
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ నివాస గృహ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వచ్చే ఉగాది సందర్భంగా ఇంటి స్థలం పట్టా జారీ చేసేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఉగాది పర్వదినం సందర్భంగా 25 లక్షల మందికి నివాస స్థల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం లబ్ధిదారుల ఎంపిక, అవసరమైన భూమి సేకరణకు ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే నివాస స్థల పట్టాల జారీకి 22 లక్షల మంది అర్హులను అధికారులు ఖరారు చేశారు. వీరి జాబితాలను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో పెట్టారు. నాలుగైదు రోజులుగా పలు వార్డు, గ్రామ సచివాలయాల్లో గ్రామసభలు కూడా నిర్వహించి లబ్ధిదారుల జాబితాలకు ఆమోదం తెలిపారు.
అర్హుల్లో ఏ ఒక్కరికీ ఇంటి స్థలం రాలేదన్న మాట ఉండరాదని, సంతృప్త స్థాయిలో లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో అర్హుల జాబితాలో పేర్లు లేని వారు జనవరి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వివాదం లేని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న వారికి (రెండు సెంట్ల లోపు) పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి కేవలం రూపాయికే వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని కూడా సీఎం ఆదేశించారు. ఏదైనా కారణాల వల్ల ఎవరి పేరైనా అర్హుల జాబితాలో లేకపోతే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరి వరకూ వచ్చే దరఖాస్తులను పరిశీలించి అర్హులందరి పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చి నివాస స్థల పట్టాలు ఇచ్చే దిశగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్.. జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ఈ మొత్తం ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసేందుకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
21,948.72 ఎకరాలు సిద్ధం
గ్రామీణ ప్రాంతాల్లో 19,389.05 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 2,559.67 ఎకరాలు ఇప్పటి వరకు మొత్తం 21,948.72 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అధికారులు గుర్తించారు. ఇది కాకుండా ఇంకా అవసరమైన భూమిని గుర్తించేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. అవసరాలకు సరిపడా ప్రభుత్వ భూమి లేని ప్రాంతాల్లో సంప్రదింపుల ద్వారా సేకరించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)భూ సేకరణకు పరిశ్రమల శాఖ జారీ చేసిన జీఓఎంఎస్ నంబరు 181 (తేదీ 19–12–2016), పీఎంఏవై కింద ఇళ్ల నిర్మాణానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీఓఎంఎస్ నంబరు 214 (తేదీ 9–7–2018) ప్రకారం జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ భూ యజమానులతో సంప్రదించి భూమిని సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అవసరమైన మొత్తాన్ని విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. ఇదిలా ఉండగా ఈ నెల 22వ తేదీ నాటికి సుమారు 22 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment