భోజన కార్మికులకు తీపి కబురు | YS Jagan Good News To Meal Workers | Sakshi
Sakshi News home page

భోజన కార్మికులకు తీపి కబురు

Published Sun, Jun 2 2019 9:57 AM | Last Updated on Sun, Jun 2 2019 9:57 AM

YS Jagan Good News To Meal Workers - Sakshi

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైనప్పటి నుంచి వంట కార్మికులు పనిచేస్తున్నారు. గత ఐదేళ్లుగా వారికి సకాలంలో జీతాలు అందలేదు. మధ్యాహ్న భోజన బిల్లులు మంజూరు చేయAకుండా టీడీపీ ప్రభుత్వం నానా ఇబ్బందులకు గురిచేసింది. వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్ర
వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సమయంలో చాలామంది మధ్యాహ్న భోజన కార్మికులు ఆయన్ను కలిసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. దీంతో  మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం పెంచుతామని ఎన్నికల ముందే ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల్లోనే వారి గౌరవ వేతనం రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై మధ్యాహ్న భోజన కార్మికులు, యూనియన్‌ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో విద్యాశాఖ పరిధిలో 4,894 పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకాన్ని అమలుచేస్తున్నారు. ఆ పాఠశాలల్లో 8,540 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని 3,750 ప్రాథమిక పాఠశాలల్లో 1,32,222 మంది, 445 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 34,714 మంది, 699 హైస్కూళ్లల్లో 1,75,769 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పేదవిద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో ఆ పథక నిర్వహణ కోసం ఆయా గ్రామాల్లో ఉండే పొదుపు సంఘాలకు అప్పగించారు. విద్యార్థుల సంఖ్యను బట్టి వంట నిర్వాహకుల కార్మికులకు గౌరవవేతనాలిచ్చే వారు. ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇప్పటివరకు వంట కార్మికులకు జీతాలు పెంచలేదు. ఐదేళ్ల టీడీపీ పాలనలో వంట కార్మికులు, మధ్యాహ్నభోజన కార్మికుల సంఘాల నాయకులు జీతాలు పెంచాలని ఎన్నోసార్లు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఒకానొక సందర్భంలో వారిపై గత పాలకులు లాఠీచార్జీలు సైతం చేసి తీవ్రంగా గాయపడేలా చేశారు. ఇవన్ని దృష్టిలో పెట్టుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వంట కార్మికులకు రూ.3వేలు గౌరవ వేతనం పెంచుతూ ఉత్తర్వులు జారీచేశారు. 
గతంలో పుస్తెలు తాకట్టు పెట్టి..
ఐదేళ్ల కాలంలో మధ్యాహ్నభోజన కార్మికులు తమ పుస్తెలను తాకట్టు పెట్టి విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి సమస్యలను పట్టించుకోలేదు. పుస్తెలు తాకట్టు పెట్టి ఆ పథకాన్ని కొనసాగించిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్మికులకు అలాంటి పరిస్థితి రానీవ్వకుండా జూన్‌ నుంచి రూ.1000 నుంచి గౌరవవేతనాన్ని రూ.3వేలు ఇవ్వనున్నారు. 
సర్కారు బడులు సరికొత్త హంగులతో
ప్రతి ప్రభుత్వ పాఠశాల సరికొత్త హంగులతో కనబడాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులను ఏర్పాటు చేయాలన్నారు. విద్యకు అధిక ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి సమీక్షలో చెప్పడంతో విద్యాశాఖాధికారులు పకడ్బందీ ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
గత పాలనలో మౌలిక వసతులు శూన్యం
 గత ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం చూపింది. అధిక శాతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి మరుగుదొడ్లు లేకపోవడం, డెస్కులు, విద్యుత్‌ సౌకర్యం, కంప్యూటర్‌ టీచర్ల కొరత, తాగునీటి సౌకర్యం, అదనపు తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, మైదానాలు, క్రీడా వస్తువులు లేని పరిస్థితి. ప్రస్తుతం వాటిన్నింటిని ఏర్పాటు చేయడానికి జిల్లా సమగ్ర శిక్షా అభియాన్‌ అధికారులు కసరత్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement