జగన్‌ అనే నేను.. మీ బిడ్డగా.. | YS Jagan announced the BC declaration In BC Garjana | Sakshi
Sakshi News home page

జగన్‌ అనే నేను.. మీ బిడ్డగా..

Published Mon, Feb 18 2019 2:28 AM | Last Updated on Mon, Feb 18 2019 7:25 PM

YS Jagan announced the BC declaration In BC Garjana - Sakshi

ఆదివారం ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం. ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ఏలూరు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: తరతరాలుగా నిరాదరణకు గురవుతున్న బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం, అభివృద్ధే తన ఏకైక ధ్యేయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎలుగెత్తి చాటారు. ఆయా వర్గాల తలరాతలను మార్చేలా పలు కీలక పథకాలను ప్రకటించారు. బడుగుల బాగు కోసం తాను రెండు అడుగులు ముందుకేస్తున్నానని ఉద్ఘాటించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఆదివారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బీసీ గర్జన’లో పలు కీలక పథకాలను ప్రకటించారు. తాము అధికారంలో వస్తే.. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిఏటా రూ.15,000 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేస్తామని చెప్పారు. ఐదేళ్లలో రూ.75,000 కోట్లు వ్యయం చేస్తామన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత తీసుకొస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్‌లో మూడో వంతు నిధులను బీసీల అభివృద్ధికే కేటాయిస్తామన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు, బ్యాక్‌బోన్‌ క్లాస్‌గా మారుస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. బీసీలు గర్వంగా తలెత్తుకుని జీవించాలని ఆకాంక్షించారు. అన్ని నామినేటెడ్‌ పదవుల్లో, నియామకాల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు..  ఇస్తామని పేర్కొన్నారు.  బీసీ గర్జనలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే... 



‘‘చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలన చూశాం. మార్పును కోరుతూ ఈ రోజు బీసీ గర్జన నిర్వహించుకుంటున్నాం. దాదాపు 14 నెలలు.. 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. రాష్ట్రంలోని ప్రతిమూలకూ నడిచా. పాదయాత్ర మొదలు కాకముందే మన రాష్ట్రంలోని బీసీ నాయకులతో జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన బీసీ అధ్యయన కమిటీ వేశాం. ఒకవైపు పాదయాత్ర చేస్తూనే, రాష్ట్రం మొత్తం పర్యటించాలని ఈ కమిటీని కోరాం.  పాదయాత్రలో దారిపొడవునా బీసీల సమస్యలను తెలుసుకుంటూ వచ్చా. మరోవైపు మన పార్టీ సీనియర్‌ నాయకులు రాష్ట్రమంతటా తిరిగారు. ప్రతిఒక్కరితో మమేకమయ్యారు. బీసీల స్థితిగతులపై అధ్యయనం చేశారు. పాదయాత్ర సందర్భంగా బీసీల సమస్యలు నేరుగా నాకు తెలిశాయి. మన పార్టీ నాయకులతో కూడిన కమిటీ బీసీల సమస్యలపై లోతుగా అధ్యయనం చేసింది. వారి నివేదికను నాకు అందజేశారు. రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడి జీవితంలో వెలుగులు నింపాలని, ప్రతి బీసీ సోదరుడి ముఖంలో చిరునవ్వులు చూడాలనే సంకల్పంతో ఈ రోజు బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తున్నాం.   

కార్పొరేషన్లను ప్రక్షాళన చేస్తాం 
రేపు మీ అందరి చల్లని దీవెనలతో, దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ అనే నేను, మీ అందరి బిడ్డను.. మీ కోసం ఏం చేస్తానో ఇవాళ చెబుతా. చంద్రబాబు ఐదేళ్లలో బీసీల కోసం సంవత్సరానికి కనీసం రూ.4 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. కానీ, మన ప్రభుత్వం వచ్చాక బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిఏటా రూ.15,000 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేస్తామని చెబుతున్నా. అంటే ఐదేళ్లలో రూ.75,000 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేస్తానని హామీ ఇస్తున్నా. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత తీసుకొస్తాం. చంద్రబాబు బీసీలను వెక్కిరిస్తూ, తన హయాంలో రాని ఆరో బడ్జెట్‌లో పెట్టిన బిల్లు స్థానంలో.. మన ప్రభుత్వం వచ్చాక మొదటి అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర సబ్‌ప్లాన్‌ చట్టాన్ని  చట్టబద్ధంగా తీసుకొస్తామని హామీ ఇస్తున్నా. మూడో వంతు నిధులను బీసీల అభివృద్ధికే కేటాయిస్తాం. కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం కార్పొరేషన్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలో 1,000 మంది ఉంటే, కేవలం ఐదుగురికి మాత్రమే రుణాలు ఇస్తున్నారు. అది కూడా లంచాలు తీసుకుంటారు, జన్మభూమి కమిటీ సిఫార్సులంటారు. ఇలాంటి పరిస్థితిని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెబుతున్నాం. 

అక్కాచెల్లెమ్మలకు ‘వైఎస్సార్‌ చేయూత’ 
నాయీ బ్రాహ్మణులకు, రజకులకు, చేనేతలకు, మత్స్యకారులకు, బోయలకు, వాల్మీకులకు, కురబలకు, అగ్నికుల, వన్నెకుల క్షత్రియులకు, విశ్వబ్రాహ్మణ, శాలివాహన, యాదవ, గౌడ, బలిజ, శెట్టి బలిజ, సూర్య బలిజ, వడ్డెర, దూదేకుల, తూర్పు కాపు, కొప్పుల వెలమ, పోలినాటి వెలమ, కళింగ వెలమ, కాళింగ, గాండ్ల, మేదర, సగర, ముదిరాజ్, భట్రాజు, జంగం, శిష్టకరణం, రెడ్డిక, వీరశివ, వడ్డీలు, షేక్‌లు తదితర బీసీ కులాలకు 139 కార్పొరేషన్లు పెడతానని హామీ ఇస్తున్నా. తాము నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన ఏ ఒక్క సామాజికవర్గంలోనూ లేకుండా అందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అరకొర నిధులివ్వడం కాదు, ఆ కులంలో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు ఉన్న ప్రతి అక్కాచెల్లెమ్మల చేతుల్లో రూ.75,000 పెడతాం. ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పనిలేదు, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. గ్రామ వాలంటీరే వారి దగ్గరికి వెళ్లి నేరుగా డబ్బులిస్తాడు. వైఎస్సార్‌ చేయూత అనే పథకాన్ని అమలు చేస్తాం. నాలుగు విడతలుగా డబ్బులిస్తాం. ఆ డబ్బును ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేస్తున్నా.
 
అందరికీ న్యాయం జరిగేలా నిధులిస్తాం.. 
కార్పొరేషన్లకు ఇంతే ఇస్తామంటూ కత్తిరించే కార్యక్రమం చేయం. ఆ కార్పొరేషన్‌లో ఆ కులం జనాభా ఎంతైతే ఉంటుందో ఆ మేరకు అందరికీ న్యాయం జరిగేలా మొత్తం నిధులిస్తాం. బీసీ సోదరులు, అక్కాచెల్లెమ్మలకు ఇంకో విషయం కూడా చెబుతున్నా. మహానేత వైఎస్సార్‌ ఒక విషయం చెబుతూ ఉండేవారు. ఒక ఇంట్లో ఒకరు ఇంజనీర్‌ అయితే, ఒక ఇంట్లో ఒకరు డాక్టర్‌ అయితే, ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్‌ అయితే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని నాన్న ఎప్పుడూ అంటుండేవారు. నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని చెబుతున్నా. పేదల కోసం ఆయన ఒకడుగు ముందుకేశారు, జగన్‌ రెండు అడుగులు ముందుకేస్తాడని హామీ ఇస్తున్నా. మీ పిల్లలను ఏ చదువులు చదివిస్తారో మీ ఇష్టం. ఎంతవరకైనా చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చయినా ఫర్వాలేదు. నేను ఇస్తానని మాట ఇస్తున్నా. పిల్లలను ఉచితంగా చదివిస్తా. అంతేకాదు ఆ చదువుల కోసం పిల్లలు హాస్టళ్లలో ఉండాలి. ఆ హాస్టల్‌ ఖర్చుల కోసం, మెస్‌ చార్జీల కోసం సంవత్సరానికి కనీసం రూ.15,000 ఖర్చవుతుంది. ఆ డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులున్నారు. ప్రతి తల్లికి, తండ్రికి చెబుతున్నా. పిల్లలను చదివించడమే కాదు. హాస్టళ్లలో ఉన్నందుకు, మెస్‌ చార్జీల కోసం సంవత్సరానికి రూ.20,000 ఇస్తాం. పునాదులు గట్టిగా ఉంటేనే మన పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కాగలుగుతారు. ఈ పిల్లలు బడులకు పోతే.. వారు ఇంజనీర్లు, డాక్టర్లు అయితేనే మన బతుకులు మారుతాయి. మన తలరాతలు మారుతాయి. ప్రతి తల్లికీ చెబుతున్నా. చెయ్యాల్సిందల్లా మీ పిల్లలను బడులకు పంపించడమే. బడులకు పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15,000 ఇస్తానని హామీ ఇస్తున్నా. 

బీసీలకు రావాల్సిన హక్కు రావడం లేదు 
ఈరోజు బీసీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కులం సర్టిఫికెట్ల నుంచి మొదలు పెడితే గ్రూపుల మార్పిడి వరకు వాళ్లకున్న సమస్యలు వాళ్లకున్నాయి. చంద్రబాబు వంటి మనిషిని చూసినప్పుడు ఆ సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు ఎంబీసీల జాబితాగా మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ను ప్రకటించారు. అందులో 32 కులాలను పెట్టారు. ఆ 32 కులాలను ఎంబీసీలుగా పెట్టి ఎంత దారుణంగా చేశారంటే... ఎంత చిత్తశుద్ధి లేకుండా చేశారంటే... ఎంత హేతుబద్ధత లేకుండా చేశారంటే  రేపు ఎవరైనా కోర్టుకు వెళితే మొత్తం వ్యవహారమే రద్దయ్యే పరిస్థితి వచ్చింది. ఇంతటి దారుణంగా బీసీ కులాల పరిస్థితి ఉంది. కులం సర్టిఫికెట్‌ రాదు. దానికోసం చంద్రబాబు చుట్టూ తిరగాలి. బీసీలకు రావాల్సిన హక్కు వారికి రావడం లేదు. జన్మభూమి కమిటీల నుంచి మొదలు పెడితే ఎవరెవరికో లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తానని హామీ ఇస్తున్నా. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ఇప్పటి మాదిరిగా కాకుండా, మూడేళ్లకే దాని కాలపరిమితి ముగిసిపోయేలా కాకుండా నిరంతరం బీసీ కమిషన్‌ పనిచేసేలా దాన్ని చట్టబద్ధం చేస్తాం. దాని పరిధిని విస్తరిస్తాం. బీసీల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు బీసీ కమిషన్‌ను చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా. 

సమస్యల పరిష్కారానికి బీసీ కమిషన్‌ 
బీసీలలో సామాజికవర్గ మార్పులు కోరుతూ అనేక కులాలు ఉన్నాయి. సగర, కృష్ణ బలిజ, పూసల, గవర, పద్మశాలి, నాగవంశం వంటి వారు బీసీలలోనే ‘ఎ’గా గుర్తించాలని కోరుతున్నారు. మేదర, వాల్మీకి, కురబ, వడ్డెర, మత్స్యకారులు ఎస్టీలుగా గుర్తించాలని అడుగుతున్నారు. రజక, గాండ్ల, మేదరులు, ఆరెకటికలు ఎస్సీలుగా గుర్తించమని వేడుకుంటున్నారు. నేనొక్కటే చెబుతున్నా. ఇవన్నీ కూడా రాజకీయ స్వార్థం కోసం ఒక కులాన్ని ఇష్టమొచ్చినట్లుగా ఇంకొకదానిలో పెట్టడం, ఇంకొక కులాన్ని తమ ఇష్టమొచ్చినట్లుగా తగ్గించడం, తీసేయడం... ఇవన్నీ చేయడం నిజంగా ఎటువంటి స్టడీ, హేతుబద్ధత లేకుండా, ఎటువంటి కమిటీ లేకుండా, ఎటువంటి రికమెండేషన్‌ లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడితో ఇష్టమొచ్చినట్లుగా మార్పులు చేయడం, చేయలేనివి కూడా చేస్తానని చెప్పడం నిజంగా ధర్మమేనా అని అడుగుతున్నా. ఈ పరిస్థితులను పూర్తిగా మార్చివేస్తాను. పారదర్శకత తీసుకువస్తా. ఈ కులాల డిమాండ్లను, వారి ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొని పారదర్శకంగా, పక్షపాతానికి తావులేకుండా వారందరి విజ్ఞప్తులను బీసీ కమిషన్‌కు అప్పగిస్తాం. పారదర్శకంగా, ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా వారి సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ కూడా రాజకీయ పరిధిలోకి రాకుండా చేస్తాం.

రాజకీయ ఒత్తిడి లేకుండా చేస్తాం. ఒక పద్ధతి ప్రకారం నిజంగా ఏ కులం ఎక్కడ ఉండాలి అన్నది వాళ్లవాళ్ల రికమెండేషన్ల ప్రకారం అమలయ్యేలా చేస్తాం. ఈ బీసీ కమిషన్‌ పరిధిలో రాని అంశాలున్నాయి. ఎస్సీలుగా, ఎస్టీలుగా చేసే అంశాలున్నాయి. వీటిని కూడా ఏ రకమైన రికమెండేషన్లు లేకుండా రాష్ట్రంలోని పరిస్థితులు చెప్పకుండా, పక్క రాష్ట్రాల్లోని పరిస్థితులు చెప్పకుండా కేవలం ప్రజలను మోసం చేసేందుకు అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించామని చెప్పి మోసం చేస్తున్నారు. అది సరైంది కాదు. వారి పరిస్థితులు ఏమిటి? చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పరిస్థితి ఏమిటి? వీళ్లెందుకు ఈ డిమాండ్‌ అడుగుతున్నారు? వీరి డిమాండ్లలో న్యాయం ఎంతున్నదన్నది అధ్యయనం చేసి వాళ్లకు పక్క రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టే అడుగుతున్నారని ఆ రిపోర్టుల్లో పెట్టి ఆ రిపోర్టుల ఆధారంగా చేసి, ఆ తరువాత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని హామీ ఇస్తున్నా. మీ అందరికీ ఒక్క విషయం చెప్పదల్చుకున్నా. కొన్ని కొన్ని రాష్ట్రం పరిధిలో ఉంటాయి. ఎస్సీలుగా, ఎస్టీలుగా చేయడం వంటివి కొన్ని రాష్ట్రం పరిధిలో ఉండవు. కానీ, రాష్ట్రం రికమెండ్‌ చేసి కేంద్రానికి పంపుతుంది. ఆ రికమెండ్‌ చేసేదాంట్లో శాస్త్రీయత తీసుకొని వచ్చి, రికమెండ్‌ చేసి మా పరిధిలో ఉన్న ప్రయత్నం కచ్చితంగా చేస్తామని హామీ ఇస్తున్నా. ఓట్ల కోసం కాదు. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం లేదు. అబద్ధాలు, మోసాలు ధర్మం కాదని భావిస్తున్నా. కాబట్టే నీతిగా నిజాయితీగా ఉన్నానని చెబుతున్నా. 

ఆదివారం ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో ప్రసంగిస్తున్న ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌. వేదికపై బీసీ నేతలు 

ఒక్కసారైనా కేంద్రానికి లేఖ రాశారా?
చంద్రబాబు చిత్తశుద్ధి లేకుండా పరిపాలన సాగిస్తున్నారని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెబుతా. ఆంధ్రప్రదేశ్‌లో 31 బీసీ కులాల ప్రస్తావన కేంద్రంలోని ఓబీసీలోని జాబితాలో లేకపోవడం వల్ల ఆ కులాల వారు కేంద్ర ప్రభుత్వంలోని విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందలేకపోతున్నారు. చంద్రబాబు నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేశారు. ఇద్దరు ఎంపీలను బీజేపీ ప్రభుత్వంలో కేంద్రమంత్రులుగా పెట్టారు. నాలుగు సంవత్సరాలు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? ఆంధ్ర రాష్ట్రంలోని 31 బీసీ కులాల ప్రస్తావన కేంద్రంలోని ఓబీసీ జాబితాలో లేకపోతే కనీసం ఒక్క లేఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాయని అధ్వానపు వ్యక్తి ఈ చంద్రబాబు. 

జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తున్న సందర్భంగా చప్పట్లతో హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ నేతలు, ప్రజలు 

చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా రుణం 
నా పాదయాత్రలో చూశాను. చాలామంది పేదవారు ఫుట్‌పాత్‌ పక్కన సరుకులు అమ్ముకొంటున్న పరిస్థితి చూశాను. వారు రోజుకు రూ.4 వడ్డీకి, రూ.5 వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఒకరు రూ.1,000, మరొకరు రూ.2,000, వేరొకరు రూ.5,000 అప్పులు తెచ్చుకుంటూ చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఇటువంటి వారందరికీ గుర్తింపు(ఐడీ) కార్డు ఇస్తా. ఐడీ కార్డు ఇవ్వడమే కాదు. వీరందరికీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు సున్నా వడ్డీకే రూ.10,000 ఇస్తామని హామీ ఇస్తున్నా. 

మత్స్యకారుల బతుకుల్లో చిరునవ్వులు చూడాలి 
ఇదివరకే చెప్పాను. పాదయాత్రలో కొన్నికొన్ని కులాలకు మాట ఇచ్చా. ఇవాళ బీసీ డిక్లరేషన్‌లో భాగంగా ఆయా కులాలకు చెప్పిన మాటలను మళ్లీ క్లుప్తంగా చెబుతా. షాపున్న ప్రతి నాయీబ్రాహ్మణుడికి ప్రతి షాపునకు సంవత్సరానికి రూ.10,000 ఇస్తామని హామీ ఇస్తున్నా. సంచార జాతుల వారిని గుర్తిస్తామన్నా. వారంతా స్థిరంగా ఒకచోట ఉండడానికి నివాసముండే విధంగా ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పా. వారికి ఇళ్లు కట్టించి ఇవ్వడమే కాదు. తగిన ఉపాధి కూడా కల్పిస్తామని హామీ ఇస్తున్నా. వారి పిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. పాదయాత్రలో మత్స్యకార సోదరులకు మాట ఇచ్చా. వేట నిషేధ సమయంలో రూ.4,000 కూడా ఇవ్వడం లేదన్నా.. అది కూడా అందడం లేదన్నా అని నాకు చెప్పారు. వారికి మాట ఇచ్చా. వేట నిషేధ సమయంలో రూ.4,000 కాదు, రూ.10,000 ఇస్తామని మాట ఇచ్చా. వారి బతుకుల్లో చిరునవ్వులు చూడాలి. వారికి ఏమీ జరగకూడదు. కానీ, పొరపాటున వారికి ఏమైనా జరిగితే వారి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని కూడా నేను హామీ ఇచ్చా. ఈ ప్రభుత్వం కొత్త బోట్లను రిజిస్ట్రేషన్‌ చేయడం లేదన్నా అని వారు చెప్పారు. డీజిల్‌ సబ్సిడీ సొమ్ము ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుందని, కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్‌ చేయని పరిస్థితి అని చెప్పారు. ఆ మత్స్యకార సోదరులందరికీ మాట చెప్పా. కొత్త బోట్లను రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. పాతబోట్లను గుర్తిస్తాం. డీజిల్‌ సబ్సిడీని పాత కొత్తబోట్లకు తేడా లేకుండా పెంచుతాం. డీజిల్‌ పట్టేటప్పుడే ఆ సబ్సిడీని కూడా ఇస్తామని మాట ఇచ్చా. మెకనైజ్డ్‌ బోట్లు, ఫైబర్‌బోట్లు ఇలా అన్నింటికీ నిబంధనలు అడ్డుపెట్టకుండా ఇస్తామని హామీ ఇచ్చా. 

ఆ 32 కులాలను బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తా.. 
రాష్ట్రం విడిపోయిన తరువాత పక్కన తెలంగాణ రాష్ట్రంలోని 32 కులాలను వారు బీసీ జాబితాలో గుర్తించలేదని చెప్పి అక్కడ కూడా బీసీ జాబితాలో చేర్పించేలా చేయాలని చాలామంది నన్ను పాదయాత్రలో అడిగారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ చంద్రబాబు ఇంటికి వచ్చారు. చంద్రబాబు శాలువాలు కప్పి కేసీఆర్‌కు భోజనాలు పెట్టారు. కానీ, ఇప్పుడు కేసీఆర్‌కు ఈ 32 బీసీ కులాల గురించి చెప్పాలన్న ఆలోచన చంద్రబాబుకు రాలేదు. హరికృష్ణ చనిపోయినప్పడు శవం పక్కన పెట్టుకొని కేటీఆర్‌తో చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడారు. కానీ, తెలంగాణలోని 32 కులాలు కేంద్రంలోని బీసీ జాబితాలో లేవు, వాటిని చేర్చండి అని చంద్రబాబు నోట్లోనుంచి ఒక్కమాట కూడా రాలేదు. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక కేసీఆర్‌తో నేను మాట్లాడుతా. ఆ 32 కులాలను తెలంగాణలో కూడా బీసీ జాబితాలో చేర్చే ప్రతి ప్రయత్నం చేస్తానని మాట ఇస్తున్నా. 

బీసీలు రాజకీయంగా ఎదగాలి 
బీసీల కోసం ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నాం. బీసీలు ఎదగాలి. పేదవారు ఎదగాలి. రాజకీయంగా ఎదగాలి. పదవుల్లో ఉండాలి. రాజకీయంగా వీరి ఎదుగుదల కోసం, పదవుల్లో వీరు ఉండడం కోసం గవర్నమెంట్‌ పరిధిలో ఉన్న అన్నింటిలోనూ మార్కెట్‌ కమిటీల్లో కావచ్చు, ఛైర్మన్లలో కావచ్చు, కమిటీలలో కావచ్చు, ట్రస్టు బోర్డులు కావచ్చు, ట్రస్టు బోర్డు ఛైర్మన్లు కావచ్చు, ట్రస్టు బోర్డుల్లో సభ్యులు కావచ్చు. గుడులు కావచ్చు, గోపురాలు కావచ్చు. కార్పొరేషన్‌ పదవులు కావచ్చు. ఇలా గవర్నమెంటు పరిధిలో ఉన్న అన్ని నామినేటెడ్‌ పదవుల్లోనూ, అన్ని నియామకాల్లోనూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తాం. ఈ మేరకు మొట్టమొదటి శాసనసభ సమావేశంలోనే చట్టం తీసుకొస్తాం. నామినేటెడ్‌ పదవులే కాదు, నామినేషన్‌ కింద ఇచ్చే పనుల్లో 50 శాతం పనులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందేలా చట్టం తీసుకొస్తాం.. 
 

ప్రభుత్వ పనుల్లో 50 శాతం బడుగులకే.. 
ఇంకా ఒక్క అడుగు ముందుకేస్తున్నాం. ప్రభుత్వ కాంట్రాక్టు సర్వీసులున్నాయి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు నిజంగా పేదరికంలో అల్లాడుతున్న వర్గాలు. వీళ్ల బతుకులు మారాలి. ఆర్థికంగా స్థితిమంతులు కావాలి. ఆర్థికంగా కొద్దో గొప్పో సంపాదించుకొనే పరిస్థితుల్లోకి రావాలి. ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి మొదలుపెడితే... గవర్నమెంట్‌ కార్లను బాడుగకు తీసుకోవడం, గుళ్లలో, హాస్పిటళ్లలో, స్కూళ్లల్లో ఇలా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టుల కింద సంపాదించుకొనే చిన్నచిన్న పనులు ఎక్కడైనా కూడా.. గవర్నమెంటులో సంపాదించుకొనే మార్గమేదైనా ఉంటే కాంట్రాక్టుకో, ఔట్‌సోర్సింగ్‌కో ఇప్పించుకొని సంపాదించుకొనేలా ఉండి ఉంటే వాటన్నింటిలోనూ 50 శాతం పనులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకు వచ్చేలా చట్టం తీసుకొస్తామని హామీ ఇస్తున్నా. 

గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6,000 
చేనేత అక్కాచెల్లెమ్మలకు మాట చెప్పా. వారింటికి వెళ్లి భరోసా ఇచ్చా. ఇంట్లో మగ్గం ఉండి చేనేతతోనే జీవితం గడుపుతున్న ప్రతి అక్కాచెల్లెమ్మకు పెట్టుబడి రాయితీ కింద రూ.2,000 నెలనెలా ఇస్తామని హామీ ఇచ్చా. ఇవన్నీ కూడా మనం నవరత్నాల్లో ప్రకటించిన పథకాలకు అదనంగా ఇస్తామని హామీ ఇచ్చా. సహకార డెయిరీలకు పాలుపోస్తే చాలు అదనంగా లీటరుకు రూ.4 సబ్సిడీ కింద ఇస్తామని హామీ ఇచ్చా. యాదవ సోదరులకు చెప్పా. గొర్రెలున్నాయి. మేకలున్నాయి. కానీ చెవులకు పోగులు లేవని, చనిపోతే ఇన్సూరెన్సు రావడం లేదు. ప్రతి యాదవ సోదరుడికి చెప్పా. గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6,000 వచ్చేటట్టుగా చేస్తానని చెప్పా. అంతేకాదు తిరుమల ఆలయాన్ని తెరిచే హక్కు ఆ సన్నిధి గొల్లలకే ఇస్తామని, వారికి వంశపారంపర్య హక్కులు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చా. అంతేకాదు ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం ఇచ్చేట్టుగా చేస్తానని హామీ ఇస్తున్నా.

ఈ ప్రధాన ఆలయాల్లో మన బతుకుల గురించి ఆలోచన చేసేందుకు బోర్డు మెంబర్ల కింద నాయీబ్రాహ్మణులను, యాదవులను కూడా పెడతామని హామీ ఇస్తున్నా. చిట్టచివరగా ఇది జరగకూడదని ఆశిస్తున్నా. కానీ, పొరపాటున ఏ పేదవాడైనా, ఏ రైతన్న అయినా చనిపోతే ఆయా కుటుంబాల బతుకులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఎవరైనా చనిపోతే అప్పుల వాళ్లు మరుసటి రోజే ఇంటికి వస్తారు. చనిపోయారని కూడా కనికరించరు. మా డబ్బులు కట్టండి అంటూ విపరీతమైన హింసపెడతారు. పేదవాడు బతకలేని పరిస్థితి. ఈరోజు ప్రతి పేదవాడికి చెబుతున్నా. పొరపాటున ఆ పేదవాడు ఆత్మహత్య చేసుకున్నా, పొరపాటున అకాల మరణానికి గురైనా, ఆ పేదవాడు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, రైతన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నా ఇంతకు ముందు రైతన్నలకు రూ.5 లక్షలని చెప్పా. అది కూడా మార్పు చేస్తున్నా. పొరపాటున ఇటువంటి దుర్ఘటన జరిగితే వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేస్తాం. ఈ పథకం కింద రూ.7 లక్షలు ఇస్తామని హామీ వాగ్దానం చేస్తున్నా. అంతే కాదు చట్టాన్ని తీసుకువస్తాం. ఎవరైనా అప్పుల వాళ్లు వచ్చి ఆత్మహత్య చేసుకున్న వారి మీదికి వస్తే... మా అప్పులు తీర్చాలని బలవంతంగా వారి మీద పడితే... ఆ పేద కుటుంబ సభ్యుడికి ఇచ్చే సొమ్ము అది గవర్నమెంట్‌ సొమ్ము. ఆడపడుచుకు సాయం కింద ఇస్తున్నాం. ఆ డబ్బు మీద బాధిత కుటుంబ సభ్యులకు తప్ప ఏ ఒక్కరికీ హక్కులేదని చట్టాన్ని తీసుకొస్తాం’’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement