రైతులపై చంద్రబాబు నిరంకుశత్వం
ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిప్పులు
- అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా బాబుకు పట్టదా?
- రైతుల సమస్యలపై శాసనసభలో చర్చించకుండా దగా
- సభలో జీఎస్టీ బిల్లును ఆమోదించారు.. రైతులను విస్మరించారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు లభించక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. రైతుల కష్టాలు, పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంపై శాసనసభలో చర్చించేందుకు అధికార పక్షం నిరాకరించడం పట్ల జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం వెలగపూడిలో అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం వైఎస్ జగన్ తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతుల గురించి అసెంబ్లీలో చర్చించడానికి నిరాకరించారంటే టీడీపీకి వారిపై ఉన్న ప్రేమ ఏపాటిదో ఇట్టే అర్థమవుతోందని విమర్శించారు. రైతాంగం దీనస్థితిపై అసెంబ్లీలో చర్చిస్తే బాగుండేదన్నారు. జగన్ ఇంకా ఏం చెప్పారంటే...
‘‘ముఖ్యమంత్రి తన కోర్ డ్యాష్‌బోర్డులో పేర్కొన్న వివరాల ప్రకారం మే 14వ తేదీ నాటికి రూ.2,37,49,199 మేరకు మాత్రమే మిర్చిని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి దారుణంగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధరల్లేవు. మిర్చి క్వింటాల్ కేవలం రూ.800 నుంచి రూ.4,000కు అమ్ముడవుతోంది. అన్ని పంటల పరిస్థితి ఇలాగే ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు మరోవైపు ప్రభుత్వం మిర్చి యార్డును మూసేసింది. ఈ రోజు నుంచి యార్డుకు సెలవులు ఇచ్చారు. జూన్ 4వ తేదీ వరకూ మూసేస్తారట. రాష్ట్రంలో రుతుపవనాలు తొందరగా ప్రవేశిస్తున్నాయని స్కైమెట్, ఐఎండీ వంటి వాతావరణ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. ఒక్కసారి అవి వచ్చాయంటే ఈ సమస్య సమసి పోతుందని, అప్పటివరకూ కొనుగోళ్లు ఆపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రైతులు సమస్యల వలయంలో ఉంటే మిర్చి యార్డును ఎవరైనా మూసేస్తారా? చంద్రబాబు మాత్రమే ఆ పని చేస్తారు. ఆయన రైతు వ్యతిరేకి కాబట్టే ఇలా చేస్తున్నారు.
మోసాలే చంద్రబాబు తీరు
రూ.5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రైతులకు వెన్నుపోటు పొడిచారు. రూ.87,612 కోట్ల మేరకు ఉన్న వ్యవసాయ రుణాలన్నింటీని బేషరతుగా మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని ఇంటికి తెప్పిస్తానని చెప్పి మోసం చేశారు. ఈ రోజు మేం అసెంబ్లీని స్తంభింపజేశాం. జీఎస్టీ బిల్లుకు మేం వ్యతిరేకం కానే కాదని నిన్ననే ప్రకటించాం. ఈ బిల్లును ఆమోదించడం అనేది రెండు నిమిషాల ప్రక్రియ మాత్రమే. బిల్లు ఆమోదం పొందగానే రైతుల సమస్యలపై చర్చించి ఉండాల్సింది. మా వాళ్లు బీఏసీ సమావేశంలోనూ ఇదే మొత్తుకుని మరీ చెప్పినా ప్రభుత్వం వినిపించుకోలేదు. రూ.5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని వెంటనే ఏర్పాటు చేసి, రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి పంటలను కొనండి అంటే పట్టించుకునే పరిస్థితే లేదు. సభలో జీఎస్టీ బిల్లును ఆమోదించారు. రైతుల కష్టాలను విస్మరించారు.
కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారు
మిర్చికి కేంద్రం ఇస్తున్న రూ.5,000 వద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంటోందంటే... ఆ నిధులను ఇంకొక దానికి మళ్లించుకోవచ్చని చూస్తోంది. ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వంటి వాటిలో అలాగే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బును వాళ్లు(రాష్ట్ర ప్రభుత్వం) తీసుకుంటున్నారు. ఆ తరువాత ఇతర అవసరాలకు మళ్లించుకుంటున్నారు. 2013–14లో కేంద్రం ఇచ్చిన రూ.1,600 కోట్లు ఏమయ్యాయి? రాష్ట్రంలో రైతుల నుంచి మిర్చిని క్వింటాల్‌కు రూ.8,000 ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం ప్రారంభిస్తే... ఆ తరువాత ఒక వ్యాపారి వచ్చి తాను రూ.9,000 ఇస్తానంటాడు, ఇంకొకరు రూ.10,000 ఇస్తానంటారు. ఇలా పోటీ పెరుగుతుంది. రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఈ పని చేయకుండా రైతుల దగ్గరి నుంచి మిర్చి కొనుగోళ్లను ఆపేస్తారా? ఇంతకంటే సిగ్గు చేటైన విషయం ఏమైనా ఉంటుందా?’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు.
‘అ’ అంటే అవినీతి.. ‘ఆ’ అంటే ఆత్మహత్యలు
ఐదు ‘ఆ’ లే తన నినాదం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రతిస్పందించారు. ‘‘చంద్రబాబు తన పాలనలో ‘అ, ఆ’లకు నిర్వచనాలనే మార్చేశారు. ట్విస్టింగ్ చేస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్లుగా ‘అ’ అంటే అమరావతి కాదు, ‘ఆ’ అంటే ఆంధ్రప్రదేశ్ కూడా కాదు. ఆయన పాలనలో ‘అ’ అంటే అవినీతి, ‘ఆ’ అంటే ఆత్మహత్యలు. ఇంకా ‘అ’ అంటే అరాచకత్వం, అబద్ధాలు, అసత్యాలు, ‘ఆ’ అంటే ఆకలి చావులు... ఇలా ఒకటి రెండు కాదు, చంద్రబాబు పాలన అంతా అస్తవ్యస్తమే’’ అని జగన్ విమర్శించారు.
అండగా ఉంటాం
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా
‘‘రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణం గా ఉంది. వ్యవసాయం చేస్తే అప్పులే మిగులుతున్నాయి. పెద్ద దిక్కును కోల్పోయి మీ కుటుంబం అన్యాయమైపోయింది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధైర్య పడొద్దు.. మీ కుటుంబానికి నేనూ, మా పార్టీ అండగా ఉంటాం. ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల పరిహారం ఇప్పిస్తాం. ఏ అవసరం వచ్చినా మా ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డికి చెప్పండి. మీకు అన్ని విధాలా సహాయం అందిస్తాం’’ అని ఆత్మహత్య చేసుకున్న రైతు రమావత్ లాలూ నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా కల్పిం చారు. గుంటూరు జిల్లా దావుపల్లికి చెందిన లాలూనాయక్ అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు.