ప్రణాళికా లోపానికి పరాకాష్ట | YS Jagan Fires over construction work of Polavaram Project | Sakshi
Sakshi News home page

ప్రణాళికా లోపానికి పరాకాష్ట

Published Fri, Jun 21 2019 4:13 AM | Last Updated on Fri, Jun 21 2019 8:34 AM

YS Jagan Fires over construction work of Polavaram Project - Sakshi

గురువారం హెలికాప్టర్‌ నుంచి పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

పోలవరం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పోలవరం ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నామని, యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా గురువారం పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం పనులపై మూడుసార్లు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. తర్వాత ప్రాజెక్టు ప్రాంతంలో కలియతిరిగారు. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఎగువ కాఫర్‌ డ్యామ్‌.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌), డయాఫ్రమ్‌ వాల్, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను నిశితంగా పరిశీలించారు. వాటి స్థితిగతులపై జలనవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ శ్రీధర్‌లను ప్రశ్నించారు.

పనుల్లో పురోగతి లేకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిపుణుల కమిటీని పంపించి ఇప్పటివరకు చేసిన పనులపై ఆడిటింగ్‌ చేయిద్దామన్నారు. పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అవసరమైన వనరులు సమకూరుస్తామని స్పష్టం చేశారు. రెండో దశలో మొత్తం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పని చేద్దామని అధికారులకు జగన్‌ పిలుపునిచ్చారు. పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, తానేటి వనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి కార్యదర్శి సొల్మన్‌ ఆరోగ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డిలతో కలిసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

అప్పుడెంత.. ఇప్పుడెంత? 
పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌లో 58.19 శాతం, కుడి కాలువ పనులు 91.64, ఎడమ కాలువ పనులు 69.33 శాతం.. వెరసి మొత్తం ప్రాజెక్టు పనులు 66.77 శాతం పూర్తయినట్లు ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ శ్రీధర్‌లు జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. 2014కు ముందు పోలవరం ప్రాజెక్టు ఎంత పరిమాణం పూర్తయింది? 2014 నుంచి 2019 వరకూ ఎంత పరిమాణం పూర్తయిందో చెప్పాలని అన్నారు. పనుల పరిమాణం లెక్కలు లేవని అధికారులు బదులిచ్చారు. ఆ గణాంకాలను తన ముందుంచాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం అంశాల వారీగా లోతుగా సమీక్షించారు. 

గురువారం పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

సమీక్షలో ముఖ్యమంత్రి, అధికారుల మధ్య సంభాషణ 
సీఎం జగన్‌: స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌లో ఇప్పటికీ 156.54 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని తవ్వకం, 8.53 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు మిగిలిపోయాయి. రోజుకు ఎన్ని క్యూబిక్‌ మీటర్ల మట్టి, కాంక్రీట్‌ పనులు చేయగలరు? 
సీఈ శ్రీధర్‌: ఏప్రిల్‌ వరకూ రోజుకు గరిష్టంగా 40 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, సగటున 5 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేశాం. కానీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆదేశాల మేరకు మే నుంచి పనులు ఆపేశాం. 
జగన్‌: స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, కాఫర్‌ డ్యామ్‌ పనులను మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారు?
ఈఎన్‌సీ: అక్టోబర్‌ వరకూ గోదావరిలో వరద ఉంటుంది. అప్పటిదాకా పనులు చేపట్టడం సాధ్యం కాదు. 
జగన్‌: నాలుగు నెలల సమయం వృథా అన్నమాట. నాయకులకు అధికారులు వాస్తవాలు చెప్పాలి. తప్పుదోవ పట్టించకూడదు. ప్రణాళిక లేకపోవడం వల్లే కాఫర్‌ డ్యామ్‌ కట్టారు. స్పిల్‌ వేను పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు వాస్తవాలు చెప్పండి. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, కాఫర్‌ డ్యామ్‌ను ఎప్పటిలోగా పూర్తి చేయొచ్చు.
సీఈ శ్రీధర్‌: కేంద్ర జలసంఘం నుంచి కొన్ని డిజైన్‌లు ఆమోదం పొందాల్సి ఉంది. ఆ డిజైన్‌లు వస్తే మూడు లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ తగ్గుతుంది. అంటే.. 5.53 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు మాత్రమే చేయాలి. స్పిల్‌ వే స్తంభాలు(ఫియర్స్‌)కు క్రిటికల్‌ కాంక్రీటింగ్‌ చేయాల్సి ఉంటుంది. 
‘నవయుగ’ సంస్థ ప్రతినిధి శ్రీధర్‌: మార్చి నాటికి స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ను పూర్తి చేస్తాం. 
జగన్‌: స్పిల్‌ వేకు గేట్ల కోసం 18 వేల టన్నుల స్టీల్‌ అవసరమైతే ఇప్పటిదాకా 12,583 టన్నుల స్టీల్‌ సేకరించారు. మిగతాది ఎప్పటిలోగా సేకరిస్తారు? హైడ్రాలిక్‌ సిలిండర్లు, హాయిస్ట్‌లను ఎప్పటిలోగా తెప్పిస్తారు? 2020 మే నాటికి గేట్ల పనులు పూర్తి చేయగలరా?
‘బీకెమ్‌’ సంస్థ ప్రతినిధి: 2020 ఫిబ్రవరి నాటికి స్పిల్‌ వే ఫియర్స్‌ను పూర్తి చేస్తే.. మే నాటికి గేట్ల పనులు పూర్తి చేస్తాం. జర్మనీ నుంచి హైడ్రాలిక్‌ సిలిండర్లు, ఇటలీ నుంచి హాయిస్ట్‌లను దిగుమతి చేసుకుంటున్నాం.
జగన్‌: 2020 మే నాటికి స్పిల్‌ వే గేట్లు బిగించే పనులు పూర్తి చేయాల్సిందే. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌కు సమాంతరంగా కాఫర్‌ డ్యామ్‌ పనులు 2020 మే నాటికి పూర్తి చేయాలి. లేకపోతే మళ్లీ ఇప్పటి పరిస్థితే ఉత్పన్నమవుతుంది. వీటికి సమారంతంగా ఈసీఆర్‌ఎఫ్‌ పనులు చేపట్టవచ్చు కదా? ఎప్పటిలోగా పూర్తి చేస్తారు?
‘నవయుగ’ ప్రతినిధి శ్రీధర్‌: 2020 ఫిబ్రవరి నుంచి ఈసీఆర్‌ఎఫ్‌ పనులు ప్రారంభించి.. పది నెలల్లో అంటే 2020  డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తాం. 
జగన్‌: పది నెలలు కాదు.. 12 నెలల్లో అంటే 2021 ఫిబ్రవరి నాటికి ఈసీఆర్‌ఎఫ్‌ను పూర్తి చేయండి. 2021 మే నాటికి జలాశయంలో 39 మీటర్ల మేర నీటిని నిల్వ చేయవచ్చు. అప్పుడు ఎన్ని మీటర్ల కాంటూర్‌ వరకూ ఎన్ని గ్రామాలు ముంపునకు గురువుతాయి? 
ఈఎన్‌సీ: జలాశయంలో 222 గ్రామాలు ముంపునకు గురువుతాయి. 39 మీటర్ల మేర జలాశయంలో నీటిని నిల్వ చేస్తే 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధి వరకూ 113 ముంపు గ్రామాలకు పునరావాసం కల్పించాలి. 25 వేల నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. 
జగన్‌: తొలి దశలో 113 గ్రామాల నిర్వాసితులకు 2021 మేలోగా పునరావాసం కల్పించాల్సిందే. ఇందుకు ఎంత డబ్బులు అవసరమో చెప్పండి? 
ఆర్‌ఆండ్‌ఆర్‌ కమిషనర్‌ రేఖారాణి: 45 పునరావాస కాలనీల నిర్మాణం చేపట్టాం. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తాం.
జగన్‌: పునరావాస కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లు నాణ్యంగా లేవని నిర్వాసితులు ఫిర్యాదులు చేస్తున్నారు. నిర్వాసితులకు ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా, అందుకు సమానమైన డబ్బులు ఇవ్వండి. కాలనీల్లో ప్లాట్లు కేటాయించండి.. నిర్వాసితులు ఇళ్లు నిర్మించుకుంటారు. అంతర్గత రహదారులు, మురుగునీటి కాలువలు, విద్యుత్‌ సౌకర్యం, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించండి.
రేఖారాణి: పునరావాస కాలనీ నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించాం.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి: ఇళ్ల నిర్మాణంపై కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. 
జగన్‌: అందుకే వాటికి అయ్యే వ్యయాన్ని నిర్వాసితులకు ఇవ్వమంటున్నా. పునాది వేసుకుంటే ఇంత.. కిటికీల వరకూ గోడలు నిర్మిస్తే ఇంత.. రూఫ్‌ లెవల్‌ వరకూ నిర్మిస్తే ఇంత.. పైకప్పు వేస్తే ఇంత అని నిర్ణయించి నిర్వాసితులకే ఇవ్వండి. దీనివల్ల ఒక్కో నిర్వాసితుడిపై రూ.60 వేల మేర జీఎస్టీ భారం తగ్గుతుంది కదా? 
రేఖారాణి: అలాగే చేస్తాం. 
జగన్‌: గిరిజన నిర్వాసితులకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చాం. 2005లో సేకరించిన భూమికి ఎకరానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నాం. ఈ రెండు హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందో ప్రతిపాదనలు పంపండి. జూలై నుంచి అక్టోబర్‌ వరకూ నాలుగు నెలల్లో వరదల వల్ల ప్రాజెక్టు పనులు చేయలేరు కాబట్టి నిపుణుల కమిటీని పంపించి ఇప్పటివరకు చేసిన పనులపై ఆడిటింగ్‌ చేయిద్దాం. పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అవసరమైన వనరులు సమకూరుస్తాం. రెండో దశలో మొత్తం నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తాం. ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి.. కుడి, ఎడమ కాలువల ఆయకట్టుతోపాటు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పని చేద్దాం.  
పోలవరం ప్రాజెక్టు పనుల గురించి అధికారులతో మాట్లాడుతున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు 

‘‘పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసి ఇదిగో అప్పుడు కుడి కాలువకు గ్రావిటీపై నీళ్లు ఇస్తాం.. ఇదిగో ఇప్పుడు చేస్తామని మాట మారుస్తూ వచ్చారు. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తి చేయకుండానే కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపట్టడం అతి పెద్ద తప్పు. ఇటు కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేయలేకపోయారు. అటు స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ కూడా పూర్తి చేయలేకపోయారు. పోనీ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తి చేసి కుడి కాలువకు నీళ్లు ఇచ్చే ఉద్దేశమైనా ఉందా అంటే అదీ లేదు. అందుకు అవసరమైన టన్నెల్‌(కుడి అనుసంధానం), అప్రోచ్‌ ఛానల్‌ పనులు చేయకపోవడమే అందుకు నిదర్శనం. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. ప్రణాళిక లోపానికి, తప్పుడు విధానాలకు ఇదో పరాకాష్ట. జూలై నుంచి అక్టోబర్‌ వరకూ గోదావరికి భారీగా వరదలు వస్తాయి. కాఫర్‌ డ్యామ్, స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ మీదుగా వరద ప్రవాహం దిగువకు వెళ్తుంది. దీనివల్ల నాలుగు నెలలపాటు ఎలాంటి పనులు చేపట్టడానికి అవకాశం ఉండదు’’ 
పోలవరం ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆళ్ల నాని, అధికారులు  

‘‘మాపై ప్రజలు అత్యంత విశ్వాసంతో అఖండ విజయాన్ని చేకూర్చారు. మాట ఇచ్చాక తప్పకూడదు. మాపై ప్రజల్లో ఉన్న సదభిప్రాయాన్ని కోల్పోవడానికి మేం సిద్ధంగా లేము. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బేరీజు వేసుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పటిలోగా పూర్తి చేయవచ్చో చెప్పండి. పనులు పూర్తి చేయడానికి సరైన ప్రణాళిక వేసుకుందాం. అవసరమైన వనరులు సమకూరుస్తాం. ప్రాజెక్టును పూర్తి చేద్దాం’’ 

‘‘పోలవరం స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులను నవంబర్‌లో పున:ప్రారంభించి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాల్సిందే. 2020 మే నాటికి స్పిల్‌ వేకు గేట్లు బిగించే పనులు పూర్తి కావాలి. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకోవద్దు. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తయితేనే గోదావరి వరదను దిగువకు మళ్లించవచ్చు. లేదంటే ఇప్పటిలానే పరిస్థితి తయారవుతుంది. నాలుగు నెలల సమయం వృథా అవుతుంది. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌కు సమాంతరంగా కాఫర్‌ డ్యామ్‌ పనులను 2020 మే నాటికి పూర్తి చేయాల్సిందే. 2020 ఫిబ్రవరి నుంచి ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌) పనులు ప్రారంభించి పది నెలల్లో పూర్తి చేస్తామంటున్నారు. పది నెలల్లో కాదు.. 12 నెలల్లో అంటే 2021 ఫిబ్రవరి నాటికి ఈ పనులు పూర్తి చేయాల్సిందే. 2020 మే నాటికి తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 113 గ్రామాల్లోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి’’ 
– పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement