పుర సమరం నేడే
సాక్షి, కడప :మున్సిపల్ ఎన్నికల సమరం ఆదివారం జరగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు శనివారం రాత్రికే పూర్తి చేశారు. పోలింగ్ సామగ్రితోపాటు సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. 640 పోలింగ్ స్టేషన్లలో 6,56,798 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేశారు. వార్డులలో అభ్యర్థులు తిరిగేందుకు ఒక్క వాహనానికి మాత్రమే అనుమతినిచ్చారు.
స్థానికంగా ఓటు హక్కు లేని రాజకీయ నేతలను పోలింగ్ జరిగే ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. పోలీసుల కన్నుగప్పి జిల్లాలోని కడప కార్పొరేషన్, బద్వేలు, ఎర్రగుంట్ల, మైదుకూరు, జమ్మలమడుగు, రాయచోటి, ప్రొద్దుటూరు, పులివెందుల మున్సిపాలిటీలలో ఓటర్లకు భారీగా డబ్బును పంపిణీ చేశారు.
చివరి క్షణంలో పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు అభ్యర్థులు చేయని ప్రయత్నం లేదు. శుక్రవారం సాయంత్రానికి మద్యం షాపులను మూసివేసినప్పటికీ ఓటర్లకు మద్యం పంపిణీ విచ్చలవిడిగానే సాగింది. ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ద్వారా 228 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు.
ఓటు హక్కు వినియోగించుకునేది వీరే..
కడప కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల్లో మొత్తం జనాభా 8,59,510 మంది కాగా, ఇందులో ఓటు హక్కు కలిగిన వారు 6,56,798 మంది ఉన్నారు. 3,25,235 మంది పురుషులు, 3,31,555 మంది స్త్రీలు ఉన్నారు. ఇందులో ఇతరులు 8 మంది ఉన్నారు.
స్వేచ్ఛగా వినియోగించుకోండి
నిర్భయంగా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇందుకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను చేశాం. ఓటర్‌స్లిప్పులను ప్రతి డివిజన్, వార్డులలో ఇప్పటికే పంపిణీ చేశాం.
- కోన శశిధర్, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి
ఓటర్లలో విశ్వాసం నింపాం
ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడంతోపాటు వారు, ఎలాంటి భయబ్రాంతులకు లోనుకాకుండా విశ్వాసం నింపాం. ఓటర్లకు అవగాహన, మనోధైర్యం నింపేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ద్వారా ఫ్లాగ్‌మార్చ్‌లు నిర్వహించాం. రాజకీయ పార్టీల నేతలతో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేశాం.
- జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ.