సాక్షి, కడప : రెండవ విడత స్థానిక సమరం పతాక స్థాయికి చేరింది. బుధవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో అభ్యర్థులు గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రచారంతో గ్రామాలు హోరెత్తుతున్నాయి. రెండవ విడత పోలింగ్ సమీపించే కొద్ది గెలుపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలను సంధిస్తున్నారు. నియోజకవర్గ నేతలు ప్రచారానికి గ్రామాల్లోకి వెళ్లి చోటామోటా నాయకులను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తటస్థ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
పోలింగ్ నిర్వహణపై నియోజకవర్గ నేతలు, నాయకులకు తగు సూచనలు, సలహాలు ఇస్తూ బరిలో ఉన్న అభ్యర్థులను అప్రమత్తం చేస్తున్నారు. ఓటర్లకు డబ్బు, మద్యంతో ఎర వేస్తున్నారు. తాయిలాలు ఇచ్చి మచ్చిక చేసుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. చావో రేవో అన్న రీతిలో కొన్నిచోట్ల అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పోలింగ్ జరిగే ప్రాంతాలివే
రెండవ విడత జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లోని 21 మండలాల్లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. మొదటి విడత స్థానిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి ముందు సైకిల్ ముందుకు వెళ్లలేకపోయింది. ఈ ఎన్నికల్లో స్పష్టంగా ఆధిక్యతను ప్రదర్శించింది. రెండవ విడత ఎన్నికల్లో సైతం అదే ఊపును కొనసాగించాలనే ఉత్సాహంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రచారంలో దూసుకు పోతున్నాయి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
కొన్ని ఎంపీటీసీ స్థానాల్లోనైనా గట్టి పోటీ ఇచ్చి పరువు నిలుపుకొనేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోవడం, రాష్ట్ర విభజనకు కొమ్ముకాసిన పార్టీ అంటూ ఓటర్లు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండడంతో ఆ గండం నుంచి ఎలా గట్టెక్కాలని తలలు పట్టుకుంటోంది. ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు పునాది కావడంతో నియోకవర్గంలోని ముఖ్య నేతలు ప్రచారంలో తలమునకలయ్యారు. ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
ముందంజలో వైస్సార్‌సీపీ
ఎన్నికలు జరిగే పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ముందంజలో ఉంది. ఈ పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకలా ఉంది. టీడీపీ అభ్యర్థులు కనీసం గట్టి పోటీ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ తనయుడు భూపేష్‌తోపాటు కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. గెలుపే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లలో మనోధైర్యం నింపేందుకు మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత పి.రామసుబ్బారెడ్డి పడరాని పాట్లు పడుతున్నారు. ప్రొద్దుటూరులో వైఎస్సార్ సీపీ ఓటర్లకు మరింత చేరువవుతోంది.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల అమలుతోపాటు జగన్ సీఎం అయితే అన్ని విధాలా మేలు జరుగుతుందనే సందేశాన్ని ప్రజల్లోకి పంపడంలో అక్కడి నేతలు కృతకృత్యులయ్యారు. ఎమ్మెల్యే లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ ఆ పార్టీలో లుకలుకలు వినిపిస్తున్నాయి.
కమలాపురం నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు విసృ్తతంగా పర్యటించారు. ఓటర్లకు భరోసా ఇస్తూ ఎక్కువ ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకునేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డిలు టీడీపీ తరుపున ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల విశ్వాసం చూరగొనలేక పోతున్నారు. జిల్లాలో టీడీపీ గ డ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ తరుపున పోటీ చేసే అభ్యర్థులు కూడా కరువయ్యారు.
ప్రచార హోరు
Published Wed, Apr 9 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
Advertisement