దుబ్బాక, న్యూస్‌లైన్: ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన మంగళవారం సాయంత్రం దుబ్బాకలో జరిగింది. ఎంతో గారాభంగా చూసుకుంటున్న తమ గారాల పట్టి ఇక లేదన్న విషయం తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి అక్కడున్న వారు కూడా కంటతడిపెట్టారు. అందరినీ కలచి వేసిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాక మండలం బల్వంతాపూర్‌లోని పద్మశాలిగడ్డకు చెందిన పారుపల్లి శ్రీనివాస్, అనురాధ దంపతులకు కూతురు శ్రీనిధి(6), కుమారుడు నిఖిల్‌లు సంతానం. వీరిద్దరూ ప్రస్తుతం గ్రామానికి 4 కి.మీ దూరంలో ఉన్న దుబ్బాకలో గాయత్రి వివేకానంద విద్యాలయంలో చదువుకుంటున్నారు.
రోజూ గ్రామానికే చెందిన రవీందర్ ఆటోలో పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలోనే రోజు మాదిరిగానే అనురాధ తన పిల్లలు శ్రీనిధి, నిఖిల్‌లను మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఆటోలో పాఠశాలకు పంపించింది. బడి ముగిశాక సాయంత్రం 5గంటల సమయంలో పాఠశాల నుంచి విద్యార్థులను ఆటోలో ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఆటోలో 25 మంది వరకు విద్యార్థులుండటంతో, డ్రైవర్ రవీందర్ తన పక్కన కూడా విద్యార్థులను కూర్చోపెట్టుకుని నడిపిస్తున్నాడు. ఇందులో యూకేజీ చదువుతోన్న శ్రీనిధి ఉంది. కొంత దూరం ప్రయాణించాక బీసీ కాలనీ సమీపంలో ఆటోలో నుంచి శ్రీనిధి జారిపడిపోయింది. ఇది గమనించని డ్రైవర్ అలాగే ముందుకు వెళ్లడంతో ఆటో వెనుక చక్రం శ్రీనిధి తలపై నుంచి పోయింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసిన తోటి విద్యార్థులాంత షాక్‌కు గురయ్యారు. స్థానికులు వెంటనే ఆటోలో ఉన్న మిగతా విద్యార్థులను మరో ఆటోలో గ్రామానికి పంపించారు. విషయం తెలుసుకున్న శ్రీనిధి తల్లిదండ్రులు , గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న దుబ్బాక ఎస్‌ఐ లెనిన్‌బాబు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఆరేళ్లకే..నూరేళ్లు నిండయా తల్లీ...
‘‘అయ్యో.. దేవుడా ఎంత పని చేశావయ్యా..మా పప్పిని(శ్రీనిధిని) మా నుంచి దూరం చేశావా..మేమేం పాపం చేశామయ్యా’’ అంటూ తల్లిదండ్రులు అనురాధ, శ్రీనివాస్‌లు సంఘటనా స్థలంలో రోదించిన తీరు చూసి అక్కడున్న వారు సైతం కంటతడిపెట్టారు. చిన్నారి మృతదేహం వద్ద గుండెలు బాదుకుంటూ ఆరేళ్ల వయసులోనే నీకు నూరేళ్లు నిండాయా అంటూ రోదించిన ఆ దంపతులు అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు.
చక్రాలకింద నలిగిన చిన్నారి
Published Wed, Sep 18 2013 1:05 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement
Advertisement