
శాసనసభ సమావేశాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాజకీయంగా తల పండిన నేతలతో పోటీపడి గెలుపొందిన ఎనిమిది మంది కొత్త శాసనసభ్యులు మొదటి సారిగా నేడు అసెంబ్లీలో అడుగిడనున్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రెండోసారి తమ ముచ్చట తీర్చుకోనుండగా.. ఇద్దరు మాత్రం అనుభవజ్ఞులు కావడం విశేషం. టీడీపీ తరఫున ఇరువురు కొత్త శాసనసభ్యులు శాసనసభ మెట్లెక్కనున్నారు. వీరంతా గురువారం అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. వారి నియోజకవర్గాల్లో తిష్ట వేసిన సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చూపడం ద్వారా శభాష్ అనిపించుకునేందుకు ఆరాటపడుతున్నారు.
అయితే ఈ విడత శాసనసభ సమావేశాలు ఐదు రోజులే నిర్వహిస్తుండటంతో సమస్యలపై చర్చించే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుణుడు ఊరిస్తున్న నేపథ్యంలో రైతులను విత్తనాలు, ఎరువుల కొరత వేధిస్తోంది. మరీ ముఖ్యంగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా రైతు రుణమాపీ, బంగారంపై తీసుకున్న రుణాల మాఫీలపై అధికారంలోకి రాగానే ఆ పార్టీ మెలిక పెట్టడం అన్నదాతను కలవరపరుస్తోంది.
కమిటీ పేరిట కాలయాపన చేయడం ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి తేవాలో తెలియక.. బ్యాంకర్లు రుణాలు ఇవ్వక వీరిలో అయోమయం నెలకొంది. కొందరు రైతులు అధిక వడ్డీతో అప్పులు చేసి సాగుకు సమాయత్తమవుతున్నారు. అవకాశం వస్తే రైతు సమస్యలపైనే గళం విప్పుతామని శాసనసభ్యులు వెల్లడించారు.
కొత్తే అయినా బాధ్యత మరచిపోను: అసెంబ్లీలో మొట్టమొదటి సారిగా అడుగుపెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నియోజక వర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా పోరాడతా.
- ఐజయ్య, నందికొట్కూరు ఎమ్మెల్యే
ప్రజావాణి వినిపిస్తా
ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తా. తొలిసారిగా గురువారం అసెంబ్లీలో అడుగిడుతున్నందున చాలా సంతోషంగా ఉంది. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. వాగ్దానాలన్నీ నెరవేరుస్తా.
- ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి
ఆలూరు వెనుకబాటుపై గళం విప్పుతా
జిల్లాలో అత్యంత వెనుకబడిన ఆలూరు నియోజకవర్గ అభివృద్ధిపై అసెంబ్లీలో గళం విప్పుతా. మొదటి సారిగా శాసనసభ్యునిగా ఎన్నికైనా.. ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తా. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల నమ్మకం వమ్ము చేయకుండా అభివృద్ధికి పాటుపడతా. నగరడోణ వద్ద రిజర్వాయర్ నిర్మాణం విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.
- గుమ్మనూరు జయరాం, ఆలూరు ఎమ్మెల్యే
కర్నూలు రాజధాని చేయాలని కోరతా
కర్నూలును రాజధాని చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశాలకు హాజరవుతుండటం చాలా సంతోషాన్నిస్తోంది. ప్రమాణ స్వీకారం, సంతాప తీర్మానం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఇలాంటివి ఉండడంతో సమస్యలపై చర్చించే అవకాశం రాకపోవచ్చని భావిస్తున్నా. ఎలాంటి అవకాశం వచ్చినా నియోజకవర్గ సమస్యలపై ప్రణాళికను రూపొందించి చర్చిస్తా.
- కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి
ప్రజా సమస్యలపై మాట్లాడతా
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడానికి అవకాశం వస్తే నంద్యాల ప్రజల సమస్యలపై గళం వినిపిస్తా. నంద్యాల పట్టణంలోని పేద ప్రజలకు 10వేల ఇళ్లను నిర్మించడానికి స్థలాన్ని, ఇళ్లను కేటాయించాలని, పట్టణంలో ప్రజలను ఇబ్బందులు పెడుతున్న పందులను పట్టణ శివార్లకు తరలించాలని కోరతా. జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న శనగలకు మద్దతు ధరను కేటాయించాలని సమావేశం దృష్టికి తీసుకెళ్తా. అదేవిధంగా రుణ మాఫీపై అధికార పార్టీని నిలదీసి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తా. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల తరఫున పోరాటం సాగిస్తాం.
- భూమానాగిరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే
మౌలికసదుపాయాలపై ప్రస్తావిస్తా
నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాల కల్పనపై అసెంబ్లీలో చర్చిస్తా. ప్రధాన సమస్యలు తాగునీరు, రైతులకు సాగునీరు, అలాగే రోడ్లనిర్మాణాలు, డ్రైనీజీలు, చెరువుల మరమ్మతులు, ఫించన్లు, ప్రభుత్వ గృహనిర్మాణాలు వీటితో పాటు మరెన్నో సమ్మస్యలపై ప్రస్తావిస్తా. నియోజకవర్గంలోని అన్ని సమ్మస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధుల మంజారుకు కృషి చేస్తా. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి రాకముందు రైతులకు రుణమాఫీ ప్రకటించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీపై కమీటీ పేరుతో కాలయాపన చేయడం బాధాకరం. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి హామీ అమలు చేసేలా చూస్తాం.
- బాలనాగిరెడ్డి ఎమ్మెల్యే, మంత్రాలయం
రైతు రుణ మాఫీపై గళం
రుణాలు మాఫీ అవుతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అవకాశం వస్తే అసెంబ్లీలో రుణాల మాఫీకి పట్టుబడతా. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి పోరాడతా. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో.. తన తండ్రి స్వర్గీయ శిఖామణి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా. - మణిగాంధీ, కోడుమూరు ఎమ్మెల్యే
రుణ మాఫీపై ఒత్తిడి చేస్తాం
రైతులు తీసుకున్న అన్ని రకాల రుణ మాఫీ చేయాలని కోరతా. వికలాంగులకు నెలకు రూ. 1500 అందివ్వాలని, ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ఇచ్చిన హామీలు అమలుపరచే విధంగా ఒత్తిడి తీసుకొస్తా. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా.
- పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
నియోజకవర్గ సమస్యలపై గళం
శ్రీశైల నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్యలను అసెంబ్లీ చర్చిస్తా. నియోజకవర్గం ఎమ్మెల్యేగా తొలిసారిగా శాసనసభలో అడుగు పెడుతున్నందున ఎంతో ఆనందంగా ఉంది. టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా పోరాటం సాగిస్తా.
- బుడ్డా రాజశేఖరరెడ్డి, శ్రీశైలం