‘కరకట్ట’ ఇంటిని బాబు ఖాళీ చేయాలి
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే తన నివాసాన్ని ఖాళీ చేయాలని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మెగసెసె అవార్డ్ గ్రహీత రాజేంద్రసింగ్ డిమాండ్ చేశారు. అమరావతి నది పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలు కట్టారని, సీఎం చంద్రబాబు కూడా నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారన్నారు. కృష్ణానది బచావో పేరిట...కృష్ణానది పరిరక్షణ యాత్ర బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్, పర్యావరణవేత్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ...‘చంద్రబాబు మా మాటలు వినడం లేదు...జగ్గీ వాసుదేవ్ చెబితే వింటారేమో. ఆయన సింగపూర్ మాటలనే ఇష్టపడుతున్నారు. వాళ్లు గాలిలో ఎగురుతారు. మనం భూమి మీద నడుస్తాం.’ అని అన్నారు. కృష్ణానదీ బచావో పాదయాత్ర దేశ వ్యాప్త ఉద్యమం అవుతుందని, ఇది స్థానిక ఉద్యమం కాదని, దేశంలోని అన్ని రాజకీయ పక్ష నేతలను కలుపుకొని కృష్ణానది పరిరక్షణకు చేసే యాత్ర అని అన్నారు. నదుల పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలని రాజేంద్ర సింగ్ కోరారు.
ప్రొఫెసర్ విక్రమ్ సోనీ మాట్లాడుతూ.. నదులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయని, వాటిని నాశనం చేస్తే మానవ మనుగడే కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా కృష్ణానది పరిరక్షణ యాత్ర ఈ నెల 6వ తేదీ వరకూ కొనసాగనుంది. మద్దురు, పాపవినాశనం, హంసలదీవి, పెనుముడి, కొల్లూరు మీదగా బీజాపూర్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు.