
దోచుకోవడానికే హడావుడి పనులు
పుష్కరాల పనుల తీరుపై వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విమర్శలు
రాజమండ్రి: ‘‘గోదావరికి జూలై 14న పుష్కరాలు మొదలవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏడాది క్రితం తెలియదా? నెల రోజుల నుంచి మాత్రమే పుష్కరాల పను లు ఆరంభించారు. ఇలా ఆలస్యంగా ఎందుకు చేస్తున్నారంటే.. ఆఖరి రోజుల్లో హడావుడిగా పనులు చేసి నిధులు దోచుకోవచ్చనే ఉద్దేశంతోనే. టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పి అవినీతికి పాల్పడవచ్చనే. నామినేషన్ పద్ధతిలో తన వందిమాగధులకు పనులు ఇవ్వడానికే ఈ జాప్యం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాజమండ్రిలో ఆదివారం పర్యటించిన ఆయన పుష్కరాల పనులను పరిశీలించారు.కోటిలింగాల ఘాట్‌ను సందర్శించి.. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల తీరుతెన్నుల గురించి సాగునీటి పారుదలశాఖ అధికారులు, కాంట్రాక్టరును అడిగి తెలుసుకున్నారు.
కోటిలింగాల ఘాట్ విస్తరణ పనుల కోసం అక్కడ ఉన్న పేదల ఇళ్లను అర్ధంతరంగా తొలగించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించిన అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘పుష్కరాలకు రూ. 200 కోట్లు కేటాయించినట్టు చంద్రబాబు అసెం బ్లీలో చెబుతారు. కాదు రూ. 1,400 కోట్లని యనమల రామకృష్ణుడు అంటున్నారు. ఇప్పటివరకు విడుదలైంది మాత్రం కేవలం రూ. 86 కోట్లు మాత్రమే. ఇప్పటికీ చాలా పనులు మొదలు కాలేదు. టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే పనులను చంద్రబాబు, ఆయన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు భాగాలు చేసుకోవాలనే’’ అని ఆరోపించారు. పుష్కరాలకు అభివృద్ధి పనులు చేయాల్సిందే అని చెప్పిన జగన్.. ఆ పేరుతో అక్కడ 30 ఏళ్లుగా నివాసముంటున్నవారి ఇళ్లను రాత్రికి రాత్రి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.
నవ దంపతులకు జగన్ ఆశీర్వాదం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు డాక్టర్ గౌతమ్‌రెడ్డి వివాహ వేడుకలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు.