
మైనారిటీల ఆశాజ్యోతిగా జగన్ వెలుగొందుతున్నారని, పాదయాత్రలో కాట్రావులపల్లి జంక్షన్ వద్ద జగన్‌ను కలిసిన గోకవరం మండలం యర్రంపాలేనికి చెందిన ముస్లింలు షేక్ మగ్దూమ్ (రఫీ), ఇష్రత్, షమీ సుల్తాన్, తహారా బేగం, రూహీ, షోయన, హనీఫ్ తదితరులు అన్నారు. జనం కోసం పాటు పడుతున్న మీకు అంతా మంచి జరగాలని అల్లాను ప్రార్థిస్తున్నామని చెప్పామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు రిజర్వేషన్‌ను కల్పించి ఆదుకున్నారని, తమ కుటుంబాలు బాగుపడాలంటే వైఎస్సార్ బిడ్డ జగన్ సీఎం కావాలని ఆశిస్తున్నామన్నారు. ఆయనపైనే అన్ని ఆశలు పెట్టుకున్నామన్నారు. సామాన్యులతో సైతం జగన్ ప్రేమగా మాట్లాడుతున్నారని, జనం సమస్యలపై అవగాహన, వాటిని పరిష్కరించే నేర్పరితనం జగన్‌కే ఉన్నాయని తాము నమ్ముతున్నామని ముస్లింలు అభిప్రాయపడ్డారు.