ఉపరాష్ట్రపతిగా వెంకయ్య గర్వకారణం: వైఎస్ జగన్
హైదరాబాద్: ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థి వెంకయ్య నాయుడికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి ఉండటం మొత్తం తెలుగు ప్రాంతానికే గర్వకారణం అని అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరగాలనే ఎల్లప్పుడూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తుందని చెప్పారు. శనివారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఘనవిజయం సాధించారు. మొత్తం 781 ఓట్లకుగాను 771ఓట్లు పోలవ్వగా వెంకయ్యనాయుడికి 516 ఓట్లు వచ్చాయి.
ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణగాంధీకి 244 ఓట్లు రాగా మొత్తం 272 ఓట్ల మెజార్టీతో వెంకయ్యనాయుడు గెలుపొందారు. మరోపక్క, విజయం సాధించిన వెంకయ్యకు గోపాలకృష్ణ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, భారత జాతి నిర్మాణంలో వెంకయ్యనాయుడు చాలా అంకితభావంతో పనిచేస్తారని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని పేర్కొంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంకయ్యపై అభినందనల వర్షం కురిపించారు.