చిన్నాన్న హత్య కేసు దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించండి | YS Jagan Comments On YS Viveka Murder Case Investigation | Sakshi
Sakshi News home page

చిన్నాన్న హత్య కేసు దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించండి

Published Wed, Mar 20 2019 3:42 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

YS Jagan Comments On YS Viveka Murder Case Investigation - Sakshi

సాక్షి, అమరావతి: మాజీ పార్లమెంట్‌ సభ్యులు, తన చిన్నాన్న వై.ఎస్‌.వివేకానందరెడ్డి దారుణహత్యపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియంత్రణలో లేని ఏదైనా స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కడప ఎస్‌పీ, ప్రత్యేక దర్యాప్తు బృందం, పులివెందుల ఎస్‌హెచ్‌వో, సీబీఐ డైరెక్టర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఈ నెల 15న పులివెందులలోని ఇంట్లో బాత్రూమ్‌లో రక్తపు మడుగులో వివేకానందరెడ్డి ఉండటాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా పులివెందుల పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో గాయాల వల్ల వివేకానందరెడ్డి మరణించారని తేలింది. మొదట పులివెందుల పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, తరువాత దానిని సిట్‌కు అప్పగించారు. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలో ఉంది. అదే రోజున ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వివేకానందరెడ్డి మృతికి కుటుంబ సభ్యులే కారణమంటూ మాట్లాడారు. కుటుంబ అంతర్గత కుట్ర వల్లే వివేకా చనిపోయారంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. వివేకా కుటుంబ సభ్యులతో సహా నాకు కూడా తీవ్రమైన దురుద్దేశాలను ఆపాదిస్తూ మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు ఈ విధంగా నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఆ మరుసటి రోజు జిల్లా ఎస్‌పీ కూడా మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడిన విధంగానే మాట్లాడారు. ఎస్‌పీ మాట్లాడిన తీరును బట్టి దర్యాప్తు పక్షపాత ధోరణితో సాగబోతోందని సులభంగా అర్థం చేసుకోవచ్చు.

పోలీసుల పక్షపాత దర్యాప్తు నేపథ్యంలో, అర్థవంతమైన దర్యాప్తు జరిగేలా చూడాలంటూ గవర్నర్‌కు లేఖ రాశాను. దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని అభ్యర్థించాను. గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన వెంటనే, చంద్రబాబునాయుడు పత్రికా ప్రకటన జారీ చేసి దర్యాప్తును సీబీఐకి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. చంద్రబాబు ఆ తరువాత పలు రాజకీయ ర్యాలీలు, సభల్లో కూడా వివేకా రాసినట్లుగా చెబుతున్నట్లు ఓ లేఖ గురించి పదే పదే ప్రస్తావించారు. దర్యాప్తు బృందం, పోలీసు అధికారులు కూడా ఆ లేఖనే పదే పదే ప్రస్తావిస్తూ, ఘటన తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దర్యాప్తు తీరు ఏ విధంగా ఉండాలన్నది సీఆర్‌పీసీలో స్పష్టంగా చెప్పారు. దర్యాప్తు ఎప్పుడూ కూడా అర్థవంతంగా సాగాలి. దర్యాప్తుతో సంబంధం లేని వ్యక్తులు నేర న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోరాదు. ఘటన జరిగిన రోజున చంద్రబాబు తన ప్రెస్‌ స్టేట్‌మెంట్ల ద్వారా దర్యాప్తు ఏ దిశగా సాగాలో చెప్పకనే చెప్పారు. ఆ మరుసటి రోజే జిల్లా ఎస్‌పీ కూడా వివేకా హత్య వెనుక కుటుంబ సభ్యుల కుట్ర ఉందన్నట్లు మాట్లాడారు. వివేకా హత్య తీవ్రతను తగ్గించేలా చంద్రబాబు పదే పదే మాట్లాడుతున్నారు.

సిట్‌ కూడా చంద్రబాబు వైఖరినే కొనసాగిస్తూ ఘటన తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును రాజకీయ కారణాలతో పక్కదోవ పట్టిస్తున్నారు. తద్వారా నేర న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారు. రాజ్యాంగం నిర్ధేశించిన రీతిలో దర్యాప్తు చేయడం లేదు. దర్యాప్తును చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు. నాపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం విషయంలో కూడా చంద్రబాబు ఇలానే చేశారు. దీంతో నేను ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాను. అంతిమంగా దర్యాప్తు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టింది. చంద్రబాబునాయుడు చెప్పినట్లు ఆడుతున్న డీజీపీ తీరుపై ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేశాను. సిట్‌ దర్యాప్తు తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు చెప్పినట్లు దర్యాప్తు సాగుతుందే తప్ప నిష్పాక్షికంగా జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.  

అందుకే మా కుటుంబ సభ్యులపై నిరాధార, నిందాపూర్వక ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మా చిన్నాన్న హత్య కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబునాయుడి నియంత్రణ లేని ఓ స్వతంత్ర సంస్థకు అప్పగించాలి. రాజకీయాలతో సంబంధం లేకుండా, అర్థవంతంగా దర్యాప్తు సాగాలన్నదే నా అభిమతం. అందుకే స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోరుతున్నాం.’ అని జగన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ బోరుగడ్డ అనిల్‌ అనే వ్యక్తి కూడా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement