ఎన్‌ఏడీ జంక్షన్ (విశాఖ): దేశంకాని దేశం. వీసా గడువు తీరిన తరువాత అక్కడ దొంగచాటుగా బతకాల్సి వచ్చింది. మంచి ఉపాధి అని నమ్మించి ఏపీకి చెందిన వారిని బోగస్ ఏజెంట్లు మలేసియా తీసుకెళ్లి బానిసలుగా మార్చేశారు. అక్కడికి వెళ్లిన తరువాత వారి పాస్‌పోర్టులు తీసుకుని కూలి పనుల్లో చేర్పించారు. చివరికి అక్కడి ప్రభుత్వ దృష్టిలో వారు నేరస్తులుగా మారిపోయారు. అలాంటి దయనీయ స్థితిలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ ఫలితంగా మలేసియా ప్రభుత్వ క్షమాభిక్ష లభించింది. దానికి వారధిగా నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఎన్‌ఆర్‌టీసీ) నిలిచింది. దీంతో తొలి విడతగా 18 మంది ఆదివారం రాత్రి విశాఖ చేరుకున్నారు. వీరు విశాఖ చేరుకోగానే తమ బాధలు సాక్షితో చెప్పుకున్నారు. సీఎం జగనన్న మాకు మళ్లీ పునర్జన్మ ఇచ్చారని కన్నీటి పర్యంతమయ్యారు.
మొత్తం ఖర్చులన్నీ భరించిన ఏపీ ప్రభుత్వం...
మలేసియాలో బాధితుల్ని రప్పించడానికి ఆంధ్రప్రదేశ్, మలేసియా ప్రభుత్వ అధికారులతో ఎన్‌ఆర్‌టీసీ సమన్వయం చేసి అన్ని అనుమతులు సాధించింది. తొలి విడతలో వచ్చిన వారిలో కడప జిల్లా వారు ఆరుగురు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో ఆరుగురు, శ్రీకాకుంళ జిల్లా వాసులు ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లా వారు ముగ్గురు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ సొసైటీ చైర్మెన్ మేడపాటి వెంకట్ తెలిపారు. మలేసియా నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకు రావడానికి ఫీజులు.. జరిమానాలు.. చార్జీలు మొత్తం కలిపి ఒక్కొక్కరికి రూ. 32 వేలు చొప్పున ఏపీ ప్రభుత్వం భరించిందని పేర్కొన్నారు. తమను రక్షించాలని ఇప్పటి వరకూ 250 మంది బాధితులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. విశాఖ చేరుకున్న బాధితులు సాక్షితో మాట్లాడుతూ.. అక్కడ తమను చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి ఇళ్లను చేరుకుంటామని అనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు.
కూలీలుగా మార్చేశారు
మంచి ఉద్యోగమని ఏజెంట్లు చెప్పారు. కాని అక్కడికి వెళ్లిన తరువాత కూలీలుగా మార్చేశారు. చాలా ఇబ్బందులు పడ్డాం. సుమారు 12 నెలలనుంచి జీతాలు ఇవ్వలేదు.
– పలిమెల మేరి, తూర్పుగోదావరి జిల్లా
కార్ వాషింగ్ షెడ్డులో పెట్టారు...
మంచి పరిశ్రమలో పని కల్పిస్తామని తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత కార్లు కడిగే పనిలో పెట్టారు. ఊరుకాని ఊరు వచ్చి ఏంచేయాలో తెలియని దుస్థితి. 8 నెలలుగా నరకంలో బతికాం.
– వెంకటేష్, కడప
Comments
Please login to add a commentAdd a comment