
అందరూ కలిసి రండి
హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతు కూడగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నేతలతో భేటీ కానుంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ బృందానికి నాయకత్వం వహిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం నాడిక్కడ విలేకరులకు తెలిపారు. ‘మేము మీ నుంచి మద్దతు కోరుతున్నాం. సోషల్ మీడియా మద్దతు కూడా కోరుతున్నాం. ప్రజాస్వామ్యంపై విశ్వా„సమున్న ప్రతిఒక్కరి మద్దతు మాక్కావాలి..’ అని జగన్ అన్నారు. ఈ అన్యాయాన్ని అడ్డుకునేందుకు అంతా కలిసి ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘అన్ని పార్టీలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతల సహకారం మాకు కావాలి. ఎందుకంటే ఇవాళ ఇక్కడ జరిగేది రేపు మరెక్కడైనా జరగవచ్చు.
రాష్ట్ర విభజన సమయంలో అసెంబ్లీ తీర్మానాన్ని విస్మరించిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి. ఎందుకంటే అది ప్రజాభిప్రాయానికి అద్దం పడుతుంది..’ అని చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత ఎవరికి మద్దతిస్తారƒ న్న ప్రశ్నకు జవాబిస్తూ.. తమ పార్టీ లౌకికవాదానికి కట్టుబడి ఉంటుందని, అలాగే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటామని జగన్ స్పష్టం చేశారు. ఇప్పుడది తమకంత ముఖ్యమైన అంశం కాదని అన్నారు. ‘ఎన్నో లౌకిక పార్టీల గురించి నేనెంతో స్పష్టంగా మీకు చెప్పినప్పుడు.. ఆరునెలల తర్వాత జరగబోయేదానిపై ఇప్పుడెందుకు మనం ఊహాగానాలు చేయాలి...’ అని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నీళ్లు, రెవెన్యూ పంపకం పెద్ద సమస్యగా మారుతుందని, ప్రజలు నీటి కోసం అలమటించాల్సి వస్తుందని జగన్ స్పష్టం చేశారు.
జగన్ సమైక్య దీక్షకు విశేష స్పందన
ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సమైక్యదీక్షకు రెండో రోజు ఆదివారం జనం నుంచి విశేష స్పందన లభించింది. తండోపతండాలుగా జనం ఆయనకు మద్దతు తెలపడానికి తరలి వచ్చారు. యువకులు, మహిళలు, వృద్ధులు, సాధారణ ప్రజలు ఆసక్తిగా జగన్‌తో కరచాలనం చేసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. చిన్న పిల్లలను చంకన పెట్టుకుని వచ్చిన తల్లులు పెద్ద సంఖ్యలో కనిపించారు. తనను కలవడానికి వచ్చిన వారందరినీ జగన్ చిరునవ్వుతో పలుకరించారు.పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, భూమా శోభానాగిరెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, అంబటి రాంబాబు, జలీల్‌ఖాన్, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు జగన్‌ను కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కె.రఘురామకృష్ణంరాజు కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి(కాంగ్రెస్) కూడా జగన్ వద్దకు వచ్చి మద్దతు ప్రకటించారు.
సమైక్యానికి మద్దతుగానే జగన్‌ను కలిశా
కాటసాని రాంభూపాల్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం ఎవరు ఉద్యమించినా తాను మద్దతిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కాటసా ని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారమిక్కడ ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అనంతరం కాటసాని మీడియాతో మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర కోసం జగన్ ఆమరణ దీక్ష చేస్తున్నందున సంఘీభావం తెలిపేందుకు వచ్చినట్లు చెప్పారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయి, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ‘జై సమైక్యాంధ్ర’ అని అంటే... ఒక సమైక్య వాదిగా మద్దతిస్తానని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్‌పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్ర విభజన నోట్‌ను కేంద్ర కేబినేట్ ఆమోదించడంతో ఆ పార్టీలో ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతో తాను రాజీనామా ప్రకటించినట్లు వివరించారు. ఏ పార్టీలో చేరాలనేది తానొక్కడిని తీసుకునే నిర్ణయం కాదని, తనƒ కు అన్ని విధాలుగా అండదండలు ఇచ్చిన కార్యకర్తలతో చర్చించి వారి ఆలోచన మేరకు నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.