మీ పిల్లల్ని హాస్టల్లో చదివిస్తావా?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పిల్లలను సంక్షేమ హాస్టళ్లలో చదివిస్తే విద్యార్థుల సమస్యలు ఆయనకు తెలిసివస్తాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. హాస్టళ్లలో విద్యార్థులు పురుగుల అన్నంతో రోజులు వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్‌తో ఇందిరాపార్కు వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం మహాధర్నా, ప్రదర్శన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించాలని, దొడ్డు బియ్యానికి బదులుగా సూపర్ ఫైన్ సన్న బియ్యం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సుల మొత్తం ఫీజులను ప్రభుత్వమే భరించాలని కోరారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా, 2008లో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టినప్పుడు శాచ్యురేషన్ పద్ధతి ప్రకారం ఫీజులు చెల్లించేలా నంబర్ 18, 50 జీవోలను తీసుకొచ్చిందని కృష్ణయ్య గుర్తు చేశారు. వీటి ప్రకారం 2008 నుంచి 2012 వరకూ పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించిందని, ప్రస్తుతం కిరణ్ ప్రభుత్వం దశలవారీగా దీనిని రద్దు చేయాలనే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ధర్నాలో బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.