
ఆస్పత్రి బాత్‌రూంలోకి లాక్కెళ్లి..
గుంటూరు ఆస్పత్రిలో బాలికపై అత్యాచారయత్నం
గుంటూరు మెడికల్: గుంటూరు ఆస్పత్రిలో బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాలిక కేకలతో ఆస్పత్రి సిబ్బంది నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలేనికి చెందిన మహిళ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. తన 13 ఏళ్ల మేనకోడలిని చూడాలని కబురు పంపడంతో బాలికతోపాటు ఆమె తల్లి, తండ్రి మంగళవారం జీజీహెచ్‌కు వచ్చారు. మధ్యాహ్న సమయంలో బాలిక మూత్రవిసర్జన కోసం బాత్‌రూమ్‌కు వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న జబీన్ బాలికను బలవంతంగా లోపలికి లాగి గడియపెట్టాడు. బాలిక అరిచేందుకు ప్రయత్నించగా చంపేస్తానని బెదిరించాడు.
ఎంతసేపటికీ బాత్‌రూమ్ తలుపు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది పలుమార్లు తలుపు కొట్టగా బాలిక బిగ్గరగా అరిచింది. నిందితుడు తలుపు తీసి పరుగెడుతుండగా సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి మహిళా సెక్యూరిటీ సిబ్బంది జబీన్‌ను చితకబాదారు. జబీన్ తనపై లైంగికదాడికి యత్నించినట్లు బాలిక ఫిర్యాదు చేయడంతో మెడికో లీగల్ కేసుగా నమోదుచేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను గైనిక్ విభాగానికి తరలించినట్లు ఆర్‌ఎంఓ డాక్టర్ రమేష్ తెలిపారు. జబీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జబీన్ తరచూ ఆస్పత్రికి వచ్చి హడావుడి చేస్తుంటాడని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. గతంలోనూ పలువురు మహిళలను వేధించినట్లు ఆరోపణలున్నాయి.