‘బాబు’ వంచనను ఎండగట్టడమే లక్ష్యం
జగన్ దీక్షను విజయవంతం చేయండి
భారీగా తణుకుకు తరలి రండి
రైతుల కోసం ఉద్యమం కొనసాగిద్దాం
వైఎస్సార్ సీపీ శ్రేణులకు జ్యోతుల పిలుపు
జగ్గంపేట : అధికారం కోసం తప్పుడు హామీలను ఇచ్చి తరువాత ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వంచనను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో చేపట్టనున్న నిరశన దీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. ఈ నెల 31, ఫిబ్రవరి 1న చేపట్టే దీక్షను విజయవంతం చేసేందుకు ఇక్కడి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులతో సోమవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. జ్యోతుల మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల వాగ్దానాలు, వైఫల్యాలపై రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు జగన్ దీక్షను చేపడుతున్నారన్నారు.
రాష్ట్రంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యవసాయానికి సంబంధించి వనరులు, ఎత్తిపోతల పథకాలు ఎక్కువగా ఉండడంతో తణుకు ఎంచుకున్నామని, ఫిబ్రవరి 1న తూర్పుగోదావరి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని పేర్కొన్నారు. జిల్లాలో 5 గురు ఎమ్మెల్యేలు ఉన్నందున ఎక్కువ మంది జనం హాజరవుతారనే నమ్మకం ఉందన్నారు. రైతు రుణమాఫీపై అసెంబ్లీలో గంటా 45 నిమిషాలు మాట్లాడిన చంద్రబాబు రాజధాని అనే సమస్యను సృష్టించి పక్కదారి పట్టించారని, సమస్యల నుంచి తప్పించుకునేందుకు జపాన్, సింగపూర్ వంటి దేశాలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బడ్జెట్ సమావేశాలు 40 రోజులు జరిగితే నిధుల కేటాయింపునకు ఆస్కారం ఉంటుందని, 16 రోజులకు కుదిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ దీక్ష ద్వారా యావత్ రాష్ట్రాన్ని కదిలిస్తామని, రెండు రోజులతోనే ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.
గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టండి..
టీడీపీ నాయకులు కొందరు గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారని, తాను ఆ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని జ్యోతుల స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వంపై దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రచారాన్ని కార్యకర్తలు, నాయకులు తిప్పి కొట్టాలన్నారు. జెడ్పీటీసీలు జ్యోతుల నవీన్ కుమార్, వీరంరెడ్డి కాశీబాబు, బోస్‌బాబు, వైస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం తదితరులు పాల్గొన్నారు.