
‘యలమంచిలి’ సీటు కష్టమే!
- ‘దేశం’లో చేరినా దుర్లభమే
- కాస్తయినా కలసిరాని తమ్ముళ్లు
- పాత కేసులతో చిక్కుముళ్లు
యలమంచిలి, న్యూస్‌లైన్: కడుపులో లేని ప్రేమ కౌగిలించుకుంటే వస్తుందా? అన్న సామెత యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు విషయంలో వాస్తవమయ్యేట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ బద్ధ శత్రువులుగా వ్యవహరించిన యలమంచిలి టీడీపీ నాయకులు ఇప్పుడు ఒక్కసారి చేరువైపోయి, ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించాలన్న ఆయన ఆశ అడియాస అయ్యేట్టు స్పష్టమవుతోంది.
పదవిలో ఉన్నప్పుడు యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ నేతలను, కార్యకర్తలను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఘనత ఆయనకుంది. తమను నానా ఇబ్బందులు పెట్టిన వ్యక్తి మళ్లీ తమ పార్టీలోనే చేరడంపై తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహం అవధులు మీరుతోంది. కన్నబాబు తప్పుడు కేసులకు తట్టుకోలేక పలువురు రోజుల తరబడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం విదితమే.
ఇప్పుడు తనకు అవకాశం ఇస్తే కాసుల వర్షం కురిపించగలనంటూ టీడీపీ అధినేత బాబుకు కన్నబాబు హామీ ఇచ్చినట్టు తెలియవస్తోంది చంద్రబాబు తనకు ఎక్కడో ఒక్క చోట టికెట్ ఇస్తారని కన్నబాబు ఆశిస్తున్నారు. యలమంచిలి నియోజకవర్గంలో ఇప్పటికే దేశం పార్టీ ముఖ్యనేతలతో వైరం ఉండడంతో కన్నబాబు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాల్లేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం టికెట్‌ను కన్నబాబు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. లేదంటే విశాఖలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి టికెట్‌ను ఆశిస్తూ దేశం పార్టీలో చేరినట్టు భావిస్తున్నారు.
విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావుకు, కన్నబాబుకు మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కన్నబాబు కేసులకు విసిగిపోయిన టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. తులసీరావు అనుచరుడు ఆడారి ఆదిమూర్తి, కన్నబాబుతో కయ్యానికి దిగారు. కన్నబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీకి ఫిర్యాదుచేశారు. 2004 ఎన్నికలకు ముందు లక్షల్లో ఉన్న కన్నబాబు ఆస్తులు కోట్లకెలా చేరారంటూ వివరాలతో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ విచారణ చేపట్టింది. యలమంచిలి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఆస్తులపై ఆరాతీసింది. ఎమ్మెల్యే ఇళ్లను సోదాచేసి ఆస్తులకు సంబంధించిన పలు పత్రాల వివరాలను సేకరించిం ది.
ఏసీబీ విచారణలో ఉండగానే ఎమ్మెల్యే సాక్షాత్తు ముఖ్యమంత్రి ద్వారానే పైరవీలు ప్రారంభించారు. కానీ కిరణ్ సహకరించలేదని ఇప్పుడు తెలుగుదేశం వారితో బహిరంగంగా అంటున్నారు. తులసీరావుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. తులసీరావుతో విబేధాలు ఉన్న కన్నబాబును టీడీపీలోకి చేర్చుకోవడం తమ్ముళ్లకు కడుపు మండుతోంది. చంద్రబాబు అండతో స్థానిక నాయకులపై ఒత్తిడి తెచ్చి కేసులు ఎత్తివేయించుకోవడానికే కన్నబాబు టీడీపీ బాట పట్టారని వారు విమర్శిస్తున్నారు.