మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : వాగులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.. దాటేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు మధ్యలో చిక్కుకుపోయాడు. కాపాడేందుకు వెళ్లిన మరో యువకుడిని నీటి ప్రవాహం ప్రమాదంలోకి నెట్టింది. ఒక్కసారిగా తాడు తెగిపోవడంతో ఇద్దరూ వాగులో కొద్ది దూరం కొట్టుకుపోయారు. ఏం జరుగుతుందోనని అప్పటికే అక్కడ గుమిగూడిన ప్రజలు వాగు వెంట పరుగులు తీశారు. పది నిమిషాల తర్వాత ఇద్దరూ క్షేమంగా ఒడ్డుకు చేరడంతో నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. మంచిర్యాల బైపాస్‌రోడ్డు సమీపంలో ఉన్న రాళ్లవాగు కాజ్‌వే ఈ ఉత్కంఠ సన్నివేశానికి మంగళవారం సాయంత్రం వేదికైంది. వివరాలిలా ఉన్నాయి. నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన గూడూరి రవి తన ఆటో ట్రాలీని మంగళవారం ఉదయం షోరూంలో మరమ్మతుకు ఇచ్చాడు. సాయంత్రం డెలివరీ ఇస్తామని చెప్పడంతో సాయంత్రం 4గంటల ప్రాంతంలో బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న రాళ్లవాగు కాజ్‌వే వద్దకు వచ్చాడు. వాగు అవతలి వైపు వెళ్లిన రవి మళ్లీ వాగు దాటుతుండగా నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
రవి కాజ్‌వే మధ్యలోకి రాగానే నీటి ప్రవాహం ఎక్కువైంది. దీంతో కాజ్‌వేపై ఉన్న సిమెంటు దిమ్మెను పట్టుకుని నిలబడ్డాడు. గమనించిన స్థానికులు రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. తహశీల్దార్ ఇత్యాల కిషన్, సీఐ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. అప్పటికే నీటి ప్రవాహం రవి భుజాల వరకు చేరింది. మంచిర్యాల రెవెన్యూ కార్యాలయ సబార్డినేట్ వడ్లకొండ ప్రభాకర్ వరదలో చిక్కుకున్న రవికి కాపాడేందుకు ట్యూబ్‌తో వెళ్లాడు. వరద ఉధృతి పెరగడంతో వెనక్కి కొట్టుకు వచ్చాడు. రెండోసారి మరో యువకుడి సహాయంతో సగం దూరం వెళ్లినా.. వరద ఎక్కువ కావడంతో ముందుకు వెళ్లలేక వెనక్కి వచ్చాడు. పట్టణంలోని రాళ్లపేటకు చెందిన ప్లంబర్ సయ్యద్ ఆసిఫ్ తాను కాపాడుతానంటూ ముందుకు వచ్చాడు. అధికారుల సూచనలతో ట్యూబ్ తొడుక్కుని వాగులోకి దిగాడు.
ధైర్యంగా ఈత కొడుతూ రవి వద్దకు వెళ్లాడు. వరద ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా ఇద్దరూ వాగులో కొట్టుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఆసిఫ్ ట్యూబ్‌కు ఉన్న తాళ్లను లాగే ప్రయత్నం చేయగా అది తెగిపోయింది. ఆసిఫ్ చాకచక్యంగా వ్యవహరించి తన ట్యూబ్‌ను రవి పట్టుకునేలా విసిరాడు. రవి ట్యూబ్‌ను పట్టుకున్నా 200 మీటర్ల దూరం కొట్టుకుపోయి ఓ వైపు ఒడ్డుకు కొట్టుకువచ్చాడు. ఆసిఫ్ ఈత కొడుతూ ఒడ్డుకు చేరడంతో ఉత్కంఠకు తెరపడింది. రవి ప్రాణాలు కాపాడిన ఆసిఫ్ ధైర్యాన్ని మెచ్చుకుని తహశీల్దార్ ఇత్యాల కిషన్ రూ.5 వేల ప్రోత్సాహక నగదు అందజేశారు. ఆసిఫ్ మాట్లాడుతూ కాపాడుతాననే నమ్మకంతో వాగులోకి దిగానని, తాడు తెగడంతో భయపడకుండా రవికి ట్యూబ్ అందించి తాను ఒడ్డుపైకి చేరుకున్నానని ఉద్వేగంగా తెలిపాడు. గూడూరి రవి మాట్లాడుతూ తను బతికిబయట పడుతానని అనుకోలేదని, నేను ఇప్పుడు మీముందు ఉన్నానంటే ఆసిఫ్ కాపాడిన ప్రాణమని, ఎప్పుడూ ఆయనకు రుణపడి ఉంటానని తెలిపాడు. ఆసిఫ్‌ను స్థానికులు రియల్ హీరో అంటూ అభినందనలతో ముంచెత్తారు.
వరద నీటిలో.. ఉత్కంఠ
Published Wed, Aug 7 2013 5:02 AM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
Advertisement
Advertisement