
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్ వరకు తెలుగు భాష తప్పనిసరి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును చూసి నేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హితవు పలికారు. ఆదివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై తెలుగు వ్యక్తిగా ఎంతో గర్విస్తున్నానన్నారు. ఈ విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు.
ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరి చేస్తామని మూడేళ్లుగా చెబుతున్న బాబు.. ఇప్పటి వరకు హామీని అమలు చేయలేదని విమర్శించారు. ఏటా గిడుగు రామ్మూర్తి పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చే ఉపన్యాసంలో తెలుగు భాషను తప్పనిసరి చేస్తామని బాబు చెబుతున్నా ఆచరణలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలు, శిలాఫలకాలను తెలుగులోనే ముద్రించాలని జీవో జారీ చేసినా అమలు చేయడం లేదని మండిపడ్డారు. గోదావరి పుష్కరాల చివరి రోజున చంద్రబాబు ప్రసంగిస్తూ.. రాజమండ్రిలో తెలుగు విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.