
యువకుడి దారుణహత్య
వివాహేతర సంబంధమే కారణం
నిందితుల్లో హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు మహిళలు !
నిందితులపై దాడికి యత్నం
రోడ్డుపై బైఠాయించిన ప్రజలు
కోట: ఓ యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన చిట్టేడు పంచాయతీలోని మైక్రోటవర్ కాలనీలో కలకలం సృష్టించింది. మొదట అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, తర్వాత హత్యగా తేలడంతో పలు గ్రామాల ప్రజలు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసుల కథనం మేరకు..ఊనుగుంటపాళెం మాజీ సర్పంచ్ గడ్డం మస్తానయ్య, వజ్రమ్మల కుమారుడు సుబ్బారావు(19). ఆటో తోలుకుని జీవనం సాగిస్తున్నాడు. మైక్రో టవర్ కాలనీలో దుకాణం నిర్వహిస్తున్న ఓ యువతితో సుబ్బారావు కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతున్నాడు. మరోవైపు కోట హెడ్‌కానిస్టేబుల్ మహమ్మద్‌తో పాటు పలువురు హోంగార్డులు ఆ యువతి ఇంటికి తరచూ వచ్చివెళ్లేవారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సుబ్బారావు ఫోన్ నుంచి ఆ యువతి అతని స్నేహితుడికి ఫోన్ చేసి తన ఇంటి వద్ద గొడవ జరుగుతోందని, వచ్చి ఆయనను తీసుకెళ్లాలని కోరింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు వచ్చేసరికి యువతి ఇంటి సమీపంలోని ఓ పూరి గుడిసెలో సుబ్బారావు అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి ఉరికి వేలాడదీశారని తల్లిదండ్రులు ఆరోపించారు.
రోడ్డుపై బైఠాయించిన ప్రజలు
యువకుడి హత్య విషయం తెలుసుకున్న ఊనుగుంటపాళెం, చిట్టేడువాసులు సంఘటన స్థలంలో ఆందోళనకు దిగారు. మైక్రోటవర్ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు తెలిపినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. సుమారు 500 మంది రహదారిపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. ఉదయం సంఘటన స్థలంలో తిరుగుతున్న హెడ్‌కానిస్టేబుల్ మహమ్మద్‌ను కోట ఎస్సై పంపించేశాడని ఆరోపించారు. అత నిని తీసుకువస్తే తప్ప నిరసన విరమింపబోమని స్పష్టం చేశారు. సీఐ కరుణాకర్, కోట మండలాధ్యక్షుడు నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి నచ్చజెప్పినా శాంతించలేదు.
హెడ్‌కానిస్టేబుల్‌కు దేహశుద్ధి
ఉదయం సంఘటన స్థలంలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ మహమ్మద్ జనం పెరుగుతుండడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. అనంతరం పూటుగా మద్యం తాగి చిట్టేడు సమీపంలోని తెలుగుగంగ కాలువ గట్టుపై తిరుగుతుండగా మృతుడి బంధువులు పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి సంఘటన స్థలానికి తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్న కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు ఎస్సైలు హెడ్‌కానిస్టేబుల్‌కు రక్షణగా నిలిచారు. ఆయనను తమకు అప్పగించాలని ఆందోళన ఉధృతం చేయడంతో సమాచారం అందుకున్న డీఎస్పీ చౌడేశ్వరి సంఘటన స్థలాని కి చేరుకున్నారు. ఆమె నచ్చజెప్పినా జనం శాం తించలేదు. కొందరు మహిళలు దాడికి దిగడం తో పోలీసు రక్షణ మధ్య జీపులో కూర్చోబెట్టా రు. మృతుడి తండ్రి ఫిర్యాదు ఫిర్యాదు మేరకు మహమ్మద్, ఆ యువతితోపాటు ఆమె తల్లిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.
హత్య అని తెలిసిందిలా..
మొదట అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు నెల్లూరు నుంచి క్లూస్‌టీం, జాగిలంను పిలిపించారు. జాగిలం లక్కీ మృతదేహం ఉన్న గుడిసెలో నుంచి నేరుగా యువతి ఇంటి వద్ద ఆగింది. అనంతరం తలుపులు తెరవగానే ఇంట్లో కలియదిరిగి మళ్లీ సంఘటన స్థలానికి చేరుకుంది. మధ్యలో హెడ్‌కానిస్టేబుల్ మహమ్మద్ మోటారు బైక్ వద్ద ఆగింది. దీంతో అనుమానాలు బలపడ్డాయి. ఇంతలో యువతి తో సన్నిహితంగా మెలిగే సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడినట్లు తెలిసింది. ఆదివారం సురేఖ ఇంటికి వచ్చిన సుబ్బారావు అప్పటికే అక్కడ హెడ్‌కానిస్టేబుల్ మహమ్మద్ ఉండడంతో ఆమెతో గొడవపడ్డాడు. మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో సుబ్బరావు ఆమె ఇంటికి వచ్చాడు. మద్యం తాగి అక్కడే నిద్రపోయాడు. అర్ధరాత్రి హెడ్‌కానిస్టేబుల్ మహమ్మద్ అక్కడకు చేరుకున్నాడు. అక్కడే నిద్రపోతున్న సుజాతను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించాడు. తెల్లవారుజామున సురేఖ ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో సుజాత బావి చాటున చేరి గమనించింది. మహమ్మద్‌పై దాడిచేసిన సుబ్బారావు పారిపోతుండగా ఆయనతో పాటు సురేఖ, రమణమ్మ వెంటపడ్డారు. సమీపంలోని జామాయిల్ తోటలో పట్టుకుని విచక్షణ రహితంగా కొట్టారు. ముగ్గురూ కలిసి సమీపంలోని గుడిసెలోకి తీసుకెళ్లి చీరతో ఉరివేసినట్లు సుజా త పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.