మీకు ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వ హింస ఆగలేదు | ys jagan met governor | Sakshi
Sakshi News home page

మీకు ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వ హింస ఆగలేదు

Published Tue, May 5 2015 2:16 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

సోమవారం హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతి పత్రం ఇస్తున్న   వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో పార్ట - Sakshi

సోమవారం హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతి పత్రం ఇస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో పార్ట

- గవర్నర్‌కు జగన్ వినతిపత్రం
- రాష్ట్రప్రభుత్వం బరితెగించి హింసకు పాల్పడుతోంది
- ఈ హత్యాకాండపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వండి
 
హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ హత్యలపై మీ దృష్టికి గతంలో ఒకసారి తెచ్చినా అవి ఆగడం లేదని, టీడీపీ వారు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దారుణ హింసను కొనసాగిస్తూనే ఉన్నారని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం గవర్నర్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. గత ఏడాది జూలై 7వ తేదీన కూడా గవర్నర్‌ను కలిసి హింసాకాండపై ఫిర్యాదు చేసిన విషయాన్ని అందులో ప్రస్తావించారు. వినతిపత్రంలోని ముఖ్యాంశాలు...


- రాష్ట్రంలో టీడీపీ మెజారిటీ అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన తరువాత, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందు నుంచే (జూన్ 8, 2014 కన్నా ముందు నుంచే) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు చెలరేగాయి. నెల రోజుల్లోపే 17 మంది వైఎస్సార్‌సీపీ నేతలను, కార్యకర్తలను హత్య చేశారు. మరో 110 మందిని గాయపరిచారు. దాడులకు గురైన వారిలో సగం మంది ఎస్సీలు, మహిళలే ఉన్నారు.

- పోలీసులు కొన్ని కేసులను నమోదు చేయకపోగా, కొన్నింటిలో వారే సూత్రధారులుగా వ్యవహరించడం దారుణం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చల్లో ఈ అంశాన్ని ప్రతిపక్ష నేతగా నేను లేవనెత్తినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ముఖ్యమంత్రే సాక్షాత్తూ ఇలాంటివి ప్రోత్సహిస్తుంటే ఇక న్యాయం కోసం మేమెక్కడికి వెళ్లాలని గతంలోనే మేం మీ దృష్టికి తెచ్చాం. అయినా పరిస్థితుల్లో మార్పురాకపోగా, మరింత దిగజారుతున్నాయి.

- తమనెవ్వరూ ఏమీ చేయజాలరనే విచ్చలవిడితనంతో రాష్ట్రప్రభుత్వం వైఎస్సార్‌సీపీ శ్రేణులపై హింసాకాండకు పాల్పడుతోంది. భూమిరెడ్డి ప్రసాదరెడ్డిని ఎమ్మార్వో కార్యాలయంలోనే హతమార్చడమే ఇందుకు తార్కాణం. పోలీస్‌స్టేషన్ పక్కనే ఈ హత్య జరిగింది. ప్రసాదరెడ్డిని తహసిల్ కార్యాలయానికి పిలిపించడం, అక్కడే హతమార్చడం చూస్తే ఈ హత్యలో తహశీల్దార్, ఆర్‌ఐల హస్తం ఉందనేది స్పష్టమవుతోంది. అయినా ఇది ఫ్యాక్షన్ (వర్గ వైషమ్యాల) వల్ల జరిగిందని ప్రభుత్వం నమ్మబలుకుతోంది. మార్చి 31వ తేదీన కిష్టపాడు గ్రామంలో సింగిల్ విండో ఛైర్మన్ విజయభాస్కరరెడ్డిని కార్యాలయానికి పిలిపించి హతమార్చడం కూడా స్థానిక ఎస్‌ఐ పర్యవేక్షణలోనే జరిగింది.

- ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు వీటి వెనుక ఉన్నారనేది తెలుస్తోంది. వీళ్లంతా కలిసి రాజకీయ హత్యలు చేసేందుకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు కొనసాగించేందుకు ఎస్‌ఐలను, తహశీల్దార్లను పావులుగా ఉపయోగించుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అనంతపురం జిల్లాలో జరిగిన హత్యలే ఇందుకు నిదర్శనం.


- ప్రసాదరెడ్డి హత్యతో ఆగ్రహావేశపరులైన జనాన్ని శాంతింపజేసేందుకు మా పార్టీ మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, స్థానిక నేత తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డిలు ప్రయత్నించారు. హత్య చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా మా పార్టీ నేతలిద్దరినీ అరెస్టు చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. హంతకులను శిక్షించకపోతే టీడీపీ కార్యకర్తలు మరింత బరితెగిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సీబీఐ దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా మనవి చేస్తున్నాం.


- జగన్‌తోపాటు గవర్నర్‌ను కలిసిన వారిలో పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, శాసనసభాపక్షం ఉపనేతలు జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఆర్.కె.రోజా, గౌరు చరితారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పోతుల రామారావు, యక్కలదేవి ఐజయ్య, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బూడి ముత్యాలనాయుడు, దిడ్డి ఈశ్వరి, పీడిక రాజన్నదొర, అత్తారు చాంద్‌బాష, దాడిశెట్టి రాజా, గుమ్మనూరు జయరామయ్య, మణి గాంధీ, వై.బాలనాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరామయ్య, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనంతపురం పార్టీ నేతలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, రమేష్‌రెడ్డితో పాటు పలువురు నేతలున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement