పరిగి, న్యూస్‌లైన్: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఛాతీభాగంలో గాయం, మెడపై గాట్లు ఉన్నాయి. హత్యేనని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన పరిగిలో గురువారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన చాకలి శ్రీనివాస్(32) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సెలవుపై అతడు ఇటీవల ఇంటికి వచ్చాడు. గురువారం సాయంత్రం బయటకు వెళ్లిన శ్రీనివాస్ తిరిగి అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటి వచ్చాడు. అరగంట తర్వాత వాంతులు చేసుకున్నాడు. కడుపు, ఛాతీభాగంలో నొప్పిగా ఉందని కూలబడిపోయాడు. అతడిని వెంటనే 108 వాహనంలో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించి అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా శ్రీనివాస్ మృతిపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం పరిగికి చెందిన శ్రీనివాస్ స్నేహితులు నలుగురు ఇంటికి వచ్చి అతడిని తీసుకొని వెళ్లారని, పేకాట ఆడే క్రమంలో గొడవపడి మద్యం తాగించి తీవ్రంగా దాడి చేయడంతో మృతిచెంది ఉండొచ్చని ఆరోపించారు. నలుగురి పేర్లు సూచిస్తూ వారే తన భర్తపై దాడి చేసి హత్య చేశారని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా శ్రీనివాస్ ఛాతీభాగంలో కమిలిపోయినట్లుగా గాయం ఉంది. మెడభాగంలో గాట్లు ఉన్నాయి. ఇది కుటుంబీకుల ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. శ్రీనివాస్‌కు భార్య అనురాధ, కుమారుడు కార్తీక్(5), కూతురు స్వాతి(3) ఉన్నారు. మృతదేహానికి పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉందని ఎస్‌ఐ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
యువకుడి అనుమానాస్పద మృతి
Published Sat, Jan 11 2014 12:05 AM | Last Updated on Wed, Aug 1 2018 2:31 PM
Advertisement
Advertisement