సాక్షి, కడప : తుది విడత స్థానిక సమరానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. బుధవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్‌కు గడువు 24 గంటలే ఉండడంతో బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపుకోసం చివరి యత్నాలను చేస్తున్నారు. ఓటర్లను డబ్బు, మద్యంతో ప్రలోభ పెట్టి తమవైపునకు తిప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బుతోపాటు చీరెలు, ముక్కుపుడకలు వంటివి సైతం పంపిణీ చేస్తున్నారు.
అధికారులు మాత్రం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లోని 21 మండలాల్లో పోలింగ్ జరగనుంది. గురువారం 21 పంపిణీ కేంద్రాల ద్వారా పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ పేపర్లను పోలింగ్ కేంద్రాలకు చేర్చే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌కోన శశిధర్ ఆధ్వర్యంలో జెడ్పీ సీఈఓ మాల్యాద్రి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల విధుల కోసం నాలుగు వేల మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. కీలక నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు.
హైపర్ సెన్సిటీవ్ పోలింగ్ కేంద్రాలు 402, సెన్సిటీవ్ పోలింగ్ కేంద్రాలు 261, సాధారణ పోలింగ్ కేంద్రాలు 69, సమస్యాత్మకంగా 60 పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఇందులో 168 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్, 400 పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 456 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. డబ్బు, మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘాను ముమ్మరం చేశారు. ఇప్పటికే కోటి రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
తుది సమరానికి సన్నద్ధం
Published Thu, Apr 10 2014 2:19 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement