విహారయాత్రలో విషాదం
- కృష్ణానదిలో మునిగి ఇద్దరు యువ ఇంజనీర్ల గల్లంతు
- అమరావతికి వెళ్లిన 12 మంది ఇంజనీర్ల బృందం
- వైకుంఠపురం వద్ద స్నానానికి దిగి నీట మునక
- కొనసాగుతున్న గాలింపు
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : అప్పటివరకు తమతోనే ఉండి సందడి చేసిన యువ ఇంజనీర్లు కృష్ణమ్మ ఒడిలో కలిసిపోవడం ఎన్టీటీపీఎస్ శిక్షణ బృందంలో విషాదం నింపింది. అమరావతికి విహార యాత్ర కోసం వెళ్లిన యువ ఇంజనీర్ల బృందంలో ఇద్దరు తిరుగు ప్రయాణంలో గుంటూరు జిల్లా వైకుంఠపురం వద్ద నీటమునిగి గల్లంతయ్యారు. ఆదివారం రాత్రికి వారి మృతదేహాలను గుర్తించారు. స్థానిక ఎన్టీటీపీఎస్ ఇంజనీర్ల శిక్షణా కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న యువ ఇంజనీర్లు 12 మంది కలిసి ఆదివారం గుంటూరు జిల్లా అమరావతికి పడవపై వెళ్లారు.
అక్కడ నుంచి సాయంత్రం 5.30 గంటలకు వైకుంఠపురం చేరుకున్నారు. అక్కడ ఇసుక ర్యాంప్ వద్ద యువ ఇంజనీర్లు పాండురంగారావు, సందీప్ శ్యాంసన్ నదిలో స్నానం చేయడానికి దిగారు. అక్కడ ఊబి ఉండటంతో నీటమునిగి గల్లంతయ్యారు. సహచరులు తమ కళ్లముందే గల్లంతు కావడంతో తోటి ఇంజనీర్లు విషాదంలో మునిగిపోయారు. గల్లంతైన యువ ఇంజనీర్ల ఆచూకీ తెలుసుకోవడం కోసం స్థానిక ఎన్టీటీపీఎస్‌కు చెందిన ఇంజనీర్లు రాత్రికి ఫెర్రి ఘాట్‌కు చేరుకుని అక్కడి గజ ఈతగాళ్ల సహాయం కోరారు.
అక్కడ పొద్దుపోవడంతో వారి ఆచూకీ కనుగొనడం కష్టతరమైంది. ఆదివారం రాత్రి వరకు గాలింపు కొనసాగుతోంది. అంతకుముందు ఇబ్రహీంపట్నం తహశీల్దారు హరిహర బ్రహ్మయ్య ఘటన సమాచారం తెలుసుకొని ఫెర్రి ఘాట్‌కు చేరుకుని ఇంజనీర్లతో మాట్లాడారు. వారి ఆచూకీ తెలుసుకోవడానికి గుంటూరు జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమ, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఇబ్రహీంపట్నం చేరుకున్నారు.
గాలింపు చర్యల కోసం కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పాండురంగారావు (23) స్థానిక ఎన్టీటీపీఎస్‌లోని రెండో దశలో సహాయక ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. గల్లంతైన మరో యువ ఇంజనీర్ సందీప్ శ్యాంసన్ కడప జిల్లా ముద్దనూరు థర్మల్ స్టేషన్‌లో ఏఈగా పనిచేస్తున్నాడు. యాత్రకు వెళ్లిన ఇంజనీర్లు అందరూ 2012 బ్యాచ్‌కి చెందినవారు. వివిధ థర్మల్ స్టేషన్‌లకి చెందిన వీరంతా స్థానిక ఎన్టీటీపీఎస్ ఇంజనీర్ల శిక్షణా కేంద్ర ంలో గత మూడు నెలలుగా శిక్షణ పొందుతున్నారు. తాడేపల్లిగూడేనికి చెందిన పాండురంగారావు స్థానిక ఎన్టీటీపీఎస్ సెక్యూరిటీ కాలనీలో ఉంటున్నాడు.