యువకుడి ఆత్మహత్య
- ప్రేమించిన యువతి చీర తీసుకోలేదని మనస్తాపం
- ఆ చీరతో ఉరి వేసుకుని దారుణం
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : షీలానగర్ అయ్యప్పస్వామి దేవాలయం పక్కన యమహా షోరూం వెనుక ఒక అపార్ట్‌మెంట్‌లో ఆదివారం ఒక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వి. సంతపాలేనికి చెందిన ఈశ్వరమ్మ, ఈశ్వరరావు రెండవ సంతానం బొత్సా కార్తీక్ (21) కొద్ది నెలలుగా ఆటోనగర్‌లోని ఒక ప్రైవేటు సంస్థలో పొక్లెయిన్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
అతని స్నేహితుడు సంతోష్‌తో కలసి ఆరు నెలల క్రితం షీలానగర్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. కార్తీక్ కొద్దినెలలుగా ఒక యువతితో ప్రేమలో పడ్డాడని అతని స్నేహితుడు తెలిపాడు. రెండు రోజుల ముందు తను ప్రేమించిన యువతికి చీర కొన్నాడని, అయితే ఆ చీర తీసుకునేందుకు ఆ యువతి తిరస్కరించి ఉంటుందని భావిస్తున్నానని సంతోష్ తెలిపాడు.
శనివారం సాయంత్రం తాను డ్యూటీకి వెళ్లానని కార్తీక్ మాత్రం తాను విధులకు వెళ్లడంలేదని చెప్పాడని మృతుని స్నేహితుడు తెలిపారు. ఉదయం విధుల నుంచి ఇంటికి వచ్చిన తాను తలుపు తట్టినా సమాధానం రాకపోవడంతో వరండాలోనే పడుకున్నానన్నారు. ఉదయం వెంటిలేటర్ నుంచి చూస్తే కార్తీక్ ఉరివేసుకుని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.
కంపెనీ అధికారులకు ఈ సమాచారం అందించాడు. వారు గాజువాక పోలీసులకు తెలపటంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యువతికి కానుకగా కొన్న చీరతోనే ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి ఇద్దరు సోదరులు ఉన్నారు. కార్తీక్ మరణ వార్త విన్న వెంటనే బంధువులు విలపించారు. కేసు ఎస్‌ఐ దాలిబాబు దర్యాప్తు చేస్తున్నారు.