సాక్షి ,కడప : అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని..లేదా సంవత్సరానికి రూ.6 వేలు అందజేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. విద్యుత్ ఉచితంగా అందించడంతోపాటు ఎస్సీ.ఎస్టీల అభివృద్ధి,సంక్షేమానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ హామీ అమలుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. దీని వల్ల మన జిల్లాలోనే 81,845 ఎస్సీ,11,769 ఎస్టీలకు అంటే మొత్తం 93,614 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.
కడప డివిజన్‌లో ఎస్సీలకు 8454 గృహ సర్వీసులు ఉండగా మైదుకూరు డివిజన్‌లో 21681 సర్వీసులున్నాయి. ప్రొద్దుటూరు డివిజన్‌లో 15,912, పులివెందుల డివిజన్ లో 8484 ,రాజంపేటలో 18,778, రాయచోటి డివిజన్‌లో 8536 సర్వీసులున్నాయి. ఎస్టీలకు సంబంధించి కడప డివిజన్‌లో 1277 సర్వీసులుండగా.. మైదుకూరు డివిజన్‌లో 1178, ప్రొద్దుటూరు 1026, పులివెందులలో 1610, రాజంపేటలో 4032, రాయచోటిలో 2646 గృహ సర్వీసులు ఉన్నాయి. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడంవల్ల ఎస్సీ,ఎస్టీలలో పేదలకు మేలు జరుగుతుందన్నది.
ఎస్సీ,ఎస్టీల అభివృద్దికి మరింత కృషి..
ప్రధానంగా మాల, మాదిగ సామాజిక వర్గాలకు వేరు వేరుగా కారొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని రకాల పథకాల ద్వారా ఆర్దిక లబ్ధి చేకూర్చడంతో పాటు ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ పారదర్శకంగా అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. భూపంపిణీతోపాటు ఉచిత బోరు బావుల పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. వైఎస్సార్ పెళ్లి కానుక కింద ఎస్సీ,ఎస్టీ చెల్లెమ్మల వివాహాలకోసం లక్ష రూపాయలు ఇవ్వడంతోపాటు గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి ప్రత్యేక యూనివర్సిటీ, మెడికల్,ఇంజనీరింగ్ కళాశాలలను సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
500 మంది జనాభా ఉన్న ప్రతి తాండా, గూడెంలను పంచాయతీలుగా మారుస్తామన్నారు. ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పషాలటీ ఆసుపత్రినినిర్మిస్తామన్నారు. పోడు భూములను సాగుచేసుకునే గిరిజన రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ (ఫారెస్ట్ రైట్స్ యాక్టు 2006 ప్రకారం) గిరిజనులకు వైఎస్సార్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. జగన్ సీఎం కాగానే ఈ హామీల అమలుకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment