మాట నిలుపుకున్న సీఎం జగన్‌ | YS Jagan MOhan Reddy Announce Three Names To Council | Sakshi
Sakshi News home page

మాట నిలుపుకున్న వైఎస్‌ జగన్‌ 

Published Mon, Aug 12 2019 11:06 AM | Last Updated on Mon, Aug 12 2019 6:31 PM

YS Jagan MOhan Reddy Announce Three Names To Council - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. మంత్రి మోపిదేవి వెంకటరమణతో పాటు మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిలను పార్టీ అభ్యర్థులు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకోని తొలి విడత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆయనకు అవకాశం కల్పించారు. హిందుపూర్‌లో ఓటమి చెందిన ఇక్బాల్‌కు, బనగానపల్లెలో విజయానికి కృషి చేసిన చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. మండలిలో ఖాళీ అయిన మూడు స్థానాలూ ఎమ్మెల్యేల కోటాకు సంబంధించినవే కావడంతో వీరి ఎన్నిక లాంఛనమే కానుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల ముందు వీరిద్దరికి ఇచ్చిన  హామీలను వైఎస్‌ జగన్‌ నెరవేర్చారు. మరికొందరికి కూడా ఇచ్చిన హామీలను భవిష్యత్తులో నెరవేర్చుతామని పార్టీ నేతలు చెబుతున్నారు. 

అనంతపురం జిల్లా హందూపురం నియోజకవర్గ నుంచి పోటీచేసిన మైనార్టీ నేత, రిటైర్డ్ రాయలసీమ ఐజీ మహ్మాద్ ఇక్బాల్  టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ చేతిలో ఆయన ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం మైనార్టీల అత్మీయ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇక్బాల్‌కు తొలి విడుత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా గెలిచే శాసనసభ్యుల కోటాలో ఆయనను మండలికి ఎంపిక చేశారు. సీఎం నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు. 

చల్లా వర్గీయుల్లో ఆనందం
2014 ఎన్నికల్లో చంద్రబాబు స్వయంగా చల్లా రామకృష్ణారెడ్డిని ఆహ్వానించి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చారు. అయితే.. టీడీపీ అధికారంలోకి వచ్చినా చల్లాకు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఏదో కంటి తుడుపు చర్యగా రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని అదీ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇచ్చారు. దీంతో చల్లా మాట తప్పిన చంద్రబాబు దగ్గర పనిచేయడం కంటే మాట ఇస్తే మడమ తిప్పని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దగ్గర పనిచేయడం ఉత్తమమని 2019 మార్చిలో వైఎస్సార్‌సీపీలో చేరారు.  ఆనాడు పార్టీ అధ్యక్షుడి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బనగానపల్లెలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి విజయానికి కృషి చేయాలని చల్లాకు సూచించారు. అంతేకాక మొదటి విడతలోనే ఎమ్మెల్సీని చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం మొదట విడతలోనే ఎమ్మెల్సీగా చల్లాను ఎంపిక చేయడంతో ఆయన వర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement