ఏపీకి సాయం చేయాలని కోరిన సీఎం జగన్‌ | YS Jagan Meets Amit Shah | Sakshi
Sakshi News home page

అమిత్‌ షాతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ

Published Tue, Oct 22 2019 11:08 AM | Last Updated on Tue, Oct 22 2019 5:08 PM

YS Jagan Meets Amit Shah - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. సుమారు 45 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై  సీఎం వైఎస్‌ జగన్‌, అమిత్‌ షాతో చర్చించారు. సీఎం వైఎస్‌ జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మర్గాని భరత్‌, నందిగం సురేశ్‌, రఘురామకృష్ణంరాజు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు కింద రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలోని హామీలు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్‌, శ్రీశైలంలకు గోదావరి వరదజలాల తరలింపుపై సీఎం వైఎస్‌ జగన్‌ అమిత్‌ షాతో చర్చించారు. రాష్ట్ర విభజన పరిశ్రమలు , సేవా రంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని తెలిపారు. ఆదాయంలో ఈ రంగాల వాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమని అమిత్‌ షాకి సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

2014-15 రెవెన్యూ లోటును కాగ్‌తో సంప్రదించి సవరిస్తామని గతంలో ఇచ్చిన హామీని అమిత్‌షాకు గుర్తుచేశారు. ఆ మేరకు సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికోసం రాష్ట్ర పునర్‌ విభజన చట్టంద్వారా కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం చేపట్టాలన్నారు. అలాగే ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణ అంశాన్నికూడా సీఎం ప్రస్తావించారు.  వీటితోపాటు విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రీయల్‌ కారిడార్‌, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులను సమకూర్చాల్సిందిగా కోరారు. 

వెనకబడ్డ జిల్లాలకు కేటాయించే నిధుల క్రైటీరియాను మార్చాలన్నారు. ఏపీలో వెనకబడ్డ జిల్లాల్లో తలసరి రూ. 400 రూపాయలు ఇస్తే, బుందేల్‌ఖండ్‌, కలహండి ప్రాంతాలకు తలసరి రూ. 4000 ఇస్తున్నారని చెప్పారు.  అదే తరహాలో ఏపీలోని వెనకబడ్డ జిల్లాలకు ఇవ్వాలన్నారు. ఏపీలో వెనకబడ్డ 7 జిల్లాలకు ఇప్పటివరకూ రూ. 2100కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 1050 కోట్లుమాత్రమే ఇచ్చారని.. మిగిలిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,548.87 కోట్లకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అందులో రూ.33వేలకోట్లు భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌కు ఖర్చు అవుతుందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ. 5,073 కోట్లను వెంటనే విడుదలచేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం రూ.16 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. వీలైనంత త్వరలో నిధులు ఇవ్వడానికి సంబంధిత మంత్రిత్వశాఖను కోరాలన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్‌ ప్రక్రియద్వారా రూ. 838 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని అమిత్‌షాకు సీఎం జగన్‌ తెలిపారు. హెడ్‌ వర్క్స్‌, హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులో రూ. 780 కోట్లు, టన్నెల్‌ పనుల్లో రూ. 58 కోట్లు ఆదా అయిన విషయాన్ని వివరించారు.

నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి వరదజలాల తరలింపు అంశాన్ని సీఎం జగన్‌ అమిత్‌ షాతో చర్చించారు. గడచిన 52 సంవత్సరాల్లో కృష్ణానదిలో నీటి లభ్యత సగటున ఏడాదికి 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. మరోవైపు గోదావరిలో గడచిన 30 సంవత్సరాలుగా సగటున ఏడాదికి 2,780 టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయని తెలిపారు.  కృష్ణా జలాలపై ఆధారపడ్డ రాయలసీమ, కృష్ణాడెల్టా సహా తాగునీరు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించే ప్రాజెక్టును చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖలను ఆదేశించాలని కోరారు. దీనివల్ల రాష్ట్రంలోని సాగునీరు, తాగునీరు కొరత ఉన్న ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, ఆ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు అనూహ్యంగా మారుతాయని సీఎం వైఎస్‌ జగన్‌ అమిత్‌ షాకు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement