
యోగం ట్రేడర్స్ మాయాజాలం..
ఉయ్యూరు : పట్టణంలోని యోగం ట్రేడర్స్ మాయాజాలంపై జనం తిరగబడ్డారు. సగం రేట్లకే గృహోపకరణాల వస్తువులు ఇస్తానని నమ్మించి లక్షలాది రూపాయలు సొమ్ము వసూలు చేసి నిర్వాహకుడు కనిపించకుండా పోయాడు. దీంతో బాధితులు తాము కట్టిన సొమ్ము చెల్లించాలంటూ మంగళవారం సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో టౌన్, రూరల్ ఎస్‌ఐలు జానకిరామయ్య, యువకుమార్‌లు సిబ్బందితో వచ్చి బాధితులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
రూ.12 లక్షలకు టోకరా !
తమిళనాడు రాష్ట్రం వెంపంగుడి ప్రాంతానికి చెందిన స్వామినాధన్ ఉయ్యూరులోని కాకాని గిరిజన కాలనీలో రెండు వారాల క్రితం యోగం ట్రేడర్స్ ఏర్పాటు చేశారు. రూ.100 విలువైన వస్తువును రూ.55కే ఇస్తానని ప్రకటనలు గుప్పించాడు. 650 మంది వద్ద నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేశాడు.
స్కీమ్‌లో చేరిన వారిలో ఒక్కొక్కరూ వెయ్యి నుంచి రూ.30 వేల వరకు కట్టారు. తొలుత కొంతమందికి వస్తువులు అందజేసి ఖాతాదారుల నమ్మకం పొందాడు. సగం ధరకే వస్తువులు వస్తున్నాయన్న ప్రచారం ఆ నోట, ఈ నోట పట్టణమంతా పాకడంతో స్కీం కింద డబ్బులు కట్టి వస్తువులు పొందేందుకు జనం బారులు తీరారు. షాప్ పెట్టిన తొమ్మిది రోజులకే 650 మంది వద్ద రూ.12 లక్షల వరకు వసూలు చేశాడు. ఈ విషయం బయటకు పొక్కడం.. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది యోగం ట్రేడర్స్‌పై నిఘా ఉంచారు. పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించడం తో టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసుల అదుపులో స్వామినాధన్ ?
స్వామినాధన్ గత ఐదు రోజుల నుంచి పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారం రోజుల క్రితం గిరిజన కాలనీకి చెందిన యోగం ట్రేడర్స్ బాధితులు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై ఆయన పోలీసు అధికారులతో మాట్లాడి న్యా యం చేయాల్సిందిగా కోరారు.
పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టౌన్ పోలీసులు స్వామినాధన్‌తో విచారణ జరిపి, అతడి గుట్టును రట్టు చేసేందుకు యత్నిస్తున్నారు. బాధితుల్లో ఇప్పటి వరకు 105 మందికి రూ.1.10 లక్షలు విలువ చేసే వస్తువులను అందజేసినట్లు స్వామినాధన్ పోలీసులకు చెబుతున్నాడు. మరో రూ.4 లక్షలు విలువ చేసే గృహోపకరణాలు దుకాణంలో ఉన్నాయి. రూ.7 లక్షల వరకు సొమ్ము ఏమైందో తేలాల్సి ఉంది.
న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే బోడే ప్రసాద్
యోగం ట్రేడర్స్ మాయాజాలంపై స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పందించారు. మంగళవారం సంస్థ కార్యాయలం వద్దకు వచ్చి, బాధితులతో మాట్లాడారు. కట్టిన సొమ్ము తిరిగి ఇప్పించేలా పోలీసు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.