంటలకు జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం వేపరాల, దొమ్మరనంద్యాల, ముద్దనూరులలో ప్రచారం కొనసాగిస్తారు.
29వ తేదీ మధ్యాహ్నం నుంచి కమలాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు.