జనహోరు
కదిరి జనసముద్రంగా, పుట్టపర్తి జనపర్తిగా, హిందూపురం జనపురంగా మారింది. కనుచూపు మేర జనం.. కదిలి వచ్చిన మహిళాలోకం.. జననేతకే మా మద్దతు అంటూ యువతరం నినదించింది. ఆదివారం వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనకు ‘అనంత’ నీరాజనం పలికింది. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె చేపట్టిన ‘జనపథం’ తొలిరోజు విజయవంతమైంది. అడుగడుగునా జనం అభిమానంతో అడ్డుపడటంతో పర్యటన షెడ్యూలు కంటే ఆలస్యమైనా ప్రజలు పోటెత్తారు.
సాక్షి ప్రతినిధి, కదిరి/పుట్టపర్తి/హిందూపురం : యువ జనం కదం తొక్కింది. మహిళా లోకం కడలిలా కదలి వచ్చింది. పండుటాకులు పోటెత్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకొని చేపట్టిన ‘జనపథం’ కార్యక్రమంలో భాగంగా కదిరి, పుట్టపర్తి, హిందూపురం మున్సిపాలిటీలలో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిర్వహించిన రోడ్ షోలకు జనసంద్రం పోటెత్తింది. యువతీ యువకులు, మహిళలు, వృద్ధులు నీరాజనాలు పలకడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.
వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో ఐదు రోజుల మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం కదిరిలో ప్రారంభించారు. ఆదివారం ఉదయం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ సమాధిని దర్శించుకొని నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. షెడ్యూలు సమయం కన్నా మూడు గంటలు ఆలస్యంగా వచ్చిన విజయమ్మకు కదిరి శివార్లలోని కుటాగుళ్ల వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
మధ్యాహ్నం 12.24 గంటలకు కదిరిలోని బస్టాండ్ సర్కిల్‌కు చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. సభకు హాజరైన వారిలో సింహభాగం మైనార్టీ వర్గాలకు చెందిన మహిలే కావడం గమనార్హం. వైఎస్ విజయమ్మ ప్రసంగానికి జనం నుంచి విశేష స్పందన లభించింది. వైఎస్ జగన్ సీఎం కాగానే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని వైఎస్ విజయమ్మ హామీ ఇవ్వగానే మహిళలు కరతాళ ధ్వనులతో అభినందించారు. వృద్ధులు, వితంతువులకు పెన్షన్లను రూ.200 నుంచి రూ.700లకు పెంచుతామని ఇచ్చిన హామీకి జనం కేరింతలు కొట్టారు.
అమ్మఒడి పథకం ద్వారా ఇద్దరు పిల్లలను చదివించే ప్రతి అమ్మకూ నెల నెలా రూ.1000 ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలపై పదునైన విమర్శలతో విరుచుకుపడుతూ వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగం ఆద్యంతం జనాన్ని ఆకట్టుకుంది. కదిరి బస్టాండ్ సర్కిల్ నుంచి మార్కెట్, జీమాను సర్కిల్, నరసింహ స్వామి దేవాలయం మీదుగా వేమారెడ్డి సర్కిల్ వరకు నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు బారులు తీరి వైఎస్ విజయమ్మపై బంతిపూల వర్షం కురిపించారు.
శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన వైఎస్సార్‌సీపీ కదిరి సమన్వయకర్త ఇస్మాయిల్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ విజయమ్మ పుట్టపర్తికి బయల్దేరారు. పుట్టపర్తికి చేరుకొనే మార్గమధ్యలో ప్రతి పల్లెలోనూ జనమంతా రోడ్లపైకొచ్చి వైఎస్ విజయమ్మకు మద్దతు పలికారు. రెడ్డిపల్లి, నల్లమాడ, చెర్లోపల్లి, వెంగలమ్మ చెరువు గ్రామాల్లో వైఎస్ విజయమ్మపై బంతిపూల వర్షం కురిపించారు. మహిళలు అడుగడుగునా హారతులు పట్టి నీరాజనాలు పలికారు. భారీ జనసందోహం మధ్య పుట్టపర్తి శివారుకు చేరుకున్న వైఎస్ విజయమ్మకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. షెడ్యూలు సమయం కన్నా 3.30 గంటలు ఆలస్యంగా పుట్టపర్తికి చేరుకున్న వైఎస్ విజయమ్మకు ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. సత్యమ్మ దేవాలయం వద్ద బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు, కిరణ్‌లపై పదునైన విమర్శలు చేశారు.
అత్యంత అవినీతి సీఎం చంద్రబాబేనని తెహల్కా డాట్‌కాం 2002లోనే తేల్చిందని, అలాంటి చంద్రబాబు ఈ రోజున వేదాలు వల్లిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యం రామలింగరాజు ఇచ్చిన నగదు మూటలతోనే చంద్రబాబు కుమారుడు లోకేశ్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారని దుయ్యబట్టారు. అయితే చంద్రబాబు మాత్రం ఏ ఒక్క విద్యార్థికీ ఫీజు రీయింబర్స్‌మెంటు ఇచ్చిన పాపాన పోలేదంటూ వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన లభించింది.
పుట్టపర్తిలో సత్యమ్మ గుడి నుంచి వైఎస్ విజయమ్మ ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించి, నివాళులర్పించారు. సత్యసాయిని ప్రేమించే ప్రతి హృదయం వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు. ప్రశాంతి నిలయం నుంచి ఎనుములపల్లి సర్కిల్ వరకు విజయమ్మ రోడ్‌షో నిర్వహించారు. రోడ్డుకిరువైపులా జనం బారులు తీరి వైఎస్ విజయమ్మకు సంఘీభావం ప్రకటించారు. అక్కడి నుంచి హిందూపురానికి బయల్దేరారు.
హిందూపురం చేరుకొనే మార్గమధ్యలో పెడపల్లి, గోరంట్ల క్రాస్, పాలసముద్రం క్రాస్ వద్ద ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి వైఎస్ విజయమ్మకు మద్దతు ప్రకటించారు. షెడ్యూలు సమయం కన్నా 2.54 గంటలు ఆలస్యంగా హిందూపురం శివారులోని కొట్టూరు క్రాస్ వద్దకు చేరుకున్న వైఎస్ విజయమ్మకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆర్టీసీ బస్టాండు, ఎన్టీఆర్ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, ఇందిరాగాంధీ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ సర్కిల్‌వరకు రోడ్డుషో నిర్వహించారు.
ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగాన్ని మళ్లీ చూడగలుగుతామని చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే అమ్మ ఒడి పథకంపై తొలి సంతకం, వృద్ధులకు, వికలాంగులకు రూ.700, వికలాంగులకు రూ.1000 పింఛన్‌గా ఇచ్చేందుకు రెండో సంతకం, రైతులకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధికి మూడో సంతకం, డ్వాక్రా రుణాల మాఫీపై నాలుగో సంతకం చేస్తారని భరోసానిచ్చారు.
34 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ అమలు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీలను, చేయని వాగ్దానాలను కూడా ఐదు సంవత్సరాల పాలనలో అమలు చేసి చూపారన్నారు. వైఎస్ నుంచి విలువలను, విశ్వసనీయతను పుణికిపుచ్చుకున్న జగన్.. చేసిన ప్రతి వాగ్దానాన్నీ అమలు చేసి విశ్వసనీయతను నిలబెట్టుకుంటారంటూ వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి రోజున టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న కదిరి, పుట్టపర్తి, హిందూపురంలో వైఎస్ విజయమ్మ ‘జనపథం’ విజయవంతమవడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.
నేడు వైఎస్ విజయమ్మ పర్యటన ఇలా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన జనపథం కార్యక్రమం సోమవారం మడకశిర, ధర్మవరం, అనంతపురం మున్సిపాలిటీలలో జరగనుంది. ఉదయం 9 గంటలకు మడకశిరలో రోడ్‌షో కార్యక్రమంలో పాల్గొననున్న విజయమ్మ.. అక్కడి నుంచి పెనుకొండ, సీకేపల్లి క్రాస్, ఎన్‌ఎస్ గేటు మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటకు ధర్మవరం చేరుకుంటారు. అక్కడ రోడ్ షో నిర్వహించిన అనంతరం బత్తలపల్లి, ఎస్కేయూనివర్సిటీ మీదుగా సాయంత్రం 5 గంటలకు అనంతపురం నగరానికి చేరుకొని రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం నగరంలో బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి విజయమ్మ ప్రసంగించనున్నారు.