ఒంగోలు సబర్బన్: కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రేమ వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారి యువకుడు ఆత్మహత్యకు దారి తీసింది. దీంతో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందుకు కారకులని భావించిన వ్యక్తి ఇంటిపై దాడికి ఉపక్రమించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాలలోకి వెళితే..
ఈతముక్కుల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన దాసరి వెంకట కృష్ణ(22)మంగళవారం పురుగుమందు సేవించడంతో కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. దీంతో అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వెంకట కృష్ణ మృతికి గ్రామానికి చెందిన బత్తుల అయిబాబు కారణమని భావించిన మృతుని సంబంధీకులు అతని ఇంటిపై దాడికి పూనుకున్నారు. అనేక మంది అతని ఇంటిని చుట్టుముట్టారు. దీంతో అయిబాబు ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నాడు. దీంతో గ్రామంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని పరిస్థితుల సమాచారం అందుకున్న కొత్తపట్నం ఎస్సై సీహెచ్ శివ బసవరాజు తన సిబ్బందితో ఈతముక్కల చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. చివరకు పోలీసుల మీద డాడికి దిగే పరిస్థితి గ్రామంలో నెలకొంది. పోలీసులు ఉన్నా అయిబాబు ఇంటిపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ సందర్భంలో కొత్తపట్నం ఏఎస్సైకి ఒకరి కాలికి గాయం కూడా అయింది. దీంతో అప్రమత్తమయిన ఎస్సై శివ బసవ రాజు సమాచారాన్ని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు.
అదనపు బలగాలు పురమాయింపు
జిల్లా అదనపు ఎస్పీ కె.లావణ్య లక్ష్మి ఒంగోలు నుంచి అదనపు బలగాలను గ్రామానికి పంపించారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాక పోవడంతో ప్రత్యేక పోలీస్ బలగాలతో పాటు చీరాల, కందుకూరు డీఎస్పీలను కూడా ఈతముక్కల గ్రామానికి పురమాయించారు. నేరుగా ఏఎస్పీ లావణ్య లక్ష్మి రంగంలోకి దిగారు. రెవెన్యూ అధికారులను కూడా గ్రామానికి పిలిపించి శాంతి భద్రతలను కాపాడే పనిలో పడ్డారు. ఆందోళనకారులతో రెవెన్యూ, పోలీస్ అధికారులు చర్చలు జరిపారు. దాసరి వెంకట కృష్ణ మృతికి కారణమైన అయిబాబు అరెస్ట్ చేయాలని, అతనిపై రౌడీ షీట్ తెరవాలని డిమాండ్ చేశారు. ఉదయం ప్రారంభమైన ఆందోళనలు మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగాయి. చివరకు రాళ్ల దాడిలో మరో కానిస్టేబుల్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. పోలీస్ ఉన్నతాధికారుల చొరవతో ఉద్రిక్తత తాత్కాలికంగా సద్దుమణిగింది. గ్రామం పూర్తిగా పోలీస్ కనుసన్నల్లో కొనసాగుతుంది.
అసలేం జరిగిందంటే....
గ్రామానికి చెందిన మృతుడు దాసరి వెంకట కృష్ణ గతంలో అతని సామాజిక వర్గానికే చెందిన మైనర్ బాలకను ప్రేమిస్తున్నాడు. ఓ వైపు ప్రేమ కావడంతో ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులు గతంలో వెంకట కృష్ణను మందలించారు. అయినా వినక పోవడంతో ఆరు నెలల క్రితం మైనర్ బాలిక తండ్రి లేక పోవడంతో బాలిక మేనమామ అయిన బత్తుల అయిబాబు కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌లో వెంకట కృష్ణపై ఫిర్యాదు చేశారు. దీంతో కొత్తపట్నం పోలీసులు వెంకట కృష్ణపై ఫోక్సా యాక్టు కింద కేసు నమోదు చేశారు. దీంతో వెంకట కృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అనంతరం రిమాండ్ నుంచి బయటకు వచ్చాడు. గ్రామంలోని పెద్దలు జోక్యం చేసుకుని బాలికకు మైనారిటీ తీరిన తర్వాతే ఇరువురికి వివాహం చేయడానికి రెండు కుటుంబాలకు చెందిన వారిని ఒప్పించారు. ఈ మధ్యలో కొందరు వెంకట కృష్ణకు లేని పోని మాటలు చెప్పడంతో దీంతో రెండు కుటుంబాల మధ్య కొంత మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. ఏం జరిగిందో ఏమో కాని మైనర్ బాలిక గత సోమవారం చీమల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పూనుకుంది. అప్పట్లో పోలీసులు ఆత్మహత్యాయత్నంపై విచారణ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.
రెండో కేసు కూడా చుట్టు కుంటుందేమోనని..!
గతంలో ఫోక్సా చట్టం కింద నమోదు చేసిన కేసులో రిమాండ్‌కు వెళ్లి వచ్చిన వెంకట కృష్ణ రెండో కేసు కూడా తనకు చుట్టుకుంటుందని భావించి పురుగుల మందు తాగి ఉంటాడని గ్రామస్తులు భావించారు. చివరకు వెంకట కృష్ణ రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అందుకు కారణం బాలిక మేనమామ బత్తుల అయిబాబు అని మృతుని బంధువులు అతనిపై దాడికి పూనుకున్నారు.
సాక్షి విలేకరి వెంకట్రావుపై దాడి
కొత్తపట్నం సాక్షి విలేకరిగా పనిచేస్తున్న బి.వెంకట్రావుపై గ్రామంలో ఆందోళన చేస్తున్న వారు కొందరు దాడికి దిగారు. వార్త సేకరణ కోసం వెళ్లిన అతను ఆందోళనను ఫోటోలు తీస్తుంటే కేమెరాను లాక్కున్నారు. అనంతరం గుంపుగా వచ్చి దాడి చేసి కొట్టారు. మైనర్ బాలిక ఆత్మహత్యాయత్యానికి సంబంధించిన కథనం రాసినందుకు, ఆ కథనంలో వెంకట కృష్ణ దూషించాడని కథనంలో కనబరిచినందుకు దాడి చేశారు. చివరకు పోలీసులు వెంకట్రావును రక్షించి ఒంగోలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment