నందిగాం: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు నేలబావిలో శవమై తేలాడు. మృతుడు పలాస మండల మాజీ అధ్యక్షుడు నిమ్మాన బైరాగి (కాపు బైరాగి) నాలుగో కుమారుడు దుర్యోధన అలియాస్ చిన్నారి (27)గా గుర్తించారు. నందిగాం మండలం జాతీయ రహదారి సుభద్రాపురం సమీపంలోని నేల బావిలో బైరాగి శవాన్ని శనివారం ఉదయం కనుగొన్నారు. పాతకక్షల నేపథ్యంలో తన కుమారుడుని హత్య చేసి బావిలో పడేసి ఉంటారని మృతుని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ సఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
శుక్రవారం ఉదయం ఏడు గంటల సమయంలో కాశీబుగ్గ మార్కెట్‌కు వెళ్తానని చెప్పి దుర్యోధన ఇంటి నుంచి వెళ్లి..ఆ తరువాత నుంచి కనిపించలేదు. దీంతో పరిసర ప్రాంతాల్లో వెతకడంతోపాటు.. బంధువులను ఆరా తీశారు. ఈ క్రమంలో నందిగాం ప్రాంతంలో గాలిస్తుండగా సుభద్రాపురం సమీపంలో రోడ్డు పక్కనే ఏపీ 30 క్యూ 7411 నంబరు గల ద్విచక్రవాహనం నిలుపుదల చేసి ఉండటాన్ని శనివారం ఉదయం గుర్తించారు. దీంతో సమీపంలో ఉన్న నేలబావిలోకి చూడగా దుర్యోధన శవమై తేలి కనిపించాడు. నందిగాం ఎస్సై సీహెచ్ ప్రసాద్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాశీబుగ్గ డీఎస్సీ దేవప్రసాద్‌కు సమాచారం అందించారు. టెక్కలి సీఐ భవానీప్రసాద్‌తో కలిపి సంఘటనా స్థలంలో వివరాలు సేకరించారు.
పాత కక్షలే కారణమా?
పాతకక్షల నేపథ్యంలో దుర్యోధనను హత్య చేసి ఉంటారని అతని కటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీపీ నిమ్మాన బైరాగి రెండో కుమారుడు గణేష్ 2011 జూన్ ఒకటో తేదీన హత్యకు గురయ్యాడు. పలాస పట్టణానికి చెందిన బూర్జపేట సూర్యనారాయణతోపాటు ఎన్.బాలకృష్ణ, అప్పారావులు గొప్పిలి సమీపంలోని ఒడిశా సరిహద్దులో గణేష్‌ను హత్య చేసినట్లు నిమ్మాన బైరాగి తెలిపారు. ఆ కేసులో ఇటీవలే సోంపేట కోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించిందన్నారు.
హంతకులకు శిక్ష పడినట్టు చెప్పారు. ఈ కక్షతోనే తన నాలుగో కుమారుడు దుర్యోధనను హతమార్చినట్టు అనుమానం వ్యక్తం చేశాడు. మృతుని ముంజేటి మణికట్టుపై బ్లేడుతో కోసినట్టు ఉండడంతో హత్యాగా భావిస్తూ పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం ఎలాంటి అనుమానం లేదని, బావిలో పడి చనిపోయినట్టు పేర్కొన్నారు. దుర్యోధన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి !
Published Sun, Jul 12 2015 1:18 AM | Last Updated on Wed, Aug 1 2018 2:35 PM
Advertisement
Advertisement