వెలిగొండ రెండో టన్నెల్‌లో రివర్స్‌ టెండరింగ్‌ | YS Jagan Mohan Reddy Calls Reverse Tenders For Veligonda Phase2 | Sakshi
Sakshi News home page

వెలిగొండ రెండో టన్నెల్‌లో రివర్స్‌ టెండరింగ్‌

Published Sun, Sep 22 2019 4:17 AM | Last Updated on Sun, Sep 22 2019 4:17 AM

YS Jagan Mohan Reddy Calls Reverse Tenders For Veligonda Phase2  - Sakshi

సాక్షి, అమరావతి: సాగునీటి పనుల ప్రక్షాళన, అవినీతి నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ‘రివర్స్‌ బిడ్డింగ్‌’ ప్రక్రియలో తొలి అడుగు బలంగా వేసిన రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగంలో మిగిలిపోయిన పనులను రూ.553.13 కోట్ల అంచనా వ్యయంతో ఎల్‌ఎస్‌–ఓపెన్‌ పద్ధతిలో 18 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో జలవనరుల శాఖ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సోమవారం నుంచి బిడ్‌లను స్వీకరిస్తారు. అక్టోబర్‌ 7 సాయంత్రం ఐదు వరకు టెండర్‌ డాక్యుమెంట్లను ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ 9న సాయంత్రం ఐదు గంటల్లోగా బిడ్‌లను దాఖలు చేయాలి. వచ్చే నెల 11న ఆర్థిక బిడ్‌ తెరుస్తారు. తక్కువ ధరకు కోట్‌ చేస్తూ బిడ్‌ దాఖలు చేసిన కాంట్రాక్టర్‌ను ‘ఎల్‌–1’గా ఎంపిక చేస్తారు.

ఆ కాంట్రాక్టర్‌ పేరును గోప్యంగా ఉంచి బిడ్‌లో కోట్‌ చేసిన ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి.. 2.45 గంటల పాటు ‘ఆన్‌లైన్‌’లో ఈ–ఆక్షన్‌ నిర్వహిస్తారు. ఆర్థిక బిడ్‌కు అర్హత సాధించిన కాంట్రాక్టర్లు 15 నిమిషాలకు ఒకసారి అంచనా వ్యయంలో 0.5 శాతం తక్కువ కోట్‌ చేస్తూ ఈ–ఆక్షన్‌లో పాల్గొనవచ్చు. ఈ–ఆక్షన్‌ గడువు ముగిసే సమయానికి ఎవరు తక్కువ ధరకు కోట్‌ చేస్తే వారినే ఎల్‌–1గా ఎంపిక చేసి సాంకేతిక అర్హతలను మరోసారి పరిశీలించి టెండర్‌ ఆమోదించాలని సీవోటీ(కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌)కి ప్రతిపాదనలు పంపుతారు. వాటిని పరిశీలించి అన్నీ సజావుగా ఉంటే సీవోటీ ఆమోద ముద్ర వేస్తుంది. పోలవరం ప్రాజెక్టు 65వ ప్యాకేజీ పనుల తరహాలోనే వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగం పనుల రివర్స్‌ టెండరింగ్‌లోనూ భారీ ఎత్తున ప్రజాధనం ఆదా అవుతుందని జలవనరుల శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బినామీల కోసం టీడీపీ హయాంలో అంచనాల పెంపు..
వెలిగొండ రెండో సొరంగం పనులను 2006–07లో హెచ్‌సీసీ–సీపీపీఎల్‌ రూ.735.21 కోట్లకు దక్కించుకుంది. ఈ పనులను పొడిగించిన గడువు ప్రకారం 2020 మార్చి నాటికి పూర్తి చేయాలి. కానీ హెచ్‌సీసీ–సీపీపీఎల్‌పై గతేడాది ఆగస్టులో 60 సీ కింద వేటు వేశారు. అప్పటికి 10.750 కి.మీ.ల పనులు పూర్తి కాగా రూ.489 కోట్లను చెల్లించారు. రూ.246.21 కోట్ల పనులు మాత్రమే మిగిలాయి. కానీ 60సీ కింద తొలగించినప్పుడు ఆ పనుల విలువను రూ.299.48 కోట్లుగా తప్పుగా లెక్కించారు. అనంతరం 2017–18 ధరల ప్రకారం ఆ పనుల విలువను రూ.720.26 కోట్లకు పెంచేశారు.

ఈ పనులకు రూ.570.58 కోట్ల అంచనాతో గతేడాది ఆగస్టులో టెండర్లు పిలిచిన టీడీపీ సర్కార్‌ వాటిని చంద్రబాబు బినామీ అయిన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 4.69 శాతం అధిక ధరకు అంటే రూ.597.35 కోట్లకు కట్టబెట్టి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చింది. రిత్విక్‌కు రూ.351.14 కోట్లకుపైగా దోచిపెట్టడానికి స్కెచ్‌ వేసినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇప్పటివరకూ ఆ సంస్థ 462 మీటర్ల పనులు మాత్రమే చేసింది. వాటి విలువ తీసివేయగా మిగిలిన పనుల విలువను రూ.553.13 కోట్లుగా లెక్కించారు. సత్వరమే పనులు పూర్తి చేయడం, అవినీతి నిర్మూలనకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని నిపుణుల కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

ఖజానాకు భారీ ఆదా!
వెలిగొండ పనుల్లో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా రెండో సొరంగంలో మిగిలిన 7.575 కి.మీ.ల పనులకు ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. టెండర్‌ డాక్యుమెంట్‌ నిబంధనల ప్రకారం బిడ్‌లు దాఖలుకు అర్హత ఉన్నట్లు కాంట్రాక్టర్లు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలి. బిడ్‌ దాఖలు గడువు పూర్తయిన రోజున అంచనా వ్యయంలో 2.5 శాతం బ్యాంకు గ్యారంటీ, ఒక శాతం ఈఎండీ(ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌) సమర్పించాలి. ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్లో పొందుపరిచిన అర్హతల ఆధారంగా బిడ్‌లు దాఖలు చేసిన వారిలో అర్హత ఉన్న కాంట్రాక్లర్లను ఆర్థిక బిడ్‌కు వెబ్‌సైట్‌ ఆటోమేటిక్‌గా ఎంపిక చేస్తుంది. అర్హత లేని వారిపై ఆటోమేటిక్‌గా వేటు పడుతుంది.

అనర్హత వేటు పడిన కాంట్రాక్టర్లు బ్యాంకు గ్యారంటీ రూపంలో చెల్లించిన రూ.13.82 కోట్లు, ఈఎండీ రూపంలో చెల్లించిన రూ.5.53 కోట్లు వెరసి రూ.19.35 కోట్లను అధికారులు జప్తు చేసి ఖజానాకు జమ చేస్తారు. ఆర్థిక బిడ్‌కు అర్హత సాధించిన వారిలో తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్‌–1గా ఎంపిక చేసి పేరు గోప్యంగా ఉంచుతారు. ఆయన కోట్‌ చేసిన ధరనే కాంట్రాక్టు విలువగా పరిగణించి ఈ–ఆక్షన్‌ నిర్వహిస్తారు. ఈ–ఆక్షన్‌లో ఎవరు తక్కువ ధరకు చేయడానికి ముందుకొస్తే వారికే పనులు అప్పగిస్తారు. దీనివల్ల ఖజానాకు భారీగా ఆదా అవుతుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వెలిగొండ మొదటి సొరంగం పనులను కాంట్రాక్టర్‌ నిబంధనల మేరకు చేస్తుండటంతో 2020 జూన్‌ నాటికి తొలి దశను పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం దీన్ని కొనసాగించాలని నిర్ణయించింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement