బావిలో పడి యువకుడి మృతి
Published Sat, Sep 28 2013 6:38 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
బెలగాం, న్యూస్‌లైన్ : బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానిక వై.కె.ఎం. కాలనీకి చెందిన టి.దుర్గాప్రసాద్(32) మూడేళ్ల క్రితం బీఈడీ పూర్తి చేశాడు. ఏడాది కాలం నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. విశాఖ, విజయనగరం తదితర ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఎప్పటిలానే కాలకృత్యాల కోసం గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు.
శుక్రవారం ఉదయం వై.కె.ఎం కాలనీకి ఆనుకుని ఉన్న నేల బావిలో దుర్గాప్రసాద్ విగతజీవై తేలడాన్ని కొంతమంది గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అందిన ఫిర్యాదు మేరకు పార్వతీపురం టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై బి.లక్ష్మణరావు సంఘటన స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్టుమార్టానికి తరలించారు. అయితే దుర్గాప్రసాద్ ప్రమాదవశాత్తు జారిపడిపోయాడా, ఇంకేదైనా కారణం ఉందా అన్నది తెలియరాలేదు.
ఆదుకుంటాడనుకుంటే...
బీఈడీ చదివి ప్రయోజకుడై పెద్ద దిక్కుగా ఉండి కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్నామని, ఇంతలోనే విధి ఇలా చేసిందని మృతుడు దుర్గాప్రసాద్ తండ్రి పకీరు నాయుడు, తల్లి లక్ష్మి, అన్నదముల్ము సతీష్, గౌరి భోరుమన్నారు. పేద కుటుంబం కావడంతో దుర్గాప్రసాద్ తండ్రి పకీరునాయుడు స్థానిక ఏరియా ఆస్పత్రిలో జంక్షన్‌లో తోపుడుబండి పెట్టి టీ, ఫలహారాలను అమ్ముతూ జీవనం సాగించేవారు. దుర్గాప్రసాద్ అతనికి చేదోడువాదోడుగా ఉండేవాడు. చేతికి అందొచ్చిన కొడుకు మృతిని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది.
Advertisement