వైఎస్సార్‌సీపీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు చేతికి కట్టు కట్టించుకుంటున్న పద్మావతి
శింగనమల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి – చోటు చేసుకున్న అవినీతి అక్రమాలుపై చర్చకు సిద్దమని చెప్పిన ఎమ్మెల్యే యామినీబాల అడుగు వెనక్కేశారు. వారు చర్చలకు రాకపోగా... వచ్చిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతిని పోలీసుల చేత బలవంతంగా అరెస్ట్ చేయించారు. పోలీసుల ఏకపక్ష వైఖరి మరోసారి వివాదాస్పదమైంది.
అనంతపురం, శింగనమల : ఎమ్మెల్యే యామినీబాల, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతిల బహిరంగ చర్చను పోలీసులు భగ్నం చేశారు. హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరు విడుదల – నియోజకవర్గంలో నీరు, చెట్టు కింద చేపట్టిన పనుల్లో నిధుల దోపిడీ, ఇసుక అక్రమ రవాణా, కాంట్రాక్టు పనుల్లో తీసుకున్న కమీషన్లతోపాటు ప్రజా సమస్యలు, పలు అంశాలపై వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, ఎమ్మెల్యే వారం రోజులపాటు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. నార్పలలోని గాంధీ విగ్రహం వద్ద ఈ నెల రెండో తేదీన చర్చించేందుకు వేదికను నిర్ణయించారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు జొన్నలగడ్డ పద్మావతి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రఘునాథరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు మహాత్మ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ జాతిపితకు పూలమాల వేసి నివాళులర్పించేందుకు ప్రయత్నించగా డీఎస్పీ వెంకట్రావ్ ఆధ్వర్యంలో గార్లదిన్నె ఎస్‌ఐ రాంప్రసాద్, స్పెషల్ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. గాంధీకి పూలమాల వేయడానికి, బహిరంగ చర్చలకు అనుమతించాలని కోరినా ససేమిరా అన్నారు. బలవంతంగా సమన్వయకర్తను అరెస్ట్ చేసి గార్లదిన్నెకు తరలించారు.
మహిళా పోలీసులు లేకుండానే..
మహిళా పోలీసులు లేకుండానే మగ పోలీసులే సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతిని అరెస్టు చేసి బలవంతగా పోలీస్ జీపులోకి ఎక్కించారు. గార్లదిన్నె ఎస్‌ఐ రాంప్రసాద్ డ్రైవ్ చేస్తుండగా.. నార్పల కానిస్టేబుల్ దివాకర్ జీప్ ఎడమ వైపు ఫుట్‌బోర్డుపై నిల్చున్నాడు. జీపు వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి కిందపడబోతూ.. లోపల ముందుసీటులో కడ్డీ పట్టుకుని కూర్చుని ఉన్న సమన్వయకర్త చేతిని ఆసరా కోసం పట్టుకున్నాడు. వాహనం కొద్దిసేపు అలానే ముం దుకు వెళ్లడంతో పద్మావతి చేయిభుజం వద్ద బెణికింది. ఆమే గనుక ఆసరాగా లేకపోయి ఉంటే కానిస్టేబుల్ జీపు కిందపడి ప్రమాదానికి గురయ్యేవాడు.
నొప్పితో విలవిలలాడినా కనికరం లేకపాయె..
భుజం బెణికి నొప్పితో విలవిలలాడుతున్న జొన్నలగడ్డ పద్మావతిని పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. నొప్పి భరించలేకపోతున్నానని ఆమే స్వయంగా చెప్పినా ఎస్‌ఐ రాంప్రసాద్ స్పందించలేదు. డీఎస్పీ వస్తున్నారని పది నిమిషాలు ఆగండని చెప్పి అరగంటయినా పట్టించుకోలేదు. ఈ సందర్భంగా సమన్వయకర్తను వైఎస్సార్‌సీపీ నాయకులు పైలా నరసింహయ్య పరామర్శించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చివరకు సీఐ ప్రసాాద్‌రావు వచ్చాక ఆమెను అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి పంపించారు.
ఆలూరి సాంబశివారెడ్డి హౌస్ ఆరెస్ట్
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, పార్టీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతిలు బహిరంగ చర్చ కోసం నార్పలకు వెళతారని తెలుసుకున్న పోలీసులు అనంతపురంలోని వారి ఇంటివద్దకు వెళ్లారు. అయితే అప్పటికే పద్మావతి నార్పలకు వెళ్లిపోవడంతో.. ఆలూరి సాంబశివారెడ్డిని ఒకరినే హౌస్ అరెస్ట్‌చేశారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రాచమర్యాదలు
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త జొన్నల గడ్డ పద్మావతిని అరెస్టు చేసి గార్లదిన్నె పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన గంట తరువాత అనంతపురం నుంచి ఎమ్మెల్యే యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణిలను పోలీసు బెటాలియన్ రాచమర్యాదలతో నార్పలకు తీసుకొచ్చారు. అరగంట పాటు నార్పల క్రాస్‌లో ప్రజాప్రతినిధులు తమ వాహనాలను ఆపి ఇతర మండలాల నాయకులను అక్కడికి పిలిపించుకొని నార్పలలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు దగ్గరుండి వారిచేత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేయించారు. అనంతరం అక్కడి నుంచి శింగనమలలో జరిగే ‘యువనేస్తం’ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను పోలీసులు తీసుకెళ్లారు. చర్చ జరిగితే తమ అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని ఎమ్మెల్యే భయపడి పోలీసుల చేత అరెస్ట్ చేయించారని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు నారాయణరెడ్డి, సుధాకరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అనంతపురం పార్లమెంటు మహిళా అ«ధ్యక్షురాలు బోయ గిరిజమ్మ, బోయ కొండమ్మ, బండి లలిత కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment