గంజాయి పొట్లాలు
సాక్షి, రాజమహేంద్రవరం క్రైం: నగరంలో మత్తు మాఫియా విజృంభిస్తోంది. యువతను లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాలు, గంజాయి అమ్మకాలు జరుపుతోంది. స్కూలు నుంచి కాలేజీ స్థాయి వరకూ పలువురు విద్యార్థులు ఈ మాఫియా వలలో పడినట్టు సమాచారం. నగరంలో మత్తు ఇంజెక్షన్లు, గంజాయి అమ్మకాలు విరివిగా సాగుతున్నాయి. వీటికి అలవాటుపడిన యువకులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.
ఆర్ధోపెడిక్ ఆస్పత్రుల్లో నొప్పుల నివారణకు ఉపయోగించే ఇంజెక్షన్లను మత్తు కోసం కొందరు వాడుతున్నారు. ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది ద్వారా, కొన్ని మెడికల్ దుకాణాల్లో వీటిని సంపాదిస్తున్నారు. తక్కువ ధరకు ఇవి లభించడంతో చాలామం ది వీటికి అలవాటు పడుతున్నారు. ఈ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కంపోడర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
నేరాల బాట..
మత్తు ఇంజెక్షన్లు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వాడకానికి అలవాటు పడిన యువకులు వాటిని కొనడానికి నేరాల బాట పడుతున్నారు. చోరీలకు పాల్పడడం, ఒంటరిగా వెళ్లే మహిళల మెడలో నగలను చోరీచేయడం తదితర వాటిని పాల్పడుతున్నారు. అలాగే నగరంలోని కొన్ని మెడికల్ దుకాణాల్లో మత్తు ఇంజెక్షన్లను విరివిగా అమ్ముతున్నారు.
వాటిని ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి, నగరంలో ఎక్కువ ధరకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ ఇంజెక్షన్లపై మన రాష్ట్రంలో నిషేధం ఉంది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటిపై ఔషధ నియంత్రణ అధికారుల పర్యవేక్షణ ఉండడం లేదు. అలాగే ఫోన్‌లో సంప్రదించిన వారికి కూడా నిర్దేశిత ప్రాంతానికి మత్తు ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి.
గంజాయి అమ్మకం
నగరంలో మెయిన్ రోడ్డు, కోటగుమ్మం, గోదావరి బండ్ తదితర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చిన్నచిన్న పొట్లాలు కట్టి గంజాయిని విక్రయిస్తున్నారు. కొందరు యువకులు గంజాయికి అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలోని రాజేంద్ర నగర్, క్వారీ మార్కెట్ సెంటర్, రామకృష్ణ థియేటర్ వద్ద ఉన్న వాంబే గృహాలు, నామవరం వాంబే గృహాల్లో కొందరు వ్యక్తులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్టు సమాచారం.
వీరు నిరంతరం మత్తులోనే ఉంటూ చిన్న విషయాలకు కూడా పెద్ద ఎత్తున గొడవలు చేస్తున్నారు. ఇటీవల బస్సు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ఆ మృతదేహం వద్ద వచ్చిన కొందరు యువకులు మాదక ద్రవ్యాలు సేవించి రాద్దాంతం చేసి ఆర్టీసీ బస్సు అద్దాలను బద్దలు గొట్టారు. ఈ సంఘటనపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment