సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్నారై వైద్యుల బృందం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వాస్పత్రులను అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్దడంతోపాటు ఒకేసారి పెద్ద ఎత్తున వైద్య కళాశాలలను నిర్మిస్తున్న నేపథ్యంలో వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించేందుకు అమెరికాకు చెందిన ప్రవాస వైద్యులు ముందుకొచ్చారు.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విలేజ్ క్లినిక్స్, టెలి మెడిసిన్ సేవల్లో పాలుపంచుకునేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. డాక్టర్ రవి కొల్లి ఆధ్వర్యంలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఏఏపీఐ)కి చెందిన ఎన్నారై వైద్యుల బృందం శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుని పలు అంశాలపై చర్చించింది.
వచ్చే ఏడాది జనవరి 6, 8వ తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న ఏఏపీఐ గ్లోబల్ హెల్త్‌కేర్ 16వ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా సీఎంను ఆహ్వానించారు. ఈ సదస్సులో మధుమేహం, గుండె జబ్బులు, మహిళలు–పిల్లలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నట్లు ఏఏపీఐ ప్రెసిడెంట్ డాక్టర్ రవి కొల్లి ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు.
వైద్య ఆరోగ్య రంగంలో సీఎం జగన్ తెస్తున్న సంస్కరణలను ఎన్నారై డాక్టర్లు ప్రశంసించారు. టెలీ కన్సల్టేషన్, శిక్షణ కార్యక్రమాలు, స్పెషాల్టీ వైద్యంలో అనుసరించాల్సిన విధానాలు తదితరాలపై ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ట్రైన్ అండ్ బేబీ ఆర్గనైజేషన్ (టీఏహెచ్‌బీ) మాతా శిశుమరణాలను తగ్గించడంపై రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు సంసిద్ధత తెలిపింది. సంస్థ లక్ష్యాలను డాక్టర్ ప్రకాశ్ వివరించారు.
శిక్షణలో సహకారం..
విలేజ్ క్లినిక్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు మెరుగైన శిక్షణ అందించడంలో ఎన్నారై వైద్యులు, సంఘాలు సహకారం అందించాలని సీఎం జగన్ కోరారు. వర్చువల్ శిక్షణ ఇవ్వడం 15,000 మందికిపైగా ఆశా కార్యకర్తల నైపుణ్యాలను పెంపొందించేందుకు దోహదం చేస్తుందన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనిని కూడా ఎన్నారై డాక్టర్ల బృందం కలసినట్లు ఏపీఎన్‌ఆర్‌టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సమావేశంలో ఏపీఎన్‌ఆర్‌టీ చైర్మన్ వెంకట్ మేడపాటి, విదేశీ వైద్య వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు డాక్టర్ ఎన్.వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment