ఓటరన్నా.. ఈ రోజు మీదే.. ఐదేళ్లకొకసారి వచ్చే ఈ రోజును వినియోగించుకోండి.. మీ సత్తా చూపండి.. మీ వద్ద ఉన్న ఓటు ఆయుధాన్ని సంధించండి.. స్వార్థ చింతన, స్వలాభం చూసుకునే నాయకులను దూరం పెట్టండి.. ఓటేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించు.. డబ్బులు ఇచ్చాడనో.. మద్యం తాగించాడనో ఐదేళ్ల కాలాన్ని వారి చేతిలో పెట్టొద్దు.. నీకు ఎవరైతే న్యాయం చేస్తారో.. సమాజాన్ని బాగు చేస్తారో వారికే ఓటు వేసి తలరాత మార్చుకో..
సాక్షి, కడప : సార్వత్రిక సమరానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమ భవితవ్యం తేల్చే కీలక ఎన్నికలు కావడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశారు. జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 143 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కడప లోక్‌సభ పరిధిలో 14మంది, రాజంపేట లోక్‌సభ పరిధిలో 9 మంది బరిలో ఉన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు మంగళవారం సాయంత్రానికే పోలింగ్ సామగ్రితో సిబ్బంది చేరుకున్నారు. పోలీసులు విసృ్తత బందోబస్తును ఏర్పాటుచేశారు. ఇప్పటికే జిల్లా అధికారులు ఓటర్లకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. ఓటరు స్లిప్పులు అందని వారు ఓటరు లిస్టులో పేరుంటే ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.
జిల్లాలో వైఎస్సార్ సీపీ తరుపున సీఎం రేసులో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల అసెంబ్లీ బరిలో ఉండడంతో దృష్టి అంతా జిల్లాపైనే ఉంది. జిల్లాలోని మొత్తం 21,61,324 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 10,62,758, మహిళలు 10,98,385మంది ఉన్నారు. కడప అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 2,70,045 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా రైల్వేకోడూరు నియోజకవర్గంలో 1,76,576 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా 583 పోలింగ్ కేంద్రాలను, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా 97ను గుర్తించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు రెండు వేల మందితో కూడిన కేంద్ర బలగాలను మోహరింపజేయనున్నారు.
నేడే ఫైనల్స్
Published Wed, May 7 2014 2:30 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM
Advertisement